మళ్లీ నాట్లు వేసుకోవచ్చుకదా..! | central team members visited floods effected areas | Sakshi
Sakshi News home page

మళ్లీ నాట్లు వేసుకోవచ్చుకదా..!

Published Thu, Nov 21 2013 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

central team members visited floods effected areas

 శ్రీకాకుళం, న్యూస్‌లైన్/ఒంగోలు, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను, అనంతరం కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తుననష్టం వాటిల్లిందని, నష్టాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర బృందం సభ్యులు వెల్లడించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రెండు రోజులపాటు పంటనష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం బుధవారం పర్యటనను ముగించింది. అనంతరం బృందం ప్రతినిధి డాక్టర్ పీజీఎస్ రావు మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం నష్టాలపై నివేదిక అందజేసిందని, తాము భౌతికంగా పరిశీలించేందుకు వచ్చామన్నారు. జిల్లాలో అపారనష్టం జరిగినట్లు అర్థమైందని, వరి, జీడి, బొప్పాయి, కొబ్బరి చెట్లు, రోడ్లు, కాలువలు ధ్వంసమయ్యాయని, మత్స్యకారులకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రధాని రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని, అయితే కేంద్రం అందించే పరిహారం తాత్కాలికమేనని, శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రమే చర్యలు తీసుకోవాలన్నారు. కొబ్బరి చెట్లకు సంబంధించి 50 శాతం కంటే అధికంగా నష్టపోయినవారికే పరిహారం వస్తుం దని, ఈ నిబంధనలు ఉద్యానవన పంటలన్నింటికీ వర్తిస్తాయన్నారు. మరోవైపు.. ప్రకాశంజిల్లాలో భారీ వర్షం వచ్చినా.. రైతాంగానికి పెద్దగా నష్టం వాటిల్లలేదని ఆ జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం అభిప్రాయపడింది. ‘వరి నారు దశలోనే ఉంది. మళ్లీ నాట్లు వేసుకోవచ్చు కదా. పత్తి పచ్చగా బాగుంది కదా..’ అంటూ ప్రకాశంలో పర్యటించిన కేంద్ర బృందం వ్యాఖ్యలు చేయడంతో రైతులు, అధికారులు విస్తుపోయారు. వాస్తవానికి జిల్లాలో పంటలన్నీ ధ్వంసం కాగా, మొత్తం రూ.860 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనావేశారు. అయితే శంభుసింగ్ నేతృత్వంలో జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం.. ఉదయం చీరాల రూరల్ మండలంలో మొదలుపెట్టి సాయంత్రం ఒంగోలులో సమీక్షతో మొక్కుబడిగానే పర్యటనను ముగించింది. జిల్లాలో నష్టంపై జాతీయ విపత్తుల నివారణ సంస్థ కమిషనర్‌కు నివేదిక ఇస్తామని చెప్పడంతోపాటు కొన్ని సలహాలు ఇచ్చి సమావేశాన్ని ముగించారు. కాగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రరాష్ట్రంలో పంటనష్టం చాలా ఎక్కువగా ఉందని, 15రోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని బృందం సభ్యులు ఎ.చంద్రశేఖర్, కె.రామవర్మ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో వెల్లడించారు. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
 సెల్‌ఫోన్‌తో పంటనష్టం పరిశీలనా?
 తుపాన్ బాధితులను ఆదుకోవాలని గవర్నర్‌కు వినతి
 సాక్షి, హైదరాబాద్: తుపాను, వరద బీభత్సంతో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని బీజేపీ ధ్వజమెత్తింది. పంట నష్టాలను సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో ఎలా పరిశీలిస్తారని కేంద్ర బృందాన్ని నిలదీసింది. బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పిం చింది. కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. 19 జిల్లాల్లో 34లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ప్రభుత్వాల్లో కనీస కదలిక లేదన్నారు. వరి పంటకు ఎకరాకు రూ.15వేలు, పత్తికి రూ.20 వేలు, మొక్కజొన్నకు రూ.12వేలు ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement