సాక్షి, అమరావతి: ఇటుక బంగారంలా మారిపోయింది. కొనుగోలుదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. కొద్దిరోజుల్లోనే ధర రెట్టింపు కావడంతో నిర్మాణదారులు బెంబేలెత్తుతున్నారు. కొందరైతే పనులను తాత్కాలికంగా నిలిపేశారు. విశాఖ జిల్లాలో నాలుగు నెలల కిందట వెయ్యి చిన్న ఇటుకల (నాలుగు, తొమ్మిది అంగుళాలు) ధర రూ.4,300 ఉండగా.. నేడు రూ.9,000కు చేరింది. అలాగే వెయ్యి పెద్ద ఇటుకల (ఆరు, తొమ్మిది అంగుళాలు) ధర రూ.6,400 నుంచి రూ.11,000కు ఎగబాకింది. ఇక విజయవాడలో అయితే పెద్ద స్థాయిలో సిఫార్సులు ఉన్న వారికే ఇటుకలు అమ్ముతున్నారు.
ఈ ప్రాంతంలో గతంలో రూ.4.50 ఉన్న ఇటుకను.. ప్రస్తుతం మనిషిని, పరపతిని బట్టి రూ.7 నుంచి ఎనిమిది రూపాయలకు అమ్ముతున్నారు. వర్షాకాలంలో ఇటుకలు తయారు చేయడం దాదాపు నిలిపివేస్తారు. అచ్చుల్లో పోసి ఇటుకలను ఎండబెట్టిన తర్వాత వర్షం పడితే అవి పాడైపోతాయి. దీంతో వర్షాకాలంలో ఇటుకల ధర పది నుంచి 15 శాతం పెరుగుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం చాలా చోట్ల ఇటుక ధరలు రెట్టింపయ్యాయి.
పెద్ద నోట్ల రద్దు తర్వాత..
గత ఏడాది పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల నిర్మాణ రంగం పడకేసింది. ఈ ఏడాది నగదు కొరత తగ్గిపోవడంతో నిర్మాణ రంగం మళ్లీ పుంజుకుంది. దీనివల్ల ఇటుకలకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. గిరాకీకి, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో అమ్మకందారులు ఇటుక ధరలను భారీగా పెంచేశారు. మరోవైపు ఇసుక ధరలు కూడా అదేస్థాయిలో పెరిగాయి. ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెబుతున్నా.. అది అమలుకు నోచుకోవడంలేదు. నదుల్లో భారీగా నీరు చేరినందున వాహనం వెళ్లదని.. దూరం నుంచి కూలీలు మోసుకురావాలంటూ అధిక మొత్తం వసూలు చేస్తున్నారు.
మరికొంతమంది రేవుల నుంచి ఇసుక తోడి స్టాక్‌యార్డులు ఏర్పాటు చేసి ఇసుకను విక్రయిస్తున్నారు. విజయవాడ నగర పరిసరాల్లో గతంలో ట్రాక్టరు ఇసుక ధర రూ.1,500 ఉండగా.. ఇప్పుడు రూ.2,500 నుంచి రూ.3,000 వరకూ తీసుకుంటున్నారు. విశాఖలోనూ ఐదు యూనిట్ల ఇసుకను రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకూ అమ్ముతున్నారు. దీంతో భవన నిర్మాణదారులు పనులు నిలిపేశారు.
Comments
Please login to add a commentAdd a comment