పుట్టిన బిడ్డ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ కన్నతల్లికి ఆస్పత్రి సిబ్బంది చల్లగా చావు కబురు అందించారు. దీంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. నాకు పుట్టింది ఆడ బిడ్డా?మగ బిడ్డా? అని ఆత్రంగా అడిగిన ఆ తల్లికి నీ బిడ్డ ఉమ్మ నీరు తాగి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో భోరుమంది. నవమోసాలు మోసి అమ్మా.. అని పిలుపు కోసం ఎదురు చూసిన తల్లికి పుట్టెడు కష్టం వచ్చి పడింది. దీనిని భరించలేని బాలింత బంధువులు తమ బాబును తమకు అప్పగించాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు తన పేగు బంధం నిజంగానే తెగిందా.. వైద్యులే తెంచేశారా? అంటూ ఆ తల్లి రోదన అందరినీ కంటతడి పెట్టించింది. శ్రీకాకుళం పట్టణంలోని ఓ మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళ్తే...
శ్రీకాకుళం సిటీ : బిహార్‌కు చెందిన సంజయ్‌సాహు, రీనాదేవి దంపతులు. వీరికి ఐదేళ్ల కాజల్, మూడేళ్ల మస్కాన్ ఉన్నారు. పట్టణంలో కలెక్టర్ బంగ్లా సమీపంలో నివాసం ఉంటున్న ఈ దంపతులు మూడో కాన్పు కోసం పట్టణంలోని కమల ఆస్పత్రిలో వైద్యుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ నెల 12న రీనాదేవి ప్రసవం నిమిత్తం ఇలిసిపురం వద్ద ఉన్న కమల ఆస్పత్రి(మల్టీ స్పెషాల్టీ)లో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమెకు గైనకాలజిస్ట్ శాంతిలత శస్త్రచికిత్స చేశారు. బిడ్డ పరిస్థితి ఆరోగ్యకరంగా లేనందున చికిత్స చేస్తున్నామని చెప్పి అప్పటి నుంచి బుధవారం వరకు పిల్లాడిని తల్లికి చూపించని వైద్యులు మృతి చెందాడని తరువాత చెప్పడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులు ఆస్పత్రి వైద్యులను నిలదీశారు. ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. వైద్యుల తీరుపై ధ్వజమెత్తారు. తమ బిడ్డను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు ఆస్పత్రి వద్ద పరిస్థితిని చక్కదిద్దారు. గైనకాలజిస్ట్ శాంతిలత బుధవారం విధులకు హాజరు కాకపోవడంతో కమల ఆస్పత్రి ఎండీ రామకృష్ణ బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు.
బాబును అప్పగించాలి...
నాకు రెండుసార్లు సాధారణ ప్రసవం జరిగింది. మూడోసారి ఆపరేషన్ గదిలో తనకు సాధారణ ప్రసవం జరుగుతుండగా బిడ్డ తలపై వైద్యులు నొక్కిపెట్టి బిడ్డ బయటకు రాకుండా శస్త్రచికిత్సను చేశారు. సిజేరియన్ జరిగిన తర్వాత బాబు పుట్టినట్లుగా తనకు వైద్యులు చెప్పారు. ఇప్పుడు పాప పుట్టిందని, ఉమ్మ నీరు తాగడం వల్ల చనిపోయిందని తమతో వాదిస్తున్నారు.
- రీనాదేవి, తల్లి
పేగు బంధం తెగిందా..తెంచేశారా?
Published Thu, Jan 21 2016 3:41 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement
Advertisement