రాజమండ్రి సిటీ : పుష్కరాల నాటికి రాజమండ్రిని పచ్చదనాల సుందర నగరంగా తీర్చిదిద్ది, దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులకు క న్నుల పండువ చేయగలమని ముంబాయికి చెందిన ప్రసిద్ద ఆర్కిటెక్ట్స్ సంజయ్ పురి, కువల్ సనమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో శుక్రవారం ఈ బృందం ఉభయ గోదావరి జిల్లాల పుష్కర ప్రత్యేక అధికారి జె.మురళి తదితర అధికారులతో కలసి నగరంలో పలు ప్రాంతాలను సందర్శించింది. నగరంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, ప్రజల భద్రత ప్రధానంగా అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేందుకు తమ బృందం సిద్ధంగా ఉందని ఆర్కిటెక్ట్ సంజయ్‌పురి పేర్కోన్నారు. లాలాచెరువు సెంటర్, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, ఏవీ అప్పారావు రోడ్ జంక్షన్, కోరుకొండ రోడ్ జంక్షన్, సెంట్రల్ జైల్ రోడ్, శానిటోరియం, పుష్కరఘాట్, కోటిలింగాలరేవు, మధురపూడి విమానాశ్రయం రోడ్, ఆర్యాపురం ట్యాంక్ తదితర ప్రాంతాలను ఈ బృందం పరిశీలించింది.
సుందరమైన ఘాట్‌గా పుష్కరాలరేవు
నగరంలో అత్యంత ప్రాధాన్యం గల పుష్కరాలరేవును సుందరమైన ఘాట్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఘాట్‌లో ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా చూడనున్నారు. ఘాట్‌ను మరో 150 మీటర్లు విస్తరించి, రాత్రులు కూడా పగటిని తలపించే విధంగా లైటింగ్ వ్యవస్థ, అత్యాధునిక ఫ్లోరింగ్ ఏర్పాటు చేయనున్నారు.
కోటిలింగాలరేవు ఆధునికీకరణ....
కోటిలింగాలరేవు పుష్కరాల సమయానికి మరో 373 మీటర్ల మేర అభివృద్ధి చెందనుంది. కోటిలింగాల రేవు నుంచి దుర్గా ఘాట్ వరకూ ఘాట్‌లను అనుసంధానం చేసి, ఆ ప్రక్రియ పూర్తికాగానే అత్యాధునిక లైటింగ్ వ్యవస్ధతో పాటు సుందరీకరణ చర్యలు చేపట్టనున్నారు. ప్రతి ఘాట్‌లోనూ గార్డెనింగ్ ఏర్పాటు చేయనున్నారు.
కంబాలచెరువుకు మహర్దశ..
పుష్కరాలకు కంబాలచెరువుకు మహర్దశ పట్టనుంది. చెరువులో యాత్రికుల మనసు దోచే అద్భుతమైన కళాఖండాలు ఏర్పాటు చేసేందుకు ఈ బృందం సిద్ధమౌతోంది. వెలుగుల ఫౌంటెన్‌తో పాటు సంగీతాన్ని మేళవించి యాత్రికులకు వీనుల విందు చేయనున్నారు. అద్భుతమైన లైటింగ్ వ్యవస్థతో నిరంతర వెలుగులు , స్పీడ్ బోట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు.
కార్పొరేషన్ కార్యాలయం హరితమయం..
కార్పోరేషన్ కార్యాలయం ఇక పచ్చదనాలతో అలరించనుంది. నగర పాలక సంస్థ పాత భవనం ఎదురుగా ఉన్న స్థలంలో పరిమళాలు వెదజల్లే పూలమొక్కలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు విదేశాల నుంచీ మొక్కలు రప్పించనున్నారు.
అత్యాధునిక హైమాస్ట్ లైటింగ్
క్యారీ సెంటర్ నుంచి లాలాచెరువు వెళ్లే రోడ్‌ను ఆధునికీకరించి డివైడర్‌పై లైటింగ్ వ్యవస్థతో పాటు గార్డెనింగ్‌కు చర్యలు తీసుకుంటారు. లాలాచెరువు సెంటర్, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, ఏవీ అప్పారావు రోడ్ జంక్షన్, కోరుకొండ రోడ్ జంక్షన్, సెంట్రల్ జైల్ రోడ్, శానిటోరియం జంక్షన్‌లో అత్యాధునికమైన హైమాస్ట్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు ముఖ్యకూడళ్ళలో ల్యాండ్ స్కేపింగ్ చేయనున్నారు. నగరంలో అవసరమైనప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి సుందరీకరించనున్నారు.
పార్కులకూ కొత్త శోభ
నగరంలో అన్ని పార్కులనూ అభివృద్ధి చేయనున్నారు. పార్కుల్లో లైటింగ్‌తో పాటు బెంచీలు, సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. వాటర్ ఫౌంటెన్స్, పిల్లలు సేదదీరేందుకు అవసరమైన అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేయనున్నారు.
ఆర్యాపురం స్టోరేజ్ ట్యాంక్ ఆవరణకు కొత్త రూపు
ఆర్యాపురం స్టోరేజ్ ట్యాంక్ ఆవరణను ల్యాండ్ స్కేపింగ్ ద్వారా సుందరీకరించనున్నారు. సాయంసంధ్యవేళలో యాత్రికులు సేద దీరేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయనున్నారు. ఇక్కడ లైటింగ్ వ్యవస్థతో పాటు ఆధునిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. కాగా పర్యటనలో గుర్తించిన అంశాలను పరిశీలించి, మార్చి 12 నాటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నామని ఆర్కిటెక్ట్ సంజయ్‌పురి వెల్లడించారు. ఆయన వెంట నగర పాలక సంస్థ కమిషనర్ మురళి, ఆర్కిటెక్ట్స్ శివకుమార్, నేహా డేనియా తదితరులు ఉన్నారు.
పుష్కరాల నాటికి చక్కని రాజమండ్రి!
Published Sat, Feb 28 2015 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement