Tire Company
-
బ్రిడ్జ్‌స్టోన్ డీలర్‌షిప్‌లలో ఈవీ చార్జర్లు
న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా తమ డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జర్ల ఏర్పాటు కోసం టాటా పవర్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం గంట వ్యవధిలోనే కార్లు వంటి నాలుగు చక్రాల వాహనాలను చార్జింగ్ చేసే సామర్ధ్యం ఉండే ఫాస్ట్ చార్జర్లను టాటా పవర్ ఇన్స్టాల్ చేస్తుంది. తద్వారా ఒక్కో చార్జరుతో రోజులో 20–24 వాహనాలను చార్జింగ్ చేయడానికి వీలవుతుందని బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాజర్షి మొయిత్రా తెలిపారు. బ్రిడ్జ్‌స్టోన్ కస్టమర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనదారులందరికీ దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో ఈ చార్జర్లు 24 గంటలూ అందుబాటులోకి ఉంటాయన్నారు. ఇన్స్టాలేషన్, చార్జింగ్, మెయింటెనెన్స్, ఈ–పేమెంట్స్ మొదలైన వాటికి సంబంధించి టాటా పవర్ సహాయ, సహకారాలు అందిస్తుంది. -
విశాఖ అభివృద్ధికి యకహోమాతో ప్రయోజనం
అచ్యుతాపురం (అనకాపల్లి): అత్యంత ప్రతిష్టాత్మకమైన యకహోమా టైర్ల కంపెనీ అచ్యుతాపురం సెజ్‌కు రావడంతో విశాఖ జిల్లాకు ఎంతో ప్రయోజనం దక్కుతుందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ నెల 16న అచ్యుతాపురం సెజ్‌లో ఈ కంపెనీని ప్రారంభించి, మరో ఎనిమిది కంపెనీలకు శంకుస్థాపన చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న నేపథ్యంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాలు, హెలిప్యాడ్‌ను శుక్రవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, మైనింగ్‌కు ఉపయోగించే వాహనాలకు అవసరమైన టైర్లను ఈ కంపెనీలో ఉత్పత్తి చేస్తారని చెప్పారు. వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో ఈ కంపెనీ నిర్మాణం పూర్తయిందని, ఈ కంపెనీ వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరిగాయని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత భూములు కేటాయించి, పూర్తయిన కంపెనీల్లో ఇదొకటన్నారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధికి, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి యకహోమా నాంది పలుకుతుందని చెప్పారు. ఈ కర్మాగారం విస్తరణకు మరో రూ.వెయ్యికోట్లు కేటాయించనున్నారని, తద్వారా మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు, కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, సీఈవో ప్రహ్లాదరెడ్డి పాల్గొన్నారు. -
టైర్ల రంగం ఏటా 7–9 శాతం వృద్ధి
ముంబై: టైర్ల డిమాండ్ ఐదేళ్ల పాటు ఏటా 7–9 శాతం చొప్పున వృద్ధి చెందగలదని, దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమపై ఉన్న సానుకూల అంచనాలే దీనికి కారణమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఇదే కాలంలో సామర్థ్య విస్తరణపై టైర్ల పరిశ్రమ రూ.20,000 కోట్ల మేర పెట్టుబడులు పెడుతుందని పేర్కొంది. ముడి చమురు ధరలు తగ్గడం, సహజ రబ్బర్ ధరలు స్థిరంగా ఉండడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో మార్జిన్లు మెరుగుపడతాయని తన నివేదికలో పేర్కొంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉండగా, 2021 నాటికి మూడో స్థానానికి చేరుతుందని ఇక్రా అంచనా వ్యక్తం చేసింది. ఏటా 5.9 శాతం చొప్పున ఈ రంగం వృద్ధి చెందుతూ 2026 నాటికి –251.4– 282.8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అభిప్రాయపడింది. కేరళ వరదలు, రుణాల కఠినతరం, బీమాకు సంబంధించి నియంత్రణపరమైన మార్పులు, వడ్డీ రేట్ల పెరుగుదల, ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం (ఐదేళ్ల బీమా) డిమాండ్‌పై చూపించినప్పటికీ... ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం మీద చాలా విభాగాల్లో అమ్మకాలు బలంగానే ఉన్నాయని, ఇది టైర్ల డిమాండ్ వృద్ధికి ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొంది. -
కాలువలో దూకి యువకుడి గల్లంతు
విజయవాడ : పేకాట శిబిరంపై పోలీసుల దాడి సందర్భంగా వారి నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు కాలువలో దూకి గల్లంతయ్యాడు. లబ్బీపేట పిచ్చయ వీధి చివర పార్కులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. లబ్బీపేట మసీదు వీధిలో నివాసం ఉంటున్న కార్పెంటర్ ఎస్కే మస్తాన్‌కు ఆరుగురు సంతానం. ఆయన చిన్న కుమారుడు ఎస్కే ఫయాజ్(18) ఆటోనగర్‌లోని టైర్ల కంపెనీలో పనిచేస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం విధుల నుంచి ఇంటికి వచ్చాడు. అదే ప్రాంతంలోని పిచ్చయవీధి చివర పార్కులో కొంతమంది పేకాడుతున్నారు. ఫయాజ్ తన స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాడు. అక్కడ ఆరుగురు పేకాడుతుండగా, మరికొందరు నిలుచుని చూస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు శిబిరంపై దాడి చేశారు. వారికి నలుగురు చిక్కారు. మరికొందరు సబ్‌స్టేషన్ వెనుక నుంచి పరారయ్యారు. ఫయాజ్‌తో సహా మరో నలుగురు తప్పించుకునేందుకు కాలువలో దూకారు. వారిలో ముగ్గురు ఆవలి ఒడ్డుకు చేరుకోగా, ఫయాజ్ మాత్రం నీటిలో గల్లంతయ్యాడు. కుటుంబసభ్యుల ఆరాతో వెలుగులోకి.. ఫయాజ్ రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటికి రాకపోవడంతో సోదరుడు అహ్మద్ అతడికి ఫోన్ చేయగా, స్విచాఫ్ అని వచ్చింది. దీంతో అతడి స్నేహితులను ఆరా తీయగా, జరిగిన ఘటన గురించి వివరించారు. దీంతో కాలువలో కొట్టుకుపోయినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో బుధవారం ఉదయం బందరు కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించి, ఫయాజ్ జాడ కోసం బంధువులు, పోలీసులు గాలింపు చేపట్టారు. అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫయాజ్ జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సీఐ అహ్మద్ ఆలీ చెప్పారు. నాయకుల పరామర్శ ఫయాజ్ కాలువలో దూకి గల్లంతయ్యాడని తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ చోడిశెట్టి సుజాత బందరు కాలువ ఒడ్డున ఉన్న పార్కు వద్దకు వచ్చారు. అతడి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కార్యాలయ సిబ్బంది అక్కడకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక నేతలు కొందరు కూడా వచ్చి ఈ ఘటనపై బాధిత కుటుంబీకుడిని ఆరా తీశారు. బందరురోడ్డుపై ధర్నా ఫయాజ్ జాడ తెలుసుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అతడి బంధువులు, స్థానికులు బందరురోడ్డుపై రాస్తారోకో చేశా రు. పోలీసులు వారితో సంప్రదింపులు జరి పారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. ధర్నా ప్రారంభమైన గంట తరువాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. దీంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు.