మూడు ఎన్నికలాట! | elections time in seemandhra | Sakshi
Sakshi News home page

మూడు ఎన్నికలాట!

Published Sat, Mar 8 2014 2:25 AM | Last Updated on Tue, Aug 14 2018 7:49 PM

elections time in seemandhra

 అసలే సార్వత్రిక ఎన్నికలు.. లోక్‌సభ, అసెంబ్లీలకు ఉమ్మడిగా జరిగే ఈ ఎన్నికలే అగ్ని పరీక్ష అనుకుంటే.. ఉరుములేని పిడుగులా మున్సిపల్ ఎన్నికలు.. ఇది చాలదన్నట్లు తాజాగా మెరుపులా మెరిసిన జెడ్పీ ఎన్నికలు.. మన దేశ ఎన్నికల చరిత్రలోనే బహుశా ఇంతముందెన్నడూ ఇన్ని రకాల ఎన్నికలు ఒకేసారి జరిగి ఉండవేమో!.. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో ఏళ్ల తరబడి జాప్యమవుతూ వచ్చిన మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు అనూహ్యంగా తెరపైకి వచ్చి.. ముందునుంచీ సన్నాహాలు చేసుకుంటున్న సార్వత్రిక ఎన్నికలను వెనక్కి నెట్టేయడంతో ఇటు రాజకీయ పార్టీలు.. అటు అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మూడు ఎన్నికలాటలో తీర్పు చెప్పాల్సింది మాత్రం.. ఆసులాంటి ఓటరు ఒక్కడే.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
 ఎన్నికలే... ఎన్నికలు!.. ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్న చందంగా... ఒక ఎన్నికే అనుకుంటే మరో రెండు ఎన్నికలు వచ్చిపడ్డాయి. సాధారణ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్న ప్రధాన పార్టీలపై ఊహించని రీతిలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అందుకు సిద్ధమవుతుండగానే మరో ఎన్నికల పిడుగు పడింది. వెంటనే జెడ్పీ, మండల పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో ‘పరిషత్తు’ ఎన్నికలకు తెర లేచింది. ఇలా మూడు ఎన్నికలూ... అదీ కేవలం రెండు నెలల వ్యవధిలోనే రావడ పార్టీలే కాదు ప్రజలూ ఊహించని పరిణామమే.
 
 అందరి కన్నూ జెడ్పీ అధ్యక్ష పీఠంపైనే
 జిల్లా, మండల పరిషత్తు అధ్యక్షుల రిజర్వేషన్లపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేశారు. కాగా కీలకమైన జిల్లా, మండల పరిషత్తు అధ్యక్షుల రిజర్వేషన్లపై అధికార యంత్రాంగం కసరత్తు జరుపుతోంది. శనివారం మధ్యాహ్నానికి వీటిని ఖరారు చేస్తారని తెలుస్తోంది. జిల్లా పరిషత్తు చైర్మన్ పదవి ఈసారి మహిళలకు రిజర్వు కావచ్చని స్పష్టమవుతోంది. కాగా ఇందులో కూడా బీసీ మహిళ, ఎస్సీ మహిళకు కేటాయిస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆ రిజర్వేషన్ ప్రకారం జిల్లాలో మూడు ప్రధాన పార్టీల నుంచి జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచే ముఖ్య నేతలు బయటపడతారు. మూడు ప్రధాన పార్టీల్లోని ప్రముఖ మహిళా నేతలు జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ పదవిపై ఇప్పటికే కన్నేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం దక్కని మహిళా నేతలు జెడ్పీ చైర్‌పర్సన్ గిరీని దక్కించుకోవడానికి ఇప్పటికే వ్యూహరచనలో నిమగ్నమయ్యారు.  అదే విధంగా జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ ఎంపీపీ రిజర్వేషన్లపై కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ప్రతి మండలంలోనూ ఒకటి రెండు వర్గాలు ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను సర్దుబాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆశావహులు ఉన్నారు.
 
 నోటిఫికేషన్‌పై ఉత్కంఠ
 జిల్లా, మండల పరిషత్తు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10(సోమవారం)న విడుదల చేస్తారని అత్యధికులు భావిస్తున్నారు. ఆ దిశగానే అధికార యం త్రాంగం సన్నాహాలను వేగవంతం చేసింది. అలా అయితే మున్సిపల్ ఎన్నికల జరగ్గానే జిల్లా, మండల పరిషత్తు ఎన్నికలు నిర్వహిస్తారు. అలా కాకుండా నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైతే సాధారణ ఎన్నికల తరువాతే ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ అందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలపై  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ జిల్లా, మండల పరిషత్తు రిజర్వేషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయమని అధికారులను ఆదేశించింది. దాంతో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే జిల్లా, మండల పరిషత్తు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీనిపై సోమవారం వరకు ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందే.  ఈ నేపథ్యంలో జిల్లాలోని రాజకీయ పార్టీలు మూడు ఎన్నికలకూ సన్నాహాలకు చేపట్టాయి.
 
 వైఎస్సార్‌సీపీ కార్యాచరణ
 మూడు ఎన్నికల కార్యాచరణ దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే మేల్కొంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల వ్యూహరచనలో ఉన్న పార్టీ పరషత్తు పోరుపైనా దృష్టిసారించింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హైదారబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ హాజరుకానున్నారు. మున్సిపల్, పరిషత్తు, సాధారణ ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఇప్పటి కే ఖరారైన జెడ్పీటీసీ, ఎంపీసీటీ రిజర్వేషన్ల ఆధారంగా పార్టీ అభ్యర్థులు ఎవరన్నదానిపై ప్రాథమిక సమాలోచన లు చేపట్టారు. ఒకేసారి మూడుఎన్నికలు రావడాన్ని ప్రతికూలంగా కాకుండా సానుకూలం గా మలచుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. పార్టీలో ఉన్న అశావాహులందరినీ, అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా టిక్కెట్ల కేటాయింపు చేయాలన్నది పార్టీ అధిష్టానం ఆలోచనగా ఉంది.
 
 ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయించడంతోపాటు అవకాశం దక్కని ఇతర వర్గాలకు మున్సిపల్, మండల, జెడ్పీటీసీ ఎన్నికల్లో గుర్తింపు ఇవ్వాలన్నది వ్యూహం. దీని వల్ల అశావాహులు, ద్వితీయశ్రేణి నేతలకు అవకాశం కల్పించడంతోపాటు సామాజికవర్గ సమతూల్యం సాధిం చవచ్చని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నియమితులైన నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర నేతల సామాజిక వర్గాలు, పార్టీ కోసం వారు చేసిన కృషి తదితర అంశాలను భేరీజు వేస్తోంది. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రకారం కార్యాచరణను రూపొందించనున్నారు. మరోవైపు పార్టీ విధానాన్ని సక్రమంగా అమలు చేసేందుకు మున్సిపల్, పరిషత్తు ఎన్నికల కోసం పరిశీలకులను నియమించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ఇతర జిల్లాలకు చెందిన నేతలను పరిశీలకులుగా నియమించనున్నారు.
 
 పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నిర్వహించనున్న సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం జిల్లా పార్టీ విసృ్తతస్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల కార్యాచరణ అమలుకు శ్రీకారం చుడతారు.
 
 టీడీపీ, కాంగ్రెస్ సమాలోచనలు
 టీడీపీ కూడా మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలపై దృష్టి సారించింది. మున్సిపల్‌అభ్యర్థుల ఎంపిక కసరత్తును త్వరగా పూర్తిచేయాలని ఆ పార్టీనేతలు  భావిస్తున్నారు. ఆ వెంటనే జిల్లా, మండల పరిషత్తు అభ్యర్థుల ఎంపిక చేపడతారు. ఇప్పటికే జిల్లాలో పార్టీ కార్యక్రమాల కోసం అధినేత చంద్రబాబు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. చౌదరిబాబ్జీ, కళా వెంకట్రావు, గౌతు శివాజీ, అచ్చెన్నాయుడు, కూన రవి ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ చేపట్ట లేదు. కేంద్రమంత్రి కృపారాణి, కోండ్రు మురళీ తదితరులు ప్రాథమిక చర్చల తోనే సరిపుచ్చారు. ప్రస్తుతం జిల్లా, మండల పరిషత్తు ఎన్నికలు కూడా వచ్చిపడటంతో కాంగ్రెస్ కూడా సీరియస్‌గానే ఎన్నికల దిశగా అడుగులు వేయకతప్పదు.  ఈ నేపథ్యంలో జిల్లాలో రానున్న రెండు నెలలు సర్వత్రా ఎన్నికలే సందడే కనిపించనుందనడటం మాత్రం సుస్పష్టం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement