వినాయకుడి పూజలోని ఏకవింశతి పత్రాల విశిష్టత ఏంటో తెలుసా! | Ganesh Chaturthi Puja 21 Leaves To Worship Ganesh On Ganesh Chavithi | Sakshi
Sakshi News home page

వినాయకుడి పూజలోని ఏకవింశతి పత్రాల విశిష్టత ఏంటో తెలుసా!

Published Sun, Sep 17 2023 3:47 PM | Last Updated on Sun, Sep 17 2023 6:17 PM

Ganesh Chaturthi Puja 21 Leaves To Worship Ganesh On Ganesh Chavithi - Sakshi

గణపతి పూజావిధానంలోనే ‘...పత్రం సమర్పయామి’ అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. ఆ పత్రిలో ఒక్కో ఆకుకు ఒక్కో విశిష్టత ఉంది. అవేమిటో తెలుసుకుందాం.

మాచీ పత్రం (దవనం ఆకు): ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడంద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. వ్రణాలకు, కుష్టువ్యాధికి మందులా పనిచేస్తుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది.

బృహతీ పత్రం (నేల మునగ ఆకు): దీనినే ‘వాకుడు ఆకు’ అని అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది.

బిల్వ పత్రం (మారేడు ఆకు): దీనికే మరో పేరు ’బిలిబిత్తిరి’. ’త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మపాప సంహారం, ఏక బిల్వం శివార్పణం’ అని పూజిస్తాం. బిల్వ పత్రమంటే శివునికి ఎంత ప్రీతికరమో ఈ శ్లోకంద్వారా తెలుస్తోంది. ఈ మారేడు ఆకువల్ల నెమ్మదించే రోగగుణాలను పరిశీలిస్తే... బంక విరోచనాలు కట్టడిపోతాయి. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలైనది. నేత్రసంబంధమైన రుగ్మతలను అరికడుతుంది. శ్రీమహాలక్ష్మి తపస్సువల్ల ఈ వక్షం జన్మించినదట. మారేడు దళంలో మూడు ఆకులు, ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది.

దూర్వాయుగ్మం (గరిక): చర్మరోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులు నిరోధించడంలో, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్నిస్తుంది. గజ్జిని నియంత్రిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిణి లా పనిచేసి మాడ్చేస్తుంది.

దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు): దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగిస్తుంది. ఉదరకోశ వ్యాధులకు, చర్మరోగాలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక సంబంధ సమస్యలకు, గడ్డలు, ప్రణాలకు ఉమ్మెత్త ఆకు చాలా బాగా పనిచేస్తుంది.

బదరీ పత్రం (రేగు ఆకు): జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. వీర్యవద్ధికి దోహదపడుతుంది. రక్త దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరిచేతుల దురదలు తగ్గుతాయి.

అపామార్గ పత్రం (ఉత్తరేణి): పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు. కడుపు శూల, అజీర్తి, మొలలు, వేడిసెగ గడ్డలు, చర్మపుపొంగుకు ఉత్తరేణి చాలా మంచిది. దీనితో పళ్లు తోముకున్నట్టయితే దంతాలు గట్టిపడతాయి. దీనికే పాపసంహారిణి, రాక్షస సంహారిణి అనికూడా పేర్లున్నాయి.

తులసీ పత్రం: ఇందులో చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గు, చర్మరోగాలు, గొంతు సంబంధ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు తగ్గించగలదు. రక్తస్రావాన్ని, అతిసారను అదుపుచేస్తుంది. వాంతులు, కడుపుశూల అరికడుతుంది. విషాన్ని హరించే గుణంకూడా తులసి ఆకులో ఉంది. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. కలియుగ కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పాలి.

చూత పత్రం (మామిడి ఆకు): దీనిని ఏ శుభకార్యమైనా, పర్వదినమైనా గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి. మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కుట్టుకుని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత, చిగుళ్ల బాధలు, పాదాల పగుళ్లు వంటివి మామిడాకుతో నివారించుకోవచ్చు. చక్కెర వ్యాధికి ఉపశమనమిస్తుంది. దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తి కలిగిస్తుంది.

కరవీర పత్రం (ఎర్ర గన్నేరు ఆకు): పేలను నివారించి శిరోజాలకు రక్షణనిస్తుంది. గుండె జబ్బులు, మూత్రవ్యాధులు, కుష్టు రోగం, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కణుతులను కరిగించే గుణం పుష్కలంగా ఉంది.

విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి): జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, రొమ్ము పడిశం, దగ్గు తగ్గించగలదు.

దాడిమి పత్రం (దానిమ్మ ఆకు): రక్తవద్ధి కలుగజేస్తుంది. పిత్తహరిణి, అతిసార, మలేరియా, ఇతర జ్వరాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను నివారిస్తుంది. పిల్లలకు కడుపులో నులిపురుగులను, నలికెల పాములను చేరనివ్వదు.

దేవదారు పత్రం (దేవదారు ఆకు): జ్ఞానవద్ధి, జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి. పుండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, విరోచనాలు తగ్గించగలదు. దీని తైలం కళ్లకు చలువనిస్తుంది. 14. మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. దీని నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలనివ్వదు.

సిందూర పత్రం (వావిలాకు) : తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టించగలదు. కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది.

జాజి పత్రం (జాజి ఆకు) : తలనొప్పి, చర్మవ్యాధులు, నోటి పూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటివాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్లలకు జాజి ఆకు మంచి మందు. జాజికాయ, జాపత్రికి చెందినదీ ఆకు. సన్నజాజి ఆకు కాదు.

గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) : ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలుగజేస్తుంది.

శమీ పత్రం (జమ్మి ఆకు) : చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి రుగ్మతలనుంచి విముక్తి చూపించి ప్రశాంతతను చేకూరుస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది.

అశ్వత్థ పత్రం (రావి ఆకు) : కంటివ్యాధులు, అతిసార, సంభోగ రోగాలు, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్లు, చర్మ రోగాలు, పుండ్లు తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది. జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది.

అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు) : దీనిలో నల్లమద్ది ఆకుకూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. వ్రణాలకు, శరీరంలో మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. వాత పిత్త కఫాలకు మంచిది. పితకర్మలలో వినియోగిస్తారు. దీని రసం రుమాటిజమ్‌ను అరికడుతుంది. నల్లమద్ది ఆకు కడుపులో నులిపురుగులను నివారిస్తుంది.

అర్క పత్రం (జిల్లేడు ఆకు) : సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు, చర్మవ్యాధులు, ఉబ్బసం, వాతం, కడుపు శూల వంటి దీర్ఘరోగాలను నివారిస్తుంది. అమిత ఉష్ణతత్వంనుంచి విముక్తి కలిగిస్తుంది. రథసప్తమినాడు ఆత్మకారకుడైన సూర్యభగవానుడి ప్రీతికోసం జిల్లేడు ఆకులను తల, భుజాలపై పెట్టుకుని తలారా స్నానంచేయడం ఆనవాయితీ.

– డి.వి.ఆర్‌.

(చదవండి: వినాయ‌కుని పూజ‌లో చ‌ద‌వాల్సిన క‌థ‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement