ఆషాఢ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతాన్ని గజానన సంకష్ట చతుర్థి అంటారు. ఎంతో భక్తితో జరుపుకునే పండుగ. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం (క్షీణించే దశ) చతుర్థి (నాల్గవ రోజు) నాడు వస్తుంది. సంకష్ట చతుర్థి అంటే కష్టాలను నాశనం చేసేదని అర్థం. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథిని సంకష్ట చతుర్థి అంటారు. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల శివుడు, పార్వతి, గణపతి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువు సృష్టి బాధ్యతను శివుడికి అప్పగిస్తాడట. అందుకే ఈ మాసంలో శివుడితోపాటు, ఆయన కుమారుడైన వినాయకుడిని పూజిస్తారు.
ఈ వ్రతాన్ని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఆచరిస్తారు. సంకష్ట చతుర్థి నాడు సాయంత్రం వేళలో మహిళలు గణపతిని పూజించి, రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఈ ఉపవాసాన్ని ముగిస్తారు. అత్యంత భక్తిశ్రద్దలతో గణేశుని పూజించి రోజంతా ఉపవాసం ఆచరిస్తారు. గణపతి వ్రత కథను చదువుకుని సాయంత్రం పూజలు చేసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ వ్రత మహిమ వల్ల అదృష్టం కలిసివస్తుందని అన్ని అడ్డంకులను విఘ్ననాయకుడు తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. గజానన సంకష్ట చతుర్థి నాడు దానధర్మాలు చేస్తారు. అన్నార్తులకు అవసరమైన ఇతర బహుమతులు అందించడం శుభప్రదంగా భావిస్తారు. తద్వారా కష్టనష్టాలు తొలగి ఆ గణుశుని ఆశీస్సులు లభిస్తాయని, సకల సంపదలు, శుభాలు కలుగుతాయని మంచి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భావిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment