నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 53 ఏళ్లకే ఆయన గుండెపోటుకు గురై చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితాలు పరిశీలిస్తే..
వ్యక్తిగత జీవితం..
భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లె అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. భూమా బాలిరెడ్డి , ఈశ్వరమ్మకు ఈయన చిన్న కుమారుడు. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్షల రాజకీయాల కారణంగా తన తండ్రి బాలిరెడ్డి ఆయనను సుదూర ప్రదేశములలో ఉంచి చదివించాలని కోరుకున్నారు. దాని ప్రకారమే నాగిరెడ్డిని తమిళనాడు లోని చెన్నైలో సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్న వెలంకన్ని ప్రైవేట్ పాఠశాలలో 10+2 చదివించారు. ఆ తరువాత, నాగిరెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి బెంగుళూరు వెళ్ళారు. కానీ వెంటనే తన తండ్రి హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన కారణంగా ఆయన జీవితం మొత్తం మారిపోయింది. రాయలసీమ ప్రాంతంలో కీలక నేతగా మారారు. సీనియర్ రాజకీయవేత్త మరియు మాజీ మంత్రి యస్.వి.సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. 2014లో భార్య శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
రాజకీయ ప్రస్తానం..
కర్నూలు జిల్లాలో జనవరి 8, 1964న జన్మించిన భూమా నాగిరెడ్డి తొలిసారిగా 1984లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత సొసైటీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఆయన తర్వాత ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1992లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్న ఆయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణంతో భూమా ఈ స్థానానికి ఎంపికయ్యారు. 1996లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నంద్యాల లోకసభ నియోజకవర్గానికి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ ఆయనను ఎంపిక చేయడంతో మరింత వెలుగులోకి వచ్చారు. భూమా నాగిరెడ్డి లోక్‌సభ సభ్యుడిగా మూడు సార్లు తన సేవలను అందించారు.
తొలుత టీడీపీలో ఉన్న నాగిరెడ్డి అక్కడి నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి అక్కడి నుంచి కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్‌సీపీ టికెట్‌పై భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఏప్రిల్ 24 న రోడ్డు ప్రమాదంలో భూమా సతీమణి శోభ మృతి చెందారు. శోభ మృతి తర్వాత భూమా నాగిరెడ్డి మానసికంగా కుంగిపోయారు. అనారోగ్యం కారణంగా ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. 2016లో కూతురు అఖిలప్రియతో కలిసి భూమా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏడాది నుంచి భూమా నాగిరెడ్డి ఆరోగ్యం సరిగా లేదు. గత వారం రోజులుగా భూమా అనారోగ్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న విజయవాడలో భూమానాగిరెడ్డి చంద్రబాబును కలిశారు.
భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇటీవల చురుగ్గా పాల్గొన్నారు. శనివారం విజయవాడకు వెళ్ళి ముఖ‍్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వివిధ అంశాలపై చర్చించారు. రాత్రి బయలుదేరి ఆళ‍్లగడ‍్డకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణికి మద్దతు తెలుపుతున్నట్లు భూమా నాగిరెడ్డి శనివారం చంద్రబాబును కలిసి స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి నష్టం కలగకూడదన్న ఉద్దేశంతోనే శిల్పాకు మద్దతు తెలిపేందుకు భూమా నాగిరెడ్డి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు కేబినెట్ పదవి లభించలేదనే అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయిందని చెబుతుంటారు. ఇటీవల తనకు మంత్రిపదవి ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకుంటానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు సమాచారం. దాని మేరకే ఈ మధ్య పలుమార్లు చర్చలు కూడా జరిపారంట. ఈలోగానే ఆయన అకాల మరణం చెందడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.