కందిశ వద్ద కుడికాలువపై ఉన్న బ్రిడ్జి
శ్రీకాకుళం , రేగిడి: మండల పరిధిలోని కందిశ వద్ద ఉన్న మడ్డువలస ప్రధాన కుడికాలువపై నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో క్షణక్షణం భయం భయంగా మారింది. ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణ సమయంలో పదిహేనేళ్ల క్రితం బ్రిడ్జిని నిర్మించారు. నిత్యం కాలువ ద్వారా నీరు ప్రవహించినప్పటికీ బ్రిడ్జికి ఏ రకమైన ఇబ్బంది ఏర్పడలేదు. గ్రామ సమీపంలో ఉన్న నాగావళిలో ఇసుక ర్యాంపును ఏర్పాటుచేసి రాత్రుళ్లు అక్రమంగా ట్రాక్టర్లు, లారీలతో ఈ బ్రిడ్జిపై నుంచే వాహనాలు వెళ్తుండేవి.
దీంతో బ్రిడ్జి నిర్మాణం పటుత్వం పూర్తిగా కోల్పోయింది. బ్రిడ్జికి వేసిన శ్లాబ్ పూర్తిగా పెచ్చులు రాలిపోతుంది. బ్రిడ్జికి వేసిన పిల్లర్లకు కూడా పగుళ్లు ఏర్పడడంతో ఏ క్షణమైన కూలిపోయే ప్రమాదం లేకపోలేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పైనుంచి బ్రిడ్జిని చూస్తే మేడిపండు చందంగా ఉంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో దీని పరిస్థితి ఇలా తయారైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఇసుక ట్రాక్టర్లను బ్రిడ్జిపై నుంచి వెళ్లనివ్వకుండా నిలుపుదల చేయడంతోపాటు తక్షణమే బ్రిడ్జికి అవసరమైన మరమ్మతులను చేపట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment