అప్పజెపుతున్న పని అవుతుందా లేదా.. ఆయనకు అనవసరం. ఎంత కష్టమైనా చేయాల్సిందే. లేకుంటే జీత భత్యాలు, ఇంక్రిమెంట్లు నిర్దాక్షిణ్యంగా నిలిపేస్తామంటారు. సంస్కరణల బాట అంటారు.. నిబంధనలు పక్కాగా అమలు చేస్తామంటారు. కానీ, చేయి తడిపితే చాలు ఎంతటి పనైనా సాఫీగా జరిపించేస్తారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం ఆగ్రహిస్తే.. అవేమీ తనకు కాదన్నట్లు తనిఖీలు నిర్వహిస్తారు.. అడ్డుజెప్పే అధికారుల్ని రాబోయేది మన ప్రభుత్వమే జాగ్రత్త అంటూ బెదిరించేస్తారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో కొన్ని రోజులుగా సాగుతున్న దౌర్జన్యపు తంతు ఇది. చైర్మన్‌పై సంస్థలో పనిచేస్తున్న పలువురి ఉద్యోగుల ఆరోపణలివి. వేధింపులను ఎన్నాళ్లు భరిస్తారు ఉద్యోగులు.. చేసేది లేక రాష్ట్ర ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. వినతిపత్రం రూపంలో ఆయన లీలలనన్నింటినీ వివరించారు.
అనంతపురం న్యూటౌన్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా గౌసుమొద్దీన్ వచ్చిన తర్వాత నిరంకుశ విధానాలతో సతమతమవుతున్నామని చెబుతున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. చిన్న విషయానికీ టార్గెట్లు పెడుతూ చుక్కలు చూపిస్తున్నారని వేదన చెందుతున్నారు. ఈ క్రమంలో వేధిం పులు భరించలేదని కొందరు ఇటీవలే ఆయన అవినీతీ బాగోతాన్ని వివరిస్తూ రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ పార్వతికి లేఖ రాశారు.
తొలిసారి జిల్లా వేదికగా ఆర్డీటీ సాయంతో డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేల పుస్తకాలను అప్‌లోడ్ చేయాలని చైర్మన్ హుకుం జారీ చేశారు. ఉద్యోగులు ఆపసోపాలు పడుతూ 6 నెలలుగా పనిచేస్తున్నా ఇప్పటికీ 40 వేలకు చేరుకోలేదు. దీనిపై ఉద్యోగులను భయపెడుతూ చైర్మన్, కార్యదర్శి ఎంచుకున్న పద్ధతి విచిత్రంగా ఉంది. అప్‌లోడ్‌కు కష్టమైతే రూ.2,300 చెల్లించాలని నియమం విధించారు.
- ఇక మరొక అంశం మెంబర్‌షిప్ టార్గెట్. గ్రంథాలయ రాష్ట్ర డైరెక్టర్ 15 వేల మంది సభ్యులను చేర్చుకోవాలని సూచిస్తే.. దాన్ని 17,200కు లాగారు. చేయకపోతే జీత భత్యాలు, ఇంక్రిమెంట్లు నిలిపివేస్తామని చెప్పేశారు.
- ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రినే సమీక్షలు చేయొద్దని స్వయంగా ఈసీ చెబుతుంటే అవేవీ తనకు వర్తించవంటూ శాఖా గ్రంథాలయాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోసారి వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఉద్యోగాలను జాగ్రత్తగా చూసుకోవాలని భయపెడుతున్నారు.
- వేసవి సెలవుల్లో చిన్నారులకు సమ్మర్ క్యాంపులు నడపాలని ఆదేశించారు. అయితే, చాలా ప్రాంతాలలో పిల్లలు క్యాంపులకు రారని ఉద్యోగులు చెప్పినా వినలేదు. క్యాంపుల విషయంలో బలవంతం చేయొద్దని రాష్ట్ర అధికారులు ఆదేశించినా ఇక్కడ మాత్రం బేఖాతరయ్యాయి.
- విశ్రాంత ఉద్యోగులకు బకాయిలను ఇవ్వకుండా ఆపేశారు. వాటితో బిల్డింగులు కడుతున్నామని చెబుతున్నారు. దీనిపై కడుపుకాలిన కొందరు విషయాలన్నింటినీ ప్రజా ప్రతినిధుల వద్ద ప్రస్తావిస్తే మీరే సెక్రటరీని, చైర్మన్‌ను వేధిస్తున్నారంటుండడం కొసమెరుపు.
- ముందు నుంచి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న ఒక ఉద్యోగి ఈయన వద్ద చక్రం తిప్పుతున్నాడని సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. చైర్మన్ కూడా ఆయన వలలో పడడంతో ఆ ఉద్యోగి ఇష్టారాజ్యంగా మారిపోయిందని ఉద్యోగులు మండిపడుతున్నారు.
- కేంద్ర గ్రంథాలయంలో మూడేళ్లుగా జరుగుతున్న అవినీతి తంతును కొందరు ఉద్యోగులు రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే పనిచేయలేమని చెప్పుకొచ్చారు. వారి ఆరోపణల్లో కొన్ని..
- జీఓ ఎంస్ నం.54 ప్రకారం బదిలీకి కనీస అర్హత 3 ఏళ్లు. కానీ పరిగి గ్రంథాలయాధికారిగా పనిచేస్తున్న ఉద్యోగినిని 3 ఏళ్లు దాటకనే వజ్రకరూరుకు బదిలీ చేశారు. అక్కడున్న ఉద్యోగి 3 ఏళ్లు కాకుండానే పెద్దవడుగూరుకు పంపించారు.
- డిప్యూటేషన్లప్పుడు నిబంధనలు పాటించ లేదు. జయరామ్ అనే ఉద్యోగిని కొత్త చెరువులో పని చేయనీకుండా గతంలో పీఏగా పెట్టుకున్నారని అందులో పేర్కొన్నారు.
- రికార్డు అసిస్టెంటుగా మల్లికార్జున జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పనిచేస్తుండగా గ్రేడ్ 2 గ్రంథాలయ అధికారి రవికుమార్ నాయుడును ఎందుకు అక్రమంగా కొనసాగిస్తున్నారు.
- జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధీనంలో 9 షాపులు నడుస్తున్నాయి. కావాల్సిన వారికి తక్కువ బాడుగలకు ఇస్తూ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒక్కో షాపు నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేశారు. షాపుల విషయం కోర్టులో ఉన్నా ఖాతరు చేయలేదు.
- శెట్టూరు గ్రేడు 3 లైబ్రేరియన్ పోస్టులో ఔట్ సోర్సింగ్ హెల్పర్ పూర్తి చార్జి ఎలా తీసుకుందో అర్థం కావడంలేదు.
- బాష అనే ఉద్యోగిపై సస్పెన్షన్ ఎత్తి వేస్తూ డైరెక్టర్ మరో చోటికి పోస్టింగు ఇచ్చినా ఆయనను అదే స్థానంలో కొనసాగిస్తున్నారు. లంచం పుచ్చుకునే ఇలా చేశారు. దీనిపై చైర్మన్‌ను ప్రశ్నించిన ఇద్దరు ఉద్యోగులలపై అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేశారు.
- 1987లో 11 మందికి రావాల్సిన అరియర్స్ డైరెక్టర్ ఆర్డర్స్ బిల్లు మంజూరు కోసం చైర్మన్, కార్యదర్శులు ఒక్కొక్కరితో రూ.30 వేలు తీసుకున్నారు.
- జిల్లాలో పలు గ్రంథాలయాలకు అక్రమ డిప్యూటేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు ఇష్టం వచ్చిన చోటుకు వేయడానికి రూ. 50 వేలు తీసుకున్నారు.
- కేంద్ర గ్రంథాలయంలో రికార్డు అసిస్టెంటు వెంకటేష్‌ను చైర్మన్ పీఏగా నియమించుకుని అతని ద్వారా డబ్బులు వసూలు చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.
పనిచేయమంటే వ్యతిరేకిస్తున్నారు
దశాబ్దాలుగా ఇతర శాఖల ఉద్యోగులతో పోలిస్తే గ్రంథాలయ ఉద్యోగులకు పనిభారం ఉండేది కాదు. 2015 తర్వాత సంస్కరణల బాట పడదామంటే వ్యతిరేకిస్తున్నారు. సభ్యత్వం కానీ, సమ్మర్ క్యాంపులు కానీ చాలా మంది ఉద్యోగులకు ఇష్టం లేదు. ఇతర శాఖల్లో ఇటువంటి వ్యతిరేకత కనపడదు. పని చేయడానికి ఇష్టపడక అవినీతి అంటూ కొత్త రాగమెత్తుకున్నారు. అలాంటిదుంటే ఏ విచారణకైనా సిద్ధమే. – గౌసుమొద్దీన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment