కేసు.. తుస్సు
‘డీల్’ కుదిరింది
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఊహించినట్లుగానే జరిగింది. రూ.4కోట్ల డీల్‌కు అనుగుణంగా నకిలీ మద్యం కేసు నీరుగారిపోతోంది. జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్‌ను కేసు నుంచి తప్పించేశారు. ఆయన ప్రమేయమే లేదంటూ కేసును మూసివేసేందుకు ఎక్సైజ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ‘సాక్షి’ ముందు నుంచి చెబుతున్నట్లు ఆయన వ్యక్తిగత ప్రైవేట్ సహాయకుడు(పర్సనల్ ప్రైవేట్ అసిస్టెంట్) చిక్కా నాగశేఖరప్ప అలియాస్ రాజశేఖర్‌ను బలిపశువు చేసేందుకు ప్రణాళిక రచించారు.
ఇందులో భాగంగా కేసులో కీలకపాత్ర పోషిస్తున్న ‘మౌర్య-ఇన్-హోటల్’లో సమావేశానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ లేదని కేసును నీరుగార్యే ప్రయత్నం మొదలైంది. ఏకంగా జెడ్పీ చైర్మన్‌పై రాజకీయ కక్షలో భాగంగానే కేసు బనాయించారనే కోణంలో కేసును మలుపు తిప్పే ప్రయత్నం ముమ్మరమైంది. మొత్తం మీద జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు కాస్తా ఎక్సైజ్ పోలీసులు విచారణ పేరిట తుస్సుమనిపించారు.
చిన్ననాటి స్నేహితుల్లో ఒకడు
డోన్ మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని రాఘవేంద్ర గార్డెన్స్‌లో నవంబర్ 2న 15,360 బాటిళ్ల నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఏమైనా జరిగితే... నేను చూసుకుంటానని జెడ్పీ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్ ‘మౌర్య-ఇన్ హోటల్’ సమావేశంలో చెప్పాడని ఈ కేసులోని ఏ-2, ఏ-3లుగా ఉన్న రామన్‌గౌడ్, ఉమా మహేశ్వరగౌడ్‌లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్‌ను ఆయన పీఏ రాజశేఖర్ పరిచయం చేయించారని కూడా వారు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పీఏపై ఏ-4 కేసును పోలీసులు నమోదు చేశారు.
అందులో భాగంగా జెడ్పీ చైర్మన్ పీఏను డోన్ మండలం ఉడుములపాడు గ్రామసమీపంలో నవంబర్ 15న అరెస్టు చేశారు. ‘సాక్షి’ ముందు చెప్పినట్టుగానే ఆయన పీఏను బలిపశువు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఆ మేరకు జెడ్పీ చైర్మన్‌కు సంబంధం లేదని పీఏతోనే చెప్పించారు. ‘జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ చిన్ననాటి స్నేహితుల్లో ఒకరు. ఆయనకు కేసుతో సంబంధం లేదు.
ఏ-2, ఏ-3లుగా ఈడిగ ఉమామహేశ్వర్ గౌడ్, ఈడిగ మనోహర్‌లను మౌర్య-ఇన్ హోటల్‌లో కలిశాం. నకిలీ మద్యం వ్యాపారం గురించి చర్చించుకున్నాం’ అని విచారణలో పీఏ తెలిపారు. మొదట్లో ఏ-2, ఏ-3లు చెప్పినట్టుగానే మొత్తం కేసులో మౌర్య-ఇన్ హోటల్ సమావేశమే కేంద్ర బింధువు. ఇంతటి కీలకమైన ‘మౌర్య-ఇన్ హోటల్’లో సీసీ టీవీ ఫుటేజీని చూస్తే... సమావేశం జరిగిన రోజు జెడ్పీ చైర్మన్ వచ్చారా? లేదా? ఇట్టే తెలిసిపోతుంది. అయితే, ఇక్కడే రాజకీయం, రూ.4 కోట్ల డీల్ మంత్రాంగం కాస్తా పనిచేసి... సీసీ టీవీ ఫుటేజీని లేకుండా చేసింది.
రాజకీయ కక్షతోనే ఆరోపణలంటూ మళ్లింపు
నకిలీ మద్యం కేసులో ఇరుక్కుపోయిన జెడ్పీ చైర్మన్‌ను తప్పించేందుకు ఫుటేజీ లేదంటున్న అధికారులు... చివరకు అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకు రాజకీయ కక్షతోనే చైర్మన్‌పై ఆరోపణలు చేశారంటూ మొత్తం కేసును మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా కేసుకు కాస్తా రాజకీయ రంగు పులిమి మమ అనిపించాలనే కుట్ర జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అధికారపార్టీ ఒత్తిళ్లు, రూ.4 కోట్ల డీల్‌తో... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ మద్యం వ్యవహారం కథ కాస్తా కంచికి చేరనుంది.