వైఎస్సార్‌ సీపీ నేత దారుణ హత్య | Brutal Murder YSR CP leader In East Godavari district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేత దారుణ హత్య

Published Sun, Sep 9 2018 9:21 AM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

Brutal Murder YSR CP leader In East Godavari district - Sakshi

దూనబోయిన సత్యనారాయణ మృతదేహాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సత్యనారాయణ

తూర్పు గోదావరి /కొత్తపేట:  కొత్తపేట మండలం బిళ్లకుర్రు మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు దూనబోయిన సత్యనారాయణ (58) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బిళ్లకుర్రు శివారు మాసాయిపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ తన ఇంటికి సమీపంలోని తన పొలంలో కొబ్బరితోట పనులు చేయించి, సాయంత్రం కూలీలకు కూలీ డబ్బులు చెల్లించి, ఎవరో ఫోన్‌ చేశారు వెళ్లి వస్తానని అక్కడి పనివారికి చెప్పి తన మోటార్‌సైకిల్‌పై వెళ్లి రాత్రికి తిరిగి ఇంటికి రాలేదు. దానితో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.

శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో తన ఇంటికి వెనుకవైపు ఉన్న కొబ్బరితోటలో తలపై కత్తిగాట్లతో రక్తస్రావమై విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. ఆ సమాచారం మేరకు 6 గంటల సమయంలో కొత్తపేట ఎస్సై జి.హరీష్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని బోర్లాగా పడి ఉన్న మృతదేహాన్ని వెల్లకిలా తిప్పి చూడగా కత్తితో దాడి చేయడం వల్ల తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్టు గుర్తించారు. నుదురు పైభాగం, తల నడి నెత్తిన మూడు నరుకుళ్లు, ఎడమ చెవి కొంతమేర, కుడి చేయి బొటనవేలి కింద కత్తి నరుకుళ్లు ఉన్నాయి. ఎడమ కాలికి చెప్పు ఉండగా కుడి కాలి చెప్పు ఆ సమీపంలోనే పడి ఉంది. కళ్లజోడు కూడా మృతదేహం సమీపంలో అద్దాలు ఊడిపోయి ఉంది.

 అనంతరం రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, ఆ పరిసరాలను పరిశీలించి, బంధువులను, స్థానికులను విచారించారు. పంచాయతీ శివారు యెలిశెట్టివారిపాలెం కాలనీ సమీపంలో వాడపాలెం ఓల్డ్‌ చానల్‌ (పిల్ల కాలువ)లో  సత్యనారాయణ పల్సర్‌ పడి ఉండగా దానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఆయన మృతదేహం ఉంది. దానికి సుమారు మరో వంద మీటర్ల దూరంలో ఆయన ఇల్లు ఉంది. ఆయన మోటార్‌ సైకిల్‌ ఉన్న ప్రాంతం, మృతదేహం ఉన్న ప్రాంతం, ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇది పథకం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు మాటువేసి హత్యాయత్నం చేయగా, వారి నుంచి తప్పించుకునే క్రమంలో కాలువలో మోటార్‌సైకిల్‌ పడిపోగా కాలువ దాటి కొబ్బరితోటల్లోంచి ఇంటివైపు పరుగెత్తి ఉంటారని, హంతకులు కత్తితో వెంబడించి, ఇంటికి వెనుక సుమారు 100 మీటర్ల సమీపంలోనే హత్య చేశారని భావిస్తున్నారు. తలపైనే కత్తితో నరికి హత్య చేయాలనే దాడిచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

మండలి డిప్యూటీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ దిగ్భ్రాంతి శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్‌ఎస్‌) మాజీ సర్పంచ్‌ దూనబోయిన హత్యకు గురికావడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనా స్తలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోలీసులను విచారించి, కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర బీజేపీ కిసాన్‌మోర్చా కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం తదితరులు దూనబోయిన మృతదేహాన్ని సందర్శించి హత్యను తీవ్రంగా ఖండించారు. 

హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన వచ్చిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
దూనబోయిన హత్య సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన మాసాయిపేట చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి చలించిపోయారు. సంఘటనను తీవ్రంగా ఖండించారు. సంఘటనపై పోలీసులను ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేసి హంతకులను అరెస్టు చేయాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చారు. 

వివాదరహితునికి శత్రువులా?
సత్యనారాయణకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సంతానం అందరూ ఉన్నత చదువులు చదివి ఉన్నతోద్యోగాల్లో, వివిధ ప్రాంతాల్లో  స్థిరపడగా ఇక్కడ సత్యనారాయణ దంపతులు ఇద్దరే ఉంటున్నారు. 1996లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన ఆయన 2001 వరకూ ఆ పదవిలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్‌ నాయకునిగా వివిధ పార్టీ పదవులు చేపట్టారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో క్రియాశీలక కార్యకర్తగా, ఆ పార్టీ జిల్లా బీసీ విభాగం సభ్యుడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా, ఒక గ్రామపెద్దగా హాజరవుతారు. వివాదరహితుడిగా పేరున్న సత్యనారాయణ హత్యకు గురికావడం మండలంలో తీవ్ర సంచలనం కలిగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement