సీఎం హెలికాప్టర్ల అద్దెపై ‘కాగ్’
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు వినియోగిస్తున్నప్రైవేట్ హెలికాప్టర్లకు అద్దెను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని ‘కాగ్’ తప్పుపట్టింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రైవేట్ హెలికాప్టర్లకు చేసిన రూ.14.33 కోట్ల చెల్లింపులు అసంబద్ధమైనవని ‘కాగ్’ తేల్చింది.
► హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంలో భాగంగా మెసర్స్ సరస్ విమానయాన సర్వీసెస్‌తో 2014 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒకటి/రెండు జంట ఇంజన్ల హెలికాప్టర్లను నెలకు కనీసం 100 గంటల ప్రయాణ సమయానికి గాను గ్యారంటీ ఫీజు రూ.25 లక్షలు (గంటకు రూ.2.50 లక్షల ధరతో). 2014 అక్టోబర్ 1 నుంచి ఐదేళ్ల కాలపరిమితి అనే నిబంధన ఒప్పందంలో ఉంది.
► పోటీతత్వం గల బిడ్డింగ్‌ను అనుసరిం చకుండా కంపెనీ సర్వీస్ ప్రొవైడర్‌గా మెసర్స్ సరస్ విమానయాన సర్వీసెస్‌ను ఎంపిక చేశారు. ఎన్ని ప్రయాణ గంటలు అద్దెకు అవసరమో అంచనా వేయకుండానే ఒప్పందం కుదుర్చుకున్నారు. సంబంధిత ఫైళ్లు/రికార్డులను కంపెనీ వారు తనిఖీకి సమర్పించలేదు.
► 2014 జూలై నుంచి సెప్టెంబర్ వరకు అద్దెగా రూ.5.06 కోట్లు చెల్లించారు. వీటి రికార్డులు లేనందున చెల్లింపుల్లో నిజానిజాలను తనిఖీలో అంచనా వేయడం సాధ్యం కాలేదు.
► 2014 అక్టోబర్ 1 నుంచి ఉన్న ఒప్పందంలోని 12.1 నిబంధన ప్రకారం నెలకు 100 గంటల చొప్పున రూ.25 లక్షల కనిష్ట గ్యారెంటీ ప్రయాణ చార్జీగా ఉంది. కంపెనీకి 2014 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నెలకు 60 గంటలకు రూ.5.06 కోట్లు, 2015 జనవరి నుంచి మార్చి వరకు నెలకు 50 గంటలకు రూ.4.21 కోట్లు చెల్లించారు.
► 2012–13లో హెలికాప్టర్ల అద్దెకు రూ.9.91 కోట్లు, 2013–14లో రూ.20.04 కోట్లు, 2014–15లో రూ.20.74 కోట్లు వ్యయం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా 14.33 కోట్లు
Published Sat, Apr 1 2017 2:15 AM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM
Advertisement
Advertisement