సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖా గ్రంథాలయాల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రెండు నెలలుగా జీతాలు లేక అల్లాడుతుంటే పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ దాసరి రాజా మాస్టర్ పట్ల మాత్రం ఎక్కడలేని ప్రేమ ప్రదర్శించింది. రూ. 50 వేలుగా ఉన్న ఆయన జీతం, అలవెన్సులను భారీగా పెంచేసి నెలకు రూ. 2 లక్షలుగా నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రంథాలయాల సెస్సు నుంచి ఏడాది బకాయిలతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
నిజానికి సంస్థ చైర్మన్‌కు నెలకు రూ. 25 వేలు జీతం, మరో రూ. 25 వేలు వరకు అలవెన్సులు ఉండేది. దానిని రాష్ట్ర ప్రభుత్వం నెలకు జీతం రూ. లక్ష, వసతి అలవెన్సు రూ. 50 వేలు, ప్రయాణ అలవెన్సు రూ. 50 వేలుగా నిర్ణయించింది. ఈ మేరకు 2018, మే 22న జారీ చేసిన జీవో నంబర్ 74 ప్రకారం జీతాలు, అలవెన్సుల పెంపుదలను వెంటనే అమలు చేయాలని పేర్కొంది. ఏడాది బకాయిలతో సహా ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఈ నెల 19న ఆర్సీ నంబర్ 49తో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ దాసరి రాజా మాస్టర్ 2018, ఏప్రిల్ 19న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి 2018 మే 1వరకు పాత జీతాలు, తర్వాత పెరిగిన దానితో కలిపి మొత్తం రూ. 24.80 లక్షలు రాష్ట్రంలోని అన్ని జిల్లా గ్రంథాలయ సంస్థల సెస్సు నిధుల నుంచి చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో ఒక్కో జిల్లా గ్రంథాలయ సంస్థపై దాదాపుగా రూ.2 లక్షల వరకు చైర్మన్ జీతం భారం పడింది.
నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు...
దాసరి రాజా మాస్టర్ గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌గా కంటే కూడా టీడీపీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వాహకుడిగానే ఎక్కువ సమయం కేటాయిస్తారు. జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. బూత్‌ల వారీగా టీడీపీ ఎన్నికల వ్యూహాల అమలు బాధ్యతను ఆయనే పర్యవేక్షించారు. అందుకు ప్రతిగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి అయాచిత లబ్ధి కలిగేలా నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై సంస్థలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గ్రంథాలయాల సెస్సు నిధుల నుంచి చైర్మన్‌కు జీతం, అలవెన్సులు చెల్లించడం నిబంధనకు విరుద్ధం. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వసూలు చేసే ఇంటిపన్నులో 8 శాతం గ్రంథాలయ సెస్సు వాటా ఉంటుంది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం ఆ మొత్తాన్ని ఆయా జిల్లాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి. ఆ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తన విధి నిర్వహణలో ప్రయాణ, వసతి భత్యాలకు కూడా ఆ నిధులను వినియోగించవచ్చు. అంతేకానీ ఒక జిల్లాలో వసూలు చేసిన సెస్సును మరో జిల్లాలో వినియోగించడానికి వీల్లేదు. ఈ నిబంధనలను ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.
జీతాలు లేక ఉద్యోగుల ఇక్కట్లు
మరోవైపు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు తమ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఫిబ్రవరి నుంచి జీతాలు అందక ఉద్యోగులు, పింఛన్లు అందక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం చైర్మన్ జీతాన్ని భారీగా పెంచడంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. దాదాపు వెయ్యి మంది ఉన్న రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు నెలకు రూ.10 కోట్లు అవసరం. జీతాలు, పింఛన్ల కోసం తక్షణం రూ.30 కోట్లు కావాల్సి ఉంది. జీతాల కోసం ఉద్యోగులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఇక గ్రంథాలయాల నిర్వహణ నిధులను కూడా ప్రభుత్వం రెండు నెలలుగా మంజూరు చేయడం లేదు. దాంతో గ్రంథాలయాల అద్దెలు, కరెంటు బిల్లులు, పేపర్ బిల్లులకు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment