ఒంగోలు : ప్రకాశం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. తర్లుపాడు మండలం మేకలవారిపాలెం వద్ద జాతీయరహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ ఎమ్మార్వో భార్య సహా ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మార్కాపురంలో ఆదివారం గ్రూప్-2 పరీక్ష రాసి తిరిగి ఒంగోలుకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నాగులుప్పలపాడు ఎమ్మార్వో భార్య మాధవి కూడా ఉన్నారు. మాధవి తన అన్న రఘుతో కలిసి గ్రూప్-2 పరీక్ష రాసేందుకు కారులో మార్కాపురం వెళ్లింది. పరీక్ష రాసి తిరిగి వస్తుండుగా ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఉన్న మాధవి, రఘు సహా కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఎమ్మార్వో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. నాగులుప్పలపాడు ఎమ్మార్వోను పలువురు ఉన్నతాధికారులు ఫోన్‌లో పరామర్శించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.