Library Chairman
-
దాసరి రాజాకు చంద్రబాబు నజరానా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖా గ్రంథాలయాల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రెండు నెలలుగా జీతాలు లేక అల్లాడుతుంటే పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ దాసరి రాజా మాస్టర్ పట్ల మాత్రం ఎక్కడలేని ప్రేమ ప్రదర్శించింది. రూ. 50 వేలుగా ఉన్న ఆయన జీతం, అలవెన్సులను భారీగా పెంచేసి నెలకు రూ. 2 లక్షలుగా నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రంథాలయాల సెస్సు నుంచి ఏడాది బకాయిలతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నిజానికి సంస్థ చైర్మన్‌కు నెలకు రూ. 25 వేలు జీతం, మరో రూ. 25 వేలు వరకు అలవెన్సులు ఉండేది. దానిని రాష్ట్ర ప్రభుత్వం నెలకు జీతం రూ. లక్ష, వసతి అలవెన్సు రూ. 50 వేలు, ప్రయాణ అలవెన్సు రూ. 50 వేలుగా నిర్ణయించింది. ఈ మేరకు 2018, మే 22న జారీ చేసిన జీవో నంబర్ 74 ప్రకారం జీతాలు, అలవెన్సుల పెంపుదలను వెంటనే అమలు చేయాలని పేర్కొంది. ఏడాది బకాయిలతో సహా ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఈ నెల 19న ఆర్సీ నంబర్ 49తో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ దాసరి రాజా మాస్టర్ 2018, ఏప్రిల్ 19న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి 2018 మే 1వరకు పాత జీతాలు, తర్వాత పెరిగిన దానితో కలిపి మొత్తం రూ. 24.80 లక్షలు రాష్ట్రంలోని అన్ని జిల్లా గ్రంథాలయ సంస్థల సెస్సు నిధుల నుంచి చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో ఒక్కో జిల్లా గ్రంథాలయ సంస్థపై దాదాపుగా రూ.2 లక్షల వరకు చైర్మన్ జీతం భారం పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు... దాసరి రాజా మాస్టర్ గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌గా కంటే కూడా టీడీపీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వాహకుడిగానే ఎక్కువ సమయం కేటాయిస్తారు. జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. బూత్‌ల వారీగా టీడీపీ ఎన్నికల వ్యూహాల అమలు బాధ్యతను ఆయనే పర్యవేక్షించారు. అందుకు ప్రతిగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి అయాచిత లబ్ధి కలిగేలా నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై సంస్థలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గ్రంథాలయాల సెస్సు నిధుల నుంచి చైర్మన్‌కు జీతం, అలవెన్సులు చెల్లించడం నిబంధనకు విరుద్ధం. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వసూలు చేసే ఇంటిపన్నులో 8 శాతం గ్రంథాలయ సెస్సు వాటా ఉంటుంది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం ఆ మొత్తాన్ని ఆయా జిల్లాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి. ఆ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తన విధి నిర్వహణలో ప్రయాణ, వసతి భత్యాలకు కూడా ఆ నిధులను వినియోగించవచ్చు. అంతేకానీ ఒక జిల్లాలో వసూలు చేసిన సెస్సును మరో జిల్లాలో వినియోగించడానికి వీల్లేదు. ఈ నిబంధనలను ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. జీతాలు లేక ఉద్యోగుల ఇక్కట్లు మరోవైపు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు తమ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఫిబ్రవరి నుంచి జీతాలు అందక ఉద్యోగులు, పింఛన్లు అందక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం చైర్మన్ జీతాన్ని భారీగా పెంచడంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. దాదాపు వెయ్యి మంది ఉన్న రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు నెలకు రూ.10 కోట్లు అవసరం. జీతాలు, పింఛన్ల కోసం తక్షణం రూ.30 కోట్లు కావాల్సి ఉంది. జీతాల కోసం ఉద్యోగులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఇక గ్రంథాలయాల నిర్వహణ నిధులను కూడా ప్రభుత్వం రెండు నెలలుగా మంజూరు చేయడం లేదు. దాంతో గ్రంథాలయాల అద్దెలు, కరెంటు బిల్లులు, పేపర్ బిల్లులకు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. -
గౌసూ.. ఇదేం తీరు బాసూ!
అప్పజెపుతున్న పని అవుతుందా లేదా.. ఆయనకు అనవసరం. ఎంత కష్టమైనా చేయాల్సిందే. లేకుంటే జీత భత్యాలు, ఇంక్రిమెంట్లు నిర్దాక్షిణ్యంగా నిలిపేస్తామంటారు. సంస్కరణల బాట అంటారు.. నిబంధనలు పక్కాగా అమలు చేస్తామంటారు. కానీ, చేయి తడిపితే చాలు ఎంతటి పనైనా సాఫీగా జరిపించేస్తారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం ఆగ్రహిస్తే.. అవేమీ తనకు కాదన్నట్లు తనిఖీలు నిర్వహిస్తారు.. అడ్డుజెప్పే అధికారుల్ని రాబోయేది మన ప్రభుత్వమే జాగ్రత్త అంటూ బెదిరించేస్తారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో కొన్ని రోజులుగా సాగుతున్న దౌర్జన్యపు తంతు ఇది. చైర్మన్‌పై సంస్థలో పనిచేస్తున్న పలువురి ఉద్యోగుల ఆరోపణలివి. వేధింపులను ఎన్నాళ్లు భరిస్తారు ఉద్యోగులు.. చేసేది లేక రాష్ట్ర ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. వినతిపత్రం రూపంలో ఆయన లీలలనన్నింటినీ వివరించారు. అనంతపురం న్యూటౌన్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా గౌసుమొద్దీన్ వచ్చిన తర్వాత నిరంకుశ విధానాలతో సతమతమవుతున్నామని చెబుతున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. చిన్న విషయానికీ టార్గెట్లు పెడుతూ చుక్కలు చూపిస్తున్నారని వేదన చెందుతున్నారు. ఈ క్రమంలో వేధిం పులు భరించలేదని కొందరు ఇటీవలే ఆయన అవినీతీ బాగోతాన్ని వివరిస్తూ రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ పార్వతికి లేఖ రాశారు. తొలిసారి జిల్లా వేదికగా ఆర్డీటీ సాయంతో డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేల పుస్తకాలను అప్లోడ్ చేయాలని చైర్మన్ హుకుం జారీ చేశారు. ఉద్యోగులు ఆపసోపాలు పడుతూ 6 నెలలుగా పనిచేస్తున్నా ఇప్పటికీ 40 వేలకు చేరుకోలేదు. దీనిపై ఉద్యోగులను భయపెడుతూ చైర్మన్, కార్యదర్శి ఎంచుకున్న పద్ధతి విచిత్రంగా ఉంది. అప్‌లోడ్‌కు కష్టమైతే రూ.2,300 చెల్లించాలని నియమం విధించారు. ఇక మరొక అంశం మెంబర్షిప్ టార్గెట్. గ్రంథాలయ రాష్ట్ర డైరెక్టర్ 15 వేల మంది సభ్యులను చేర్చుకోవాలని సూచిస్తే.. దాన్ని 17,200కు లాగారు. చేయకపోతే జీత భత్యాలు, ఇంక్రిమెంట్లు నిలిపివేస్తామని చెప్పేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రినే సమీక్షలు చేయొద్దని స్వయంగా ఈసీ చెబుతుంటే అవేవీ తనకు వర్తించవంటూ శాఖా గ్రంథాలయాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోసారి వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఉద్యోగాలను జాగ్రత్తగా చూసుకోవాలని భయపెడుతున్నారు. వేసవి సెలవుల్లో చిన్నారులకు సమ్మర్ క్యాంపులు నడపాలని ఆదేశించారు. అయితే, చాలా ప్రాంతాలలో పిల్లలు క్యాంపులకు రారని ఉద్యోగులు చెప్పినా వినలేదు. క్యాంపుల విషయంలో బలవంతం చేయొద్దని రాష్ట్ర అధికారులు ఆదేశించినా ఇక్కడ మాత్రం బేఖాతరయ్యాయి. విశ్రాంత ఉద్యోగులకు బకాయిలను ఇవ్వకుండా ఆపేశారు. వాటితో బిల్డింగులు కడుతున్నామని చెబుతున్నారు. దీనిపై కడుపుకాలిన కొందరు విషయాలన్నింటినీ ప్రజా ప్రతినిధుల వద్ద ప్రస్తావిస్తే మీరే సెక్రటరీని, చైర్మన్‌ను వేధిస్తున్నారంటుండడం కొసమెరుపు. ముందు నుంచి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న ఒక ఉద్యోగి ఈయన వద్ద చక్రం తిప్పుతున్నాడని సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. చైర్మన్ కూడా ఆయన వలలో పడడంతో ఆ ఉద్యోగి ఇష్టారాజ్యంగా మారిపోయిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. కేంద్ర గ్రంథాలయంలో మూడేళ్లుగా జరుగుతున్న అవినీతి తంతును కొందరు ఉద్యోగులు రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే పనిచేయలేమని చెప్పుకొచ్చారు. వారి ఆరోపణల్లో కొన్ని.. జీఓ ఎంస్ నం.54 ప్రకారం బదిలీకి కనీస అర్హత 3 ఏళ్లు. కానీ పరిగి గ్రంథాలయాధికారిగా పనిచేస్తున్న ఉద్యోగినిని 3 ఏళ్లు దాటకనే వజ్రకరూరుకు బదిలీ చేశారు. అక్కడున్న ఉద్యోగి 3 ఏళ్లు కాకుండానే పెద్దవడుగూరుకు పంపించారు. డిప్యూటేషన్లప్పుడు నిబంధనలు పాటించ లేదు. జయరామ్ అనే ఉద్యోగిని కొత్త చెరువులో పని చేయనీకుండా గతంలో పీఏగా పెట్టుకున్నారని అందులో పేర్కొన్నారు. రికార్డు అసిస్టెంటుగా మల్లికార్జున జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పనిచేస్తుండగా గ్రేడ్ 2 గ్రంథాలయ అధికారి రవికుమార్ నాయుడును ఎందుకు అక్రమంగా కొనసాగిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధీనంలో 9 షాపులు నడుస్తున్నాయి. కావాల్సిన వారికి తక్కువ బాడుగలకు ఇస్తూ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒక్కో షాపు నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేశారు. షాపుల విషయం కోర్టులో ఉన్నా ఖాతరు చేయలేదు. శెట్టూరు గ్రేడు 3 లైబ్రేరియన్ పోస్టులో ఔట్ సోర్సింగ్ హెల్పర్ పూర్తి చార్జి ఎలా తీసుకుందో అర్థం కావడంలేదు. బాష అనే ఉద్యోగిపై సస్పెన్షన్ ఎత్తి వేస్తూ డైరెక్టర్ మరో చోటికి పోస్టింగు ఇచ్చినా ఆయనను అదే స్థానంలో కొనసాగిస్తున్నారు. లంచం పుచ్చుకునే ఇలా చేశారు. దీనిపై చైర్మన్‌ను ప్రశ్నించిన ఇద్దరు ఉద్యోగులలపై అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేశారు. 1987లో 11 మందికి రావాల్సిన అరియర్స్ డైరెక్టర్ ఆర్డర్స్ బిల్లు మంజూరు కోసం చైర్మన్, కార్యదర్శులు ఒక్కొక్కరితో రూ.30 వేలు తీసుకున్నారు. జిల్లాలో పలు గ్రంథాలయాలకు అక్రమ డిప్యూటేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు ఇష్టం వచ్చిన చోటుకు వేయడానికి రూ. 50 వేలు తీసుకున్నారు. కేంద్ర గ్రంథాలయంలో రికార్డు అసిస్టెంటు వెంకటేష్‌ను చైర్మన్ పీఏగా నియమించుకుని అతని ద్వారా డబ్బులు వసూలు చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. పనిచేయమంటే వ్యతిరేకిస్తున్నారు దశాబ్దాలుగా ఇతర శాఖల ఉద్యోగులతో పోలిస్తే గ్రంథాలయ ఉద్యోగులకు పనిభారం ఉండేది కాదు. 2015 తర్వాత సంస్కరణల బాట పడదామంటే వ్యతిరేకిస్తున్నారు. సభ్యత్వం కానీ, సమ్మర్ క్యాంపులు కానీ చాలా మంది ఉద్యోగులకు ఇష్టం లేదు. ఇతర శాఖల్లో ఇటువంటి వ్యతిరేకత కనపడదు. పని చేయడానికి ఇష్టపడక అవినీతి అంటూ కొత్త రాగమెత్తుకున్నారు. అలాంటిదుంటే ఏ విచారణకైనా సిద్ధమే. – గౌసుమొద్దీన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ -
కిలారికి గ్రంథాలయ కుర్చీ
లోకేష్, నారాయణ ఆశీస్సులతో పేరు ఖరారు మూడు రోజుల్లో మార్కెట్ కమిటీల పదవుల ఖరారు నెల్లూరు : నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ నాయకుడు కిలారి వెంకటస్వామి నాయుడుకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఖరారైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబు, మంత్రి నారాయణ ఆశీస్సులతో కిలారి పదవి దక్కించుకోబోతున్నారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు గుర్రుగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇందులో పనిచేస్తున్న కిలారి వెంకటస్వామినాయుడు నెల్లూరురూరల్ నియోజకవర్గం ఏర్పడ్డాక శాసనసభకు పోటీ చేయడానికి పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. టీడీపీ, వామపక్షాల పొత్తు కారణంగా 2009లో ఈ స్థానం సీపీఎంకు కేటాయించారు. 2014లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని వెంకటస్వామినాయుడు తీవ్రంగా ప్రయత్నించారు. చివరి నిమిషంలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో రూరల్ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో అసంతృప్తికి గురైన కిలారికి పార్టీ అధికారంలోకి వస్తే జిల్లా స్థాయిలో గుర్తింపు ఉన్న పదవి ఇస్తామని చంద్రబాబునాయుడు బుజ్జగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే తనకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఇవ్వాలని వెంకటస్వామినాయుడు పార్టీ అధినేత చంద్రబాబును అడిగారు. ఇందుకోసం మంత్రి నారాయణ, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మద్దతు కూడా తీసుకున్నారు. రెండేళ్లుగా నామినేషన్ పదవుల పందారం జరక్కపోవడంతో రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు తనకు అప్పగించాలని పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఆదాలతో అంతరం... పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తనకు కాకుండా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇవ్వడంపై కిలారి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీ సమావేశాల్లో సైతం ఈ విషయాన్ని ఆయన చెబుతూ వచ్చారు. చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు పార్టీలోకి వచ్చిన తనకు నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇవ్వడాన్ని కిలారి తప్పుబట్టడం ఆదాల ప్రభాకర్‌రెడ్డికి ఏమాత్రం రుచించలేదు. దీంతో వారిద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రూరల్ నియోజకవర్గంలో తన పట్టు పెంచుకోవడానికి ఆదాల ప్రయత్నిస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పనులన్నీ తన అభీష్టం మేరకే మంజూరయ్యేలా రాజకీయం నడుపుతున్నారు. అయితే రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని దీటుగా ఎదుర్కోవడం కోసం మంత్రి నారాయణకు ఆ బాధ్యతలు ఇవ్వబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. మంత్రి ఈ ప్రచారాన్ని ఖండించలేదు. ఆదాల ఈ వ్యవహారంపైన ఆగ్రహించి జన్మభూమి - మా ఊరు సభలకు డుమ్మా కొట్టారు. రూరల్ ఇన్చార్జ్ బాధ్యతలు మీకే ఉంటాయని చంద్రబాబు ఆదాలను బుజ్జగించారు. ఈ వివాదం ముగిసి నెల తిరక్కుండానే ఆదాలకు తెలియకుండా ఆయన వ్యతిరేకి కిలారి వెంకటస్వామినాయుడుకు జిల్లాలో ప్రోటోకాల్ ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించడం ఆదాలకు ఆగ్రహం కలిగించింది. తనతోపాటు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన పేర్నేటి కోటేశ్వరరెడ్డికి ఈ పదవి ఇప్పించాలని ఆదాల రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకత్వం కిలారికి ఈ పదవి ఇవ్వడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా తొలి నుంచి పార్టీలో ఉన్న ఎస్సీ సెల్ నాయకుడు పాముల రమణయ్యకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇప్పించాలని ఎమ్మెల్సీ సోమిరెడ్డి రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు కూడా తెలియకుండా పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై సోమిరెడ్డి కూడా ఆందోళనతో ఉన్నట్లు పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది. మూడు రోజుల్లో మార్కెట్ కమిటీల పదవుల ఖరారు జిల్లాలోని గూడూరు, వాకాడు, సూళ్లూరుపేట, నాయుడుపేట మార్కెట్ కమిటీలకు పాలక మండలి నియామకం కోసం నాయకుల పేర్లు సిఫార్సు చేయాలని జిల్లా పార్టీ నాయకులతో నిర్ణయించింది. ఈ మేరకు ఆ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లకు సూచనలు ఇచ్చింది. దీంతోపాటు జిల్లాలో ఖాళీగా ఉన్న దేవాలయాల చైర్మన్లు, పాలక మండలి సభ్యుల పదవుల కోసం జాబితాలు ఇవ్వాలని జిల్లాలోని శాసనసభ్యులు, పార్టీ ఇన్‌చార్జ్‌లను ఆదేశించింది. ఈ జాబితాలు అందిన వెంటనే తొలివిడత పదవులు పందారం మొదలు పెట్టాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర సాక్షి ప్రతినిధికి చెప్పారు. లోకేష్, నారాయణతో భేటీ కిలారి వెంకటస్వామినాయుడు మంగళవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబును గుంటూరులో కలిశారు. తనకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఇప్పించాలని అడిగారు. ఆర్టీసీ విభజన జరగనందువల్ల ఈ పదవి ఇవ్వడం సాధ్యంకాదని, జిల్లా స్థాయిలో గుర్తింపు ఉన్న పదవి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇదే విషయంపై మంత్రి నారాయణతో లోకేష్ మాట్లాడారు. రూరల్ నియోజకవర్గ రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవాలనే ఆలోచనతో ఉన్న నారాయణ ఇదే అదునుగా భావించి కిలారిని తన వద్దకు పిలిపించుకుని ఆయనతో చర్చలు జరిపి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి ఎంపికయ్యేలా రాజకీయం నడిపారు. లోకేష్‌బాబు సిఫార్సు మేరకు కిలారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇద్దామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రలను ఒప్పించారు. ఈ మేరకు కిలారి పేరు పార్టీ అధ్యక్షుడుకి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.