బొమ్మరిల్లు కార్యాలయం సీజ్
Published Wed, Jan 22 2014 3:41 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఖాతాదారులను మోసం చేసి బోర్డు తిరగేసిన బొమ్మరిల్లు కార్యాలయాన్ని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన బాధితులు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ మేరకు బొమ్మరిల్లు కార్యాలయాన్ని వీఆర్‌వో బరాటం నాగేశ్వరరావు సమక్షంలో శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ రాధాకృష్ణ సీజ్ చేశారు. కార్యాలయంలో ఉన్న మూడు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
లబోదిబోమంటున్న 13 వేల మంది ఖాతాదారులు
పలాస : పలాస-కాశీబుగ్గ పట్టణంలో సుమారు 13 వేల మంది నుంచి 7 కోట్ల రూపాయలను బొమ్మరిల్లు ఫైనాన్స్ సంస్థ సేకరించింది. మంగళవారం రాత్రి బొమ్మరిల్లు కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన కాశీబుగ్గ సీఐ రామకృష్ణ ఈ విషయం ధ్రువీకరించారు. సాయిరాం చిట్స్ ఫైనాన్స్ సంస్థ కోటి రూపాయలతో బోర్డు తిప్పేసింది. సాయిరాం ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
విశాఖపట్నంలో ఖాతాదారుల ఫిర్యాదు మేరకు బొమ్మరిల్లు సంస్థకు చెందిన నలుగురు డెరైక్టర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలియడంతో పలాస-కాశీబుగ్గ పట్టణంలోని ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు.
బొమ్మరిల్లు సంస్థను ఏలూరు సమీపంలోని చింతలపూడి ప్రాంతానికి చెందిన ఆర్‌ఆర్ రాజా ఎండిగా ఉన్న సమయంలో పలాసలో 2012 ఫిబ్రవరి 5న బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ పరిధిలో ఒక ఏబిఎంతో పాటు 8 మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. పూండి ప్రాంతంలో కళింగరాజ్యం వెంచర్ల పేరుతో సైట్‌లు వ్యాపారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సైట్‌లను చూపించి డిపాజిట్లు సేకరించారు. టెక్కలి నుంచి అటు ఇచ్చాపురం, ఇటు పాతపట్నం వరకు వేలాది మంది ఖాతాదారుల నుంచి దినసరి, నెలసరి ఖాతాలను ప్రారంభించి డబ్బులు వసూలు చేశారు. బొమ్మరిల్లు మూతబడిందని తెలియడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.
Advertisement
Advertisement