ముగ్గురిని కాటేసిన కరెంట్‌: కన్నీటిలో ‘కన్నికాపురం’ | Three Persons Demised With Electricity Shock In Chittoor | Sakshi
Sakshi News home page

ముగ్గురిని కాటేసిన కరెంట్‌: కన్నీటిలో ‘కన్నికాపురం’

Published Tue, Aug 10 2021 8:11 AM | Last Updated on Tue, Aug 10 2021 8:20 AM

Three Persons Demised With Electricity Shock In Chittoor - Sakshi

ప్రమాదంలో మృతిచెందిన యువకులు

కడుపులు మాడ్చుకున్నాం. కష్టాలకోర్చి చదివించాం. మీకు ఏ లోటూ రాకుండా చూసుకున్నాం. చదువుల్లో రాణిస్తుంటే ఎంతో పొంగిపోయాం. త్వరలోనే ఉద్యోగాలు తెచ్చుకుని ఆసరాగా నిలుస్తారని ఆశపడ్డాం. ఇక మాకు కష్టాలు ఉండవని కలలుగన్నాం. కానీ ఆ దేవుడు మా ఆశలను చిదిమేశాడు. చేతికొచ్చిన కొడుకులను తీసుకెళ్లిపోయాడు. ఇక మాకు దిక్కెవరు కొడుకా..? అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన చూపరులను కంటతడి పెట్టించింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.  
 
పాలసముద్రం: మండలంలోని కన్నికాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో సోమవారం ముగ్గురు మృతిచెందడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన చిన్నబ్బమందడి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. కంకర అవసరం కావడంతో వేల్కూరు నుంచి టిప్పర్‌లో  తెప్పించి అన్‌లోడ్‌ చేయిస్తున్నాడు. అంతలోనే పైనే ఉన్న కరెంటు వైర్లు టిప్పర్‌కు తగలడంతో  విద్యుదాఘాతానికి గురై డ్రైవర్‌ మనోజ్‌ (34) అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో గ్రామస్తులు దొరబాబు (23), జ్యోతీశ్వర్‌ (19) ప్రాణాలు కోల్పోయారు. క్షణాల్లో ముగ్గురూ మృత్యువాత పడడంతో గ్రామంలో తీరని విషాదం అలుముకుంది.

ఆశలన్నీ వారిపైనే 
గ్రామానికి చెందిన సీదల బాలాజీనాయుడు, ఉష దంపతులకు దొరబాబు, సోమేశ్‌, చంద్రిమ పిల్లలు. దొరబాబు పెద్దవాడు. సోమేష్, చంద్రిమ కవలలు. ఇంటర్‌ చదువుతున్నారు. పెద్దకుమారుడి భవిష్యత్తు కోసం తపించారు. ఉన్నకొద్దిపాటి పొలంలో పంటలదిగుబడి అంతంతమాత్రంగా రావడంతో అప్పులపాలయ్యా రు. కానీ పిల్లల చదువుకు వెనకడుగు వేయలేదు. పస్తులుంటూ కూడబెట్టి పెద్ద కుమారుడు దొరబాబును తమిళనాడు రాష్ట్రం, తంజావూరులోని ఓ బీటెక్‌ కళాశాలలో చదివించారు. గతేడాది ఫస్ట్‌క్లాస్‌లో పాసవడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉద్యోగం వస్తుందని ఆశ పడ్డారు. కష్టాలు తీరుతాయని సంబరబడ్డారు. ఇంతలోనే విధి వారి ఆశలను చిదిమేసింది. అప్పటివరకు కళ్లెదుట కలియదిరుగుతూ మాటలు చెప్పిన కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారడంతో తల్లడిల్లిపోయారు.

ఇక అదే గ్రామానికి చెందిన వెంకటేష్‌ నాయుడు, రోహిణి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పవన్‌కుమార్‌ పెద్దవాడు. చిన్నవాడైన జ్యోతీశ్వర్‌ చదువుల్లో మేటి. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ పూర్తిచేశాడు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి రోహిణి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె సక్రమంగా నడవలేని స్థితి. ఇద్దరు పిల్లలూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవారు. ఉపాధి పనులకెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలిచేవారు. ఇంతలో అనుకోని ప్రమాదం ఓ కుమారుడిని కబళించడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఇదిలా ఉండగా గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు పంచాయతీ, పెద్దకాలువ గ్రామానికి చెందిన మనోజ్‌ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో డ్రైవర్‌ వృత్తిని ఎంచుకున్నాడు. మృతులు ముగ్గురూ అవివాహితులు.

లాక్‌డౌన్‌ లేకుంటే..! 
కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో దొరబాబు, జ్యోతీశ్వర్‌ కూడా ఇంటివద్దే ఉండాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ లేకుంటే పిల్లలు చదువుల కోసం వెళ్లేవారని, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement