అధికారాంతమునా ఆమ్యామ్యానే!
జిల్లాలో ఓ కీలక నేత యవ్వారం
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరిట వసూళ్లు
రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
ప్రభుత్వ పతనంతో ఆందోళనలో కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఓ కీలక నేత ఆత్రం.. కాంట్రాక్టు ఉద్యోగులపాలిట శాపంగా మారింది. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేసిన కాంట్రాక్టు ఉద్యోగులను ఆ ప్రభుత్వ పెద్ద ‘అయితే నాకేంటి?’అని ప్రశ్నించారు. ‘నా సంగతి చూస్తే... మీ సమస్య పరిష్కరిస్తా’అని అసలు విషయాన్ని సూటిగా చెప్పేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం పతనావస్థకు చేరుకున్న వేళ కూడా వారి నుంచి వీలైనంత గుంజుకునేందుకు యత్నించారు. తీరా మొదటి విడత కొంత చెల్లించాక.. రాష్ట్రంలో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దాంతో తమ ఉద్యోగాల సంగతేమిటి? సమర్పించుకున్న మొత్తం సంగతేమిటని ఆ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ కీలక నేత నుంచి, ఆయన వ్యక్తిగత సహాయకుడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హతాశులవుతున్నారు.
ఇదీ సంగతి..
తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే దాదాపు 300 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. పదేళ్లకుపైగా పనిచేస్తున్న వీరంతా తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కాగా తమకు న్యాయం చేయమని తన వద్దకు వచ్చిన ఉద్యోగులతో ప్రభుత్వంలోని ఓ కీలక నేత మాట్లాడినపుడు అసలు విషయాన్ని బయటపెట్టారు. రూ.కోటి ఇస్తే ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. ఉద్యోగాల క్రమబద్ధీకరణకు వైద్యశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకంగా ఉన్నారని, కాబట్టి ప్రభుత్వంలోని ముఖ్యనేతతో వారికి చెప్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి ఆ మాత్రం సొమ్ము సమర్పించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. అలా అయితేనే ప్రభుత్వస్థాయిలో సహకరిస్తానని తేల్చిచెప్పారు. దాంతో కాంట్రాక్టు ఉద్యోగులు హతాశులయ్యారు. కానీ కీలక నేత తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా ఆ ఉద్యోగులపై నిరంతరం ఒత్తిడి చేశారు. చివరికి ఉద్యోగులు మరోదారి లేక సరేనన్నారు. అందులో మొదటి విడతగా కొన్ని రోజుల క్రితం రూ.30 లక్షలు ఆ కీలక నేత వ్యక్తిగత సహాయకుడికి సమర్పించుకున్నారు.
ప్రభుత్వ పతనం..పత్తాలేని కీలక నేత
వేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయటంతో మొత్తం మంత్రిమండలి రద్దైంది. దాంతో హెల్త్ అసిస్టెంట్ల గుండెల్లో దడ మొదలైంది. అసలు సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని కొన్నిరోజులుగా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన హెల్త్ అసిస్టెంట్లు ఉద్యోగాల క్రమబద్ధీకరణపై అధికార పార్టీ కీలక నేత ముందు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వారి భయాన్ని ఆ నేత కొట్టిపారేశారు. ‘అంతా నేను చూసుకుంటాను. మీరు ధీమాగా ఉండండి.. మిగిలిన రూ.70 లక్షలు సమకూర్చుకోండి’అని తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా చెప్పిం చారు. ఇంతలో సీఎం కిరణ్ రాజీనామా చేశా రు.. గానీ వారి ఉద్యోగాల సంగతి తేలలేదు. దీంతో తీవ్రంగా ఆందోళన చెందిన హెల్త్ అసిస్టెంట్లు కీలక నేతను సంప్రదించేందుకు బుధ, గురువారాల్లో ఎడతెగని ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన కనీసం ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో శ్రీకుకుళంలో ఉండే ఆయన వ్యక్తిగత సహాయకుడిని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన కూడా అందుబాటులో లేకుండాపోయారు. ఫోన్లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దాంతో కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం జిల్లా వైద్య శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో.. కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే!