
సామాన్య భక్తులకు సకల సౌకర్యాలు
తితిదే కొత్త చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి
సాక్షి, హైదరాబాద్: సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తానని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. వారికి సకల సౌకర్యాలు కల్పించడంద్వారా మంచివాడిననిపించుకుంటానన్నారు. తితిదే చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణతో పనిచేస్తానన్నారు.
నూతన విధానాన్ని అమలుచేయడంద్వారా బాలాజీ దర్శనాన్ని సులభతరం చేస్తానన్నారు. అనవసర వివాదాల జోలికెళ్లబోనన్నారు.‘నేను అత్యంత సామాన్యుడిని. సామాన్య భక్తులకే అవకాశమిస్తా, పొరపాట్లకు తావివ్వను’ అని కృష్ణమూర్తి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు టీటీడీ చైర్మన్ పదవినిచ్చి సముచిత స్థానం కల్పించారని, ఆయన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి వచ్చేవరకూ మీడియా బాగా ప్రచారం చేసిందని, మీడియాకు కూడా రుణపడి ఉంటానన్నారు.