భావి జవాన్లపై బ్రోకర్ల వల! | Brokers hawa in Army recruitment process | Sakshi
Sakshi News home page

భావి జవాన్లపై బ్రోకర్ల వల!

Published Wed, Feb 18 2015 4:03 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

భావి జవాన్లపై బ్రోకర్ల వల! - Sakshi

భావి జవాన్లపై బ్రోకర్ల వల!

 ఎన్నడూ లేని విధంగా చాలా పెద్ద స్థాయిలో శ్రీకాకుళంలో ఆర్మీ నియామక ప్రక్రియ జరుగుతోంది. వివిధ జిల్లాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు వస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బ్రోకర్లు కూడా రంగంలోకి దిగారు. కష్టపడే పని లేకుండా ఉద్యోగాలిప్పిస్తామంటూ ఆశావహులను బుట్టలో వేసుకునేందుకు  రకరకాల ఎత్తులు వేస్తున్నారు. దీనిపై మౌఖికంగా ఫిర్యాదులందుతుండటంతో పోలీసులూ నిఘా పెట్టారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:నిరుద్యోగుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు జిల్లాలో కొన్ని ముఠాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 13 నుంచి పట్టణంలో భారీ స్థాయిలో ఆర్మీ ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని ఆసరా సొమ్ము దండుకునేందుకు పలువురు దళారులు దందా మొదలెట్టారు. తమకు ఆర్మీలో తెలిసిన అధికారులున్నారని, డబ్బులిస్తే ఎలాంటి పరీక్షలు లేకుండానే ఉద్యోగాలిపిస్తామన్న మాయమాటలతో అభ్యర్థులపై వల వేస్తున్నారు. ఆర్మీ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌తోపాటు వివిధ లాడ్జీల్లో దళారులు తిష్ట వేసి అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో మాటలు కలుపుతూ వల విసురుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై తమకు కూడా మౌఖికంగా ఫిర్యాదులందుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
 
 కొన్నాళ్ల క్రితం విశాఖ కేంద్రంగా సన్యాసిరావు అనే వ్యక్తి ఆధ్వర్యంలో నాగేశ్వరరావు, గణేష్ అనే వ్యక్తులు బృందంగా ఏర్పడి ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన, ఎత్తు, పరుగు పందెం, వైద్య పరీక్షలు ఇలాంటివేవీ లేకుండా తాము చూసుకుంటానని, ఇందుకోసం మొదట విడతగా కొంత సొమ్ము ఇవ్వాలంటూ అప్పట్లో ఒత్తిడి తేవడం, అభ్యర్థులు ఢిల్లీ వెళ్లి మరీ సమర్పించుకోవడాన్ని పోలీసులు గుర్తుచేస్తున్నారు. ఈ ముఠా సభ్యులపై అప్పట్లో నమోదైన కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అభ్యర్థుల నుంచి తీసుకున్న సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకున్నట్టు అప్పట్లో పోలీసులు తేల్చారు. చివరికి ఈ బృందం ఇచ్చిన పత్రాలన్నీ నకిలీవేనని తేలడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
 
 మాజీ సైనికులమంటూ..
 ప్రస్తుతం శ్రీకాకుళంలో మకాం వేసిన దళారులు నియామక ప్రక్రియ జరుగుతున్న ప్రాంతాల్లో సంచరిస్తూ అభ్యర్థులను ఆకట్టుకునేందుకు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. తాము మాజీ సైనికులమంటూ తమకు తెలిసిన వారి ఫోన్ నెంబర్లు, ఫోటోలు చూపిస్తూ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొంతమంది తాము కూడా ఆర్మీ ర్యాలీ కోసమే వచ్చామని నమ్మిస్తూ తమకు తెలిసిన వ్యక్తులకు సొమ్ములిచ్చామని, మీరు కూడా ఇస్తే ఉద్యోగాలు గ్యారెంటీ అంటూ ఫోన్ నెంబర్లు ఇవ్వడంపైనా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అప్రమత్తం కాకపోతే మోసపోతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో నిఘా వేయడంతోపాటు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పే వారికి డబ్బులు ఇవ్వరాదని సూచిస్తూ ఆర్ట్స్ కళాశాల తదితర ప్రాంతాల్లో పోస్టర్లు కూడా పెట్టించారు.
 
 సమాచారం ఇవ్వండి
 ఆర్మీ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే ముఠాలపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఉద్యోగం అంటూ ఎవరైనా వల వస్తే డబ్బులిచ్చి మోసపోవద్దని ఆర్ట్స్ కళాశాల వద్ద పోస్టర్లను అతికించాం. కష్టపడి సంపాదించే సొమ్మును పరుల పాలు చేయొద్దని తల్లిద ండ్రులను కోరుతున్నాం. ఏజెంట్ల వలలో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.
 -ఎ.ఎస్.ఖాన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,
 శ్రీకాకుళం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement