విజయవాడ : పేకాట శిబిరంపై పోలీసుల దాడి సందర్భంగా వారి నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు కాలువలో దూకి గల్లంతయ్యాడు. లబ్బీపేట పిచ్చయ వీధి చివర పార్కులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం..
లబ్బీపేట మసీదు వీధిలో నివాసం ఉంటున్న కార్పెంటర్ ఎస్‌కే మస్తాన్‌కు ఆరుగురు సంతానం. ఆయన చిన్న కుమారుడు ఎస్‌కే ఫయాజ్(18) ఆటోనగర్‌లోని టైర్ల కంపెనీలో పనిచేస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం విధుల నుంచి ఇంటికి వచ్చాడు. అదే ప్రాంతంలోని పిచ్చయవీధి చివర పార్కులో కొంతమంది పేకాడుతున్నారు. ఫయాజ్ తన స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాడు. అక్కడ ఆరుగురు పేకాడుతుండగా, మరికొందరు నిలుచుని చూస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు శిబిరంపై దాడి చేశారు. వారికి నలుగురు చిక్కారు. మరికొందరు సబ్‌స్టేషన్ వెనుక నుంచి పరారయ్యారు. ఫయాజ్‌తో సహా మరో నలుగురు తప్పించుకునేందుకు కాలువలో దూకారు. వారిలో ముగ్గురు ఆవలి ఒడ్డుకు చేరుకోగా, ఫయాజ్ మాత్రం నీటిలో గల్లంతయ్యాడు.
కుటుంబసభ్యుల ఆరాతో వెలుగులోకి..
ఫయాజ్ రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటికి రాకపోవడంతో సోదరుడు అహ్మద్ అతడికి ఫోన్ చేయగా, స్విచాఫ్ అని వచ్చింది. దీంతో అతడి స్నేహితులను ఆరా తీయగా, జరిగిన ఘటన గురించి వివరించారు. దీంతో కాలువలో కొట్టుకుపోయినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో బుధవారం ఉదయం బందరు కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించి, ఫయాజ్ జాడ కోసం బంధువులు, పోలీసులు గాలింపు చేపట్టారు. అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫయాజ్ జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సీఐ అహ్మద్ ఆలీ చెప్పారు.
నాయకుల పరామర్శ
ఫయాజ్ కాలువలో దూకి గల్లంతయ్యాడని తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ చోడిశెట్టి సుజాత బందరు కాలువ ఒడ్డున ఉన్న పార్కు వద్దకు వచ్చారు. అతడి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కార్యాలయ సిబ్బంది అక్కడకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక నేతలు కొందరు కూడా వచ్చి ఈ ఘటనపై బాధిత కుటుంబీకుడిని ఆరా తీశారు.
బందరురోడ్డుపై ధర్నా
ఫయాజ్ జాడ తెలుసుకునేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అతడి బంధువులు, స్థానికులు బందరురోడ్డుపై రాస్తారోకో చేశా రు. పోలీసులు వారితో సంప్రదింపులు జరి పారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. ధర్నా ప్రారంభమైన గంట తరువాత ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. దీంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు.
కాలువలో దూకి యువకుడి గల్లంతు
Published Thu, Oct 30 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM
Advertisement
Advertisement