పెళ్లి చేసుకోమంటే గోదావరిలోకి తోసేశాడు
ప్రేమించానని నమ్మించి యువతిని మోసగించిన ఓ ప్రబుద్ధుడు
తూర్పు గోదావరి జిల్లా (ముమ్మిడివరం): నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు.. కడవరకు తోడుంటానని నమ్మించాడు. ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు ఏకంగా పదేళ్ల నుంచి ప్రేమిస్తున్నానంటూ ఓ యువతికి మాయమాటలు చెప్పి తీరా పెళ్లి విషయం వచ్చేసరికి ససేమిరా అన్నాడు ఓ ప్రబుద్ధుడు. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. పెళ్లి చేసుకుంటానని యువతిని రమ్మని చెప్పి వచ్చాక అర్ధరాత్రి గోదావరిలోకి తోసేశాడు ఓ మోసగాడు. ఈ దారుణమైన ఘటన యానాం–ఎదురల్లంక బాలయోగి వారధి వద్ద చోటుచేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికిచెందిన ఓ యువతి (26), నాసిక శ్రీనివాసరావు (31) పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎంబీఏ చదివిన ఆమె ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాసరావు ప్రేమిస్తున్నానని చెప్పి తరువాత మొహం చాటేస్తుండడంతో తొందరగా పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని నిలదీసింది. దీంతో శ్రీనివాసరావు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ‘ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకుందా’మని ఆమెకు చెప్పి ఆదివారం యానాం–ఎదుర్లంక బాలయోగి వారధి వద్దకు రప్పించాడు.
ఆమెతో అర్ధరాత్రి వరకు అక్కడే కాలక్షేపం చేసి ఎవరూ లేని సమయంలోఆమె తలపై కొట్టి, గొంతునుమిలి గోదావరిలోకి తోసేసి శ్రీనివాసరావు పరారయ్యాడు. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు బాధితురాలిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.