ganesh chavithi
-
వినాయకుడి పూజలోని ఏకవింశతి పత్రాల విశిష్టత ఏంటో తెలుసా!
గణపతి పూజావిధానంలోనే ‘...పత్రం సమర్పయామి’ అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. ఆ పత్రిలో ఒక్కో ఆకుకు ఒక్కో విశిష్టత ఉంది. అవేమిటో తెలుసుకుందాం. మాచీ పత్రం (దవనం ఆకు): ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడంద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. వ్రణాలకు, కుష్టువ్యాధికి మందులా పనిచేస్తుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది. బృహతీ పత్రం (నేల మునగ ఆకు): దీనినే ‘వాకుడు ఆకు’ అని అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది. బిల్వ పత్రం (మారేడు ఆకు): దీనికే మరో పేరు ’బిలిబిత్తిరి’. ’త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మపాప సంహారం, ఏక బిల్వం శివార్పణం’ అని పూజిస్తాం. బిల్వ పత్రమంటే శివునికి ఎంత ప్రీతికరమో ఈ శ్లోకంద్వారా తెలుస్తోంది. ఈ మారేడు ఆకువల్ల నెమ్మదించే రోగగుణాలను పరిశీలిస్తే... బంక విరోచనాలు కట్టడిపోతాయి. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలైనది. నేత్రసంబంధమైన రుగ్మతలను అరికడుతుంది. శ్రీమహాలక్ష్మి తపస్సువల్ల ఈ వక్షం జన్మించినదట. మారేడు దళంలో మూడు ఆకులు, ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది. దూర్వాయుగ్మం (గరిక): చర్మరోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులు నిరోధించడంలో, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్నిస్తుంది. గజ్జిని నియంత్రిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిణి లా పనిచేసి మాడ్చేస్తుంది. దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు): దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగిస్తుంది. ఉదరకోశ వ్యాధులకు, చర్మరోగాలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక సంబంధ సమస్యలకు, గడ్డలు, ప్రణాలకు ఉమ్మెత్త ఆకు చాలా బాగా పనిచేస్తుంది. బదరీ పత్రం (రేగు ఆకు): జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. వీర్యవద్ధికి దోహదపడుతుంది. రక్త దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరిచేతుల దురదలు తగ్గుతాయి. అపామార్గ పత్రం (ఉత్తరేణి): పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు. కడుపు శూల, అజీర్తి, మొలలు, వేడిసెగ గడ్డలు, చర్మపుపొంగుకు ఉత్తరేణి చాలా మంచిది. దీనితో పళ్లు తోముకున్నట్టయితే దంతాలు గట్టిపడతాయి. దీనికే పాపసంహారిణి, రాక్షస సంహారిణి అనికూడా పేర్లున్నాయి. తులసీ పత్రం: ఇందులో చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గు, చర్మరోగాలు, గొంతు సంబంధ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు తగ్గించగలదు. రక్తస్రావాన్ని, అతిసారను అదుపుచేస్తుంది. వాంతులు, కడుపుశూల అరికడుతుంది. విషాన్ని హరించే గుణంకూడా తులసి ఆకులో ఉంది. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. కలియుగ కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పాలి. చూత పత్రం (మామిడి ఆకు): దీనిని ఏ శుభకార్యమైనా, పర్వదినమైనా గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి. మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కుట్టుకుని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత, చిగుళ్ల బాధలు, పాదాల పగుళ్లు వంటివి మామిడాకుతో నివారించుకోవచ్చు. చక్కెర వ్యాధికి ఉపశమనమిస్తుంది. దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తి కలిగిస్తుంది. కరవీర పత్రం (ఎర్ర గన్నేరు ఆకు): పేలను నివారించి శిరోజాలకు రక్షణనిస్తుంది. గుండె జబ్బులు, మూత్రవ్యాధులు, కుష్టు రోగం, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కణుతులను కరిగించే గుణం పుష్కలంగా ఉంది. విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి): జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, రొమ్ము పడిశం, దగ్గు తగ్గించగలదు. దాడిమి పత్రం (దానిమ్మ ఆకు): రక్తవద్ధి కలుగజేస్తుంది. పిత్తహరిణి, అతిసార, మలేరియా, ఇతర జ్వరాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను నివారిస్తుంది. పిల్లలకు కడుపులో నులిపురుగులను, నలికెల పాములను చేరనివ్వదు. దేవదారు పత్రం (దేవదారు ఆకు): జ్ఞానవద్ధి, జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి. పుండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, విరోచనాలు తగ్గించగలదు. దీని తైలం కళ్లకు చలువనిస్తుంది. 14. మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. దీని నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలనివ్వదు. సిందూర పత్రం (వావిలాకు) : తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టించగలదు. కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది. జాజి పత్రం (జాజి ఆకు) : తలనొప్పి, చర్మవ్యాధులు, నోటి పూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటివాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్లలకు జాజి ఆకు మంచి మందు. జాజికాయ, జాపత్రికి చెందినదీ ఆకు. సన్నజాజి ఆకు కాదు. గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) : ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. శమీ పత్రం (జమ్మి ఆకు) : చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి రుగ్మతలనుంచి విముక్తి చూపించి ప్రశాంతతను చేకూరుస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది. అశ్వత్థ పత్రం (రావి ఆకు) : కంటివ్యాధులు, అతిసార, సంభోగ రోగాలు, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్లు, చర్మ రోగాలు, పుండ్లు తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది. జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది. అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు) : దీనిలో నల్లమద్ది ఆకుకూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. వ్రణాలకు, శరీరంలో మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. వాత పిత్త కఫాలకు మంచిది. పితకర్మలలో వినియోగిస్తారు. దీని రసం రుమాటిజమ్ను అరికడుతుంది. నల్లమద్ది ఆకు కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. అర్క పత్రం (జిల్లేడు ఆకు) : సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు, చర్మవ్యాధులు, ఉబ్బసం, వాతం, కడుపు శూల వంటి దీర్ఘరోగాలను నివారిస్తుంది. అమిత ఉష్ణతత్వంనుంచి విముక్తి కలిగిస్తుంది. రథసప్తమినాడు ఆత్మకారకుడైన సూర్యభగవానుడి ప్రీతికోసం జిల్లేడు ఆకులను తల, భుజాలపై పెట్టుకుని తలారా స్నానంచేయడం ఆనవాయితీ. – డి.వి.ఆర్. (చదవండి: వినాయకుని పూజలో చదవాల్సిన కథ) -
మీ చిట్టి చేతులతోటే మట్టి గణపతి తయారు చేయండి ఇలా..
సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో వినాయకుని పుట్టినరోజు ... గణేశ్ చవితి పండుగ వస్తోంది! ఈ రోజున పెద్దవాళ్లు, పెద్ద పెద్ద పందిళ్ల నిర్వాహకులూ పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి భారీ ఎత్తున పూజించడం మీకు తెలుసు కదా... అయితే ప్రకృతి ప్రేమికుడైన గణనాయకుడు ప్రకృతి సిద్ధమైన, సులువుగా తిరిగి ప్రకృతిలో కలిసిపోయేలా ఉండే మట్టిగణపతి విగ్రహాలను పూజించే వారికే బోలెడన్ని ఆశీస్సులు అందిస్తాడని మీకు తెలుసు కదా... మట్టి గణపతిని మీ చిట్టి చేతులతో స్వయంగా మీరే తయారు చేసి పూజలో ఉంచి, గణపతికి ఇష్టమైన పిండివంటలు ఆరగింపజేసి, మీ కోరికలన్నీ కోరండేం! సమయం ఆసన్నమైంది. ‘అయ్యో! మాకు విగ్రహం తయారు చేయడం రాదే అనో, మా దగ్గర బంకమట్టి లేదు కదా... ఇప్పుడెలా’ అనో దిగులు పడకండి. మట్టిగణపతి విగ్రహం తయారు చేసే విధానాన్ని మేమే మీకు నేర్పిస్తాం. ప్రతి సంవత్సరం లాగే ఇప్పుడు కూడా సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో మట్టి గణపతి విగ్రహాల తయారీలో మీకు శిక్షణనిచ్చేందుకు ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 16వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో 5 నుంచి 16 సంవత్సరాల లోపు గల బాలలందరూ పాల్గొనవచ్చును. దీనికి ఎటువంటి రుసుము చెల్లించనక్కరలేదు. బంకమట్టిని నిర్వాహకులే ఉచితంగా సమకూర్చుతారు. అయితే మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే... దిగువ తెలిపిన నంబర్లకు ఫోన్‌చేసి మీ పేర్లను నమోదు చేసుకోవడమే! ఈ శిబిరంలో పర్యావరణానికి మేలు చేసే విధంగా మట్టిని గణనాయకుని ప్రతిమలుగా రూపొందించే విధానాన్ని నేర్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం..? మీరు కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, మీరు తయారు చేసిన వినాయక ప్రతిమలను ఇంటికి తీసుకు వెళ్లి పూజించండి. శిక్షణకు వచ్చేవారు పాత వాటర్‌బాటిల్, పాతవస్త్రం వెంటతీసుకు రావడం మాత్రం మరచిపోవద్దేం! అవిఘ్నమస్తు, అభీష్ట సిద్ధిరస్తు. శిబిరం చిరునామా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం వంజంగి హిల్స్ రోడ్డు, పాడేరు తేదీ : 16–09–2023 సమయం : ఉ. 9.30 నుంచిమధ్యాహ్నం 12.30 గం.ల వరకు. రిజిస్ట్రేషన్లకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : 94915 53782, 70757 09205 -
మీ చిట్టి చేతులతోటే మట్టి గణపతి తయారు చేయండి ఇలా..
వినాయకుని పుట్టినరోజు ... గణేశ్ చవితి పండుగ వస్తోంది! ఈ రోజున పెద్దవాళ్లు, పెద్ద పెద్ద పందిళ్ల నిర్వాహకులూ పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి భారీ ఎత్తున పూజించడం మీకు తెలుసు కదా... అయితే ప్రకృతి ప్రేమికుడైన గణనాయకుడు ప్రకృతి సిద్ధమైన, సులువుగా తిరిగి ప్రకృతిలో కలిసి పోయేలా ఉండే మట్టిగణపతి విగ్రహాలను పూజించే వారికే బోలెడన్ని ఆశీస్సులు అందిస్తాడని మీకు తెలుసు కదా... మట్టి గణపతిని మీ చిట్టి చేతులతో స్వయంగా మీరే తయారు చేసి పూజలో ఉంచి, గణపతికి ఇష్టమైన పిండివంటలు ఆరగింపజేసి, మీ కోరికలన్నీ కోరండేం! సమయం ఆసన్నమైంది. ‘అయ్యో! మాకు విగ్రహం తయారు చేయడం రాదే అనో, మా దగ్గర బంకమట్టి లేదు కదా... ఇప్పుడెలా’ అనో దిగులు పడకండి. మట్టిగణపతి విగ్రహం తయారు చేసే విధానాన్ని మేమే మీకు నేర్పిస్తాం. ప్రతి సంవత్సరం లాగే ఇప్పుడు కూడా సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో మట్టి గణపతి విగ్రహాల తయారీలో మీకు శిక్షణనిచ్చేందుకు ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 16వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో 5 నుంచి 16 సంవత్సరాల లోపు గల బాలలందరూ పాల్గొనవచ్చును. దీనికి ఎటువంటి రుసుము చెల్లించనక్కరలేదు. బంకమట్టిని నిర్వాహకులే ఉచితంగా సమకూర్చుతారు. అయితే మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే... దిగువ తెలిపిన నంబర్లకు ఫోన్‌చేసి మీ పేర్లను నమోదు చేసుకోవడమే! ఈ శిబిరంలో పర్యావరణానికి మేలు చేసే విధంగా మట్టిని గణనాయకుని ప్రతిమలుగా రూపొందించే విధానాన్ని నేర్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం..? మీరు కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, మీరు తయారు చేసిన వినాయక ప్రతిమలను ఇంటికి తీసుకు వెళ్లి పూజించండి. శిక్షణకు వచ్చేవారు పాత వాటర్‌బాటిల్, పాతవస్త్రం వెంటతీసుకు రావడం మాత్రం మరచిపోవద్దే! సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో అవిఘ్నమస్తు, అభీష్ట సిద్ధిరస్తు. శిబిరం చిరునామా: తేది : 16–09–2023 (శనివారం) సమయం : ఉ. 9.30 గం.ల నుంచిమధ్యాహ్నం 12.30 గం.ల వరకు. రిజిస్ట్రేషన్లకు సంప్రదించవలసిన శ్రీసాయి విద్యానికేతన్ సాయిగీతా స్కూల్, డో.నంబర్ : 2/189, పెద్ద బజారు, పుట్టపర్తి. ఫోన్ నంబరు : 9912220726 -
Ganesh Chaturthi 2022: వినాయకుడి 8 అవతారాలు.. వాటి చరిత్ర ఇదే
వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు.. ఆయన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని వేదాంతులు చెబుతుంటారు. గణేశుని ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చని సూచిస్తుంటారు. అందుకే గణేశుడే ప్రముఖంగా ఆరాధించబడే గాణపత్యం అనే శాఖ కూడా ఉంది.వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. ఆ ఎనిమిది వివరాలను, గణనాథుని మహిమలను తెలుసుకుని ఆ వినాయకుని సేవించి తరిద్దాం. వక్రతుండుడు పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోయి దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. ఏకదంతుడు చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే ç్ఛౌలితం దక్కుతుందన్నాడు. లోకాధి పత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండాపోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. మహోదరుడు శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంత కాలమైనా ఆయన ఆ తపస్సుని వీడకపోవడంతో పార్వతి కంగారుపడి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడి రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబో దరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. గజాననుడు కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసు కున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచి స్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాకతప్పవు. లంబోదరుడు దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించగా విష్ణువు తన నిజరూపంలోకి రావడంతో శివుడు భంగపడి క్రోధితుడయి క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు.క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడగా హర్షం,శోకం అనేసంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. వికటుడు పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతట ఆ రుషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షం అయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒకోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్నిఎదుర్కోవచ్చుననీ వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది. విఘ్నరాజు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విç్ఛ్నౌురాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విç్ఛ్నౌూలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి. ధూమ్రవర్ణుడు అరిషడ్వార్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతుని ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ‘నేను’ అనే అహంకారాన్ని పక్కనపెట్టి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పరులకు ఉపకారం చేస్తూ దైవ చింతనతో దైవాన్ని వెతుకుతూ మోక్షంకోసం సాధన చేయడమే దీని సారాంశం. -
భారీగా పెరిగిన గణేష్ విగ్రహాల ధరలు
-
షికాగోలో వినాయక చవితి వేడుకలు
షికాగో: అరోరా/నేప్విల్లే నగరంలో ఫాక్స్వ్యాలీ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆరోసారి వైభవోపేతమైన వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా భజనలు, పూజలు, హోమాలు, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నెమళ్లతో అల్లిన పందిరిలో కృష్ణుడు అండగా వినాయకుడిని నెమలిపై ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజించారు. ప్రతీరోజు ఇక్కడ నిర్వహించిన హారతికి వందల సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు భక్తులు స్వీకరించారు. మూడో రోజు జరిగిన గణేష్ నిమజ్జనం సందర్భంగా మహారాష్ట్ర మండల్ ఆధ్వర్యంలో ఢోల్తాషా నిర్వహించగా అంతా ఆనందంగా నృత్యాలు చేశారు. వినాయకుడి ఊరేగింపు కోలాహలంగా సాగింది. అరోరా నగర మేయర్ రిచర్డ్ సీ ఇర్విన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సహాకరించిన ప్రతీ ఒక్కరికీ ఎఫ్వీజీయుఎస్ బోర్డు తరఫున అధ్యక్షుడు కొత్తకొండ విజయ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువాహిని సాహితీ సదస్సు -
వినాయక నిమజ్జనానికి అనుమతివ్వొద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలతోపాటు ఇతర పర్వదినాల సందర్భంగా జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. గత ఏడాది తరహాలోనే ఎటువంటి జనసమూహాలకు అనుమతి ఇవ్వరాదని, అలాగే విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వరాదని, ఈ మేరకు గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించేందుకు మరికొంత గడువుకావాలని స్పెషల్ జీపీ హరీందర్ అభ్యరి్థంచడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, వినాయక చవితి తర్వాత నిర్ణయాన్ని చెబుతారా అంటూ మండిపడింది. వారంలోగా ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. -
ఉదయం నుంచే గణేశ్ నిమజ్జనం
► సాయంత్రానికల్లా పూర్తి చేయాలి: హోంమంత్రి ► సెప్టెంబర్ 5న నిమజ్జనానికి ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గణేశ్ చవితి, గణేశ్ నిమజ్జనాన్ని శాంతి యుతంగా, ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నిమజ్జ నాన్ని సెప్టెంబర్ 5న ఉదయం నుంచే ప్రారం భించేలా చూడాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు. సాయంత్రం లోగా నిమజ్జనం పూర్తి చేయాలని పేర్కొ న్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అదే రోజు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో గణేశ్ చవితి, గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. గణేశ్ విగ్రహాల ఊరేగింపు మార్గాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్నామని, హుస్సేన్‌సాగర్ చుట్టూ 160 క్రేన్లతో పాటు అదనంగా మొబైల్ క్రేన్లను నీటిపారుదల శాఖ సాయంతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బందోబస్తు కోసం 35వేల మంది పోలీసు సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. విగ్రహాల ఉరేగింపు మార్గాల మరమ్మతులు, పారిశుధ్యం, రహదారుల విద్యుదీకరణ, మొబైల్ టాయిలెట్లు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తుల కోసం వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడిసిన్స్, అంబులెన్సుల వసతులు కల్పిస్తామని చెప్పారు. అదనంగా 500 బస్సులు రాత్రి సమయాల్లో కూడా నడుపుతామని వివరించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. వినాయక చవితి, బక్రీద్ ఒకే సమయంలో వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గణేశ్ మండపాన్ని జియోట్యాగింగ్ చేసి పర్యవేక్షిస్తామని చెప్పారు. -
మందు, విందులతో చిందేసిన ముంబై...
► ఒక్కరోజులో ఆరు లక్షల కోళ్లు, లక్ష మేకలు తినేశారు. ► మంచి నీళ్లలా మందు తాగేశారు.. సాక్షి, ముంబై: ఆషాఢ ఏకాదశి ముగింపు (ఆదివారం) ఒక్క రోజే పెద్ద ఎత్తున మాంసం, మద్యం విక్రయాలు జరిగాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో చివరి రోజు ఆదివారం ముంబై వాసులు పెద్ద ఎత్తున పార్టీలు, విందులు చేసుకున్నారు. రాత్రి బార్లు, హోటళ్లు, డాబాలు, వైన్ షాపులు ఇలా ఎక్కడ చూసిన కొనుగోలుదార్లతో కిటకిటలాడాయి. ఇలా ఆదివారం ఒక్క రోజు ముంబైలో ఏకంగా ఆరు లక్షల కోళ్లు, లక్షాకుపైగా మేకల మాంసం విక్రయించారు. అదేవిధంగా మద్యం, బీర్లు కూడా లక్షల లీటర్లలో అమ్ముడుపోయాయి. ఎందుకంటే..?: సోమవారం నుంచి ప్రారంభమైన శ్రావణమాసం గణేశోత్సవాలు పూర్తయ్యేంత వరకు ఉంటుంది. దీంతో అనేక మంది ముంబై వాసులు గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేసేంత వరకు మాంసం, మద్యాన్ని ముట్టుకోరు. దీంతో చివరి రోజే తృప్తిగా మాంసం ఆరగించి మద్యాన్ని సేవించారు. నగరంలో బార్లలో, హోటళ్లలో చేసుకునే పార్టీలతోపాటు టవర్లు, సొసైటీ భవనాల టెర్రస్‌లపై అనేక మంది నివాసులు అర్థరాత్రి వరకు పార్టీలు చేసుకున్నారు. అదేవిధంగా చివరి రోజు పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన వారి సంఖ్య కూడా అధికాంగానే ఉంది. దీంతో జలాశయాలు, రిసార్టులు, దాబాలన్నీ జనాలతో కిటకిటలాడాయి. అక్కడ పెద్ద ఎత్తున జనం మాంసంతో విందులు చేసుకున్నారు. ఈసారి శనివారం కూడా కలిసిరావడంతో ఒక రోజు ముందు నుంచే జల్సాలు చేసుకోవడం ప్రారంభించారు. కాని ఈ శ్రావణ మాసం పుణ్యమా అని కేవలం రెండు రోజుల్లో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. -
గణనాథుల చెంతకు ఘనమైన లడ్డూలు
‘భక్తాంజనేయ’ నుంచి గాజువాకకు 7,885 కేజీల లడ్డూ తాపేశ్వరం ‘సురుచి’ నుంచి ఖైరతాబాద్‌కు 5,150 కేజీల లడ్డూ మండపేట రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లోని తాపేశ్వరంలో తయారైన 2భారీ లడ్డూలు గురువారం గణనాథులను చేరేందుకు తరలివెళ్లాయి. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద లడ్డూగా తాపేశ్వరం శ్రీ భక్తాంజనేయ స్వీట్‌స్టాల్ అధినేత సలాది శ్రీనుబాబు సారథ్యంలో తయారైన 7,885 కిలోల లడ్డూ విశాఖలోని గాజువాకకు తరలింది. ఈ లడ్డూను ఎంతో శ్రమకోర్చి రెండు భారీ క్రేన్ల సాయంతో 16 చక్రాల వాహనంలోకి ఎక్కించి, భారీ ఊరేగింపు నడుమ విశాఖ తరలించారు. అక్కడి శ్రీ నవతరం యూత్ నెలకొల్పనున్న 60 అడుగుల గణనాథుని చెంత దీనిని ఉంచనున్నారు. సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఆధ్వర్యంలో తయారైన 5,150 కేజీల లడ్డూను.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించే 60 అడుగుల ‘శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి’ చేతిలో ఉంచేందుకు తరలించారు. లడ్డూను భారీ క్రేన్ సహాయంతో ప్రత్యేక వాహనంలోకి చేర్చి హైదరాబాద్ తరలించారు. అంతకుముందు మల్లిబాబు దంపతులు లడ్డూకు ప్రత్యేక పూజలు చేశారు. లడ్డూను మంగళవాయిద్యాలతో, బాణసంచా కాల్పుల మధ్య ఊరేగించారు. ఖైరతాబాద్ గణపతికి లడ్డూను ఉచితంగా అందించడం వరుసగా ఇది ఐదోసారని మల్లిబాబు చెప్పారు. కాగా, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఈ లడ్డూల బరువు పరిశీలించారు.