ఒక్కడున్నాడు.. | | Sakshi
Sakshi News home page

ఒక్కడున్నాడు..

Published Wed, Feb 3 2016 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

ఒక్కడున్నాడు..

ఒక్కడున్నాడు..

* అరుదైన బాంబే బ్లడ్ అందజేత
* సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సాయం

కర్నూలు(జిల్లా పరిషత్): గుంటూరులో చికిత్స పొందుతున్న రోగికి కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన వ్యక్తి తన అరుదైన బాంబే గ్రూపు రక్తాన్ని ఇచ్చి ఆదుకున్నారు. ఇందుకు సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ తోడ్పాటును అందించింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు పట్టణంలోని ఓల్డ్‌క్లబ్ కొత్తపేటకు చెందిన రియాజ్‌ఖాన్ భార్య రెహనాబేగం(38) థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఆమెను తీవ్ర రక్తహీనతతో నాలుగు రోజుల క్రితం గుంటూరులోని కస్తూరి హాస్పిటల్‌లో చేర్పించారు.

వైద్యపరీక్షలు నిర్వహించగా రెహానాబేగం రక్తంలో హిమోగ్లోబిన్ 5.5 హెచ్‌బీ మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. అరుదుగా ఉండే బాంబే బ్లడ్ గ్రూప్ కావడంతో భర్త రియాజ్‌ఖాన్ గుంటూరు జిల్లాలోని అన్ని బ్లడ్‌బ్యాంకుల్లో ఆరా తీశారు. అతని స్నేహితుడు సంజీవకుమార్ ద్వారా సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో ఆరా తీయగా.. ఆ గ్రూపు రక్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని బ్లడ్‌బ్యాంకులో ఉందని గుర్తించారు. మంగళవారం ఆయన కర్నూలుకు వచ్చి బ్లడ్‌బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి.మల్లికార్జున్‌ను కలువగా బాంబే బ్లడ్ గ్రూపు రక్తాన్ని అందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ బాంబే గ్రూపు రక్తం 10వేల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుందన్నారు. సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సంస్థ అన్ని బ్లడ్‌బ్యాంకులతో లింకప్ అయి ఉంటుందని, ఇది కేవలం బాంబే గ్రూపు దాతల కోసమే పని చేస్తుందన్నారు. ఏదైనా బ్లడ్ బ్యాంకులో ఈ గ్రూపు రక్తం ఉంటే వెంటనే ఆ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తామన్నారు. దీని ఆధారంగా దేశంలో ఎక్కడ నుంచైనా బాంబే గ్రూపు రక్తాన్ని తెచ్చుకునే వీలుంటుందన్నారు. ప్రస్తుతం బ్లడ్‌బ్యాంకులో ఉన్న బాంబే గ్రూపు రక్తాన్ని ఎన్‌టీఆర్  వర్ధంతి సందర్భంగా గత జనవరి 18న గూడూరులో ఓ వ్యక్తి నుంచి సేకరించామన్నారు. ఈ రక్తం 35 రోజులు మాత్రమే నిల్వ ఉంటుందన్నారు.

Advertisement
Advertisement