ఉదయం నుంచే గణేశ్ నిమజ్జనం
► సాయంత్రానికల్లా పూర్తి చేయాలి: హోంమంత్రి
► సెప్టెంబర్ 5న నిమజ్జనానికి ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో గణేశ్ చవితి, గణేశ్ నిమజ్జనాన్ని శాంతి యుతంగా, ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నిమజ్జ నాన్ని సెప్టెంబర్ 5న ఉదయం నుంచే ప్రారం భించేలా చూడాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు. సాయంత్రం లోగా నిమజ్జనం పూర్తి చేయాలని పేర్కొ న్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అదే రోజు నిర్వహించాలని సూచించారు.
శుక్రవారం సచివాలయంలో గణేశ్ చవితి, గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. గణేశ్ విగ్రహాల ఊరేగింపు మార్గాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్నామని, హుస్సేన్‌సాగర్ చుట్టూ 160 క్రేన్లతో పాటు అదనంగా మొబైల్ క్రేన్లను నీటిపారుదల శాఖ సాయంతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బందోబస్తు కోసం 35వేల మంది పోలీసు సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు.
విగ్రహాల ఉరేగింపు మార్గాల మరమ్మతులు, పారిశుధ్యం, రహదారుల విద్యుదీకరణ, మొబైల్ టాయిలెట్లు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తుల కోసం వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడిసిన్స్, అంబులెన్సుల వసతులు కల్పిస్తామని చెప్పారు.
అదనంగా 500 బస్సులు రాత్రి సమయాల్లో కూడా నడుపుతామని వివరించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. వినాయక చవితి, బక్రీద్ ఒకే సమయంలో వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గణేశ్ మండపాన్ని జియోట్యాగింగ్ చేసి పర్యవేక్షిస్తామని చెప్పారు.