సాక్షి ప్రతినిధి, కాకినాడ : పింఛన్ సొమ్ము పెంచనున్నారన్న ఆశ అడియాసే అయ్యిది. ఎందరో అభాగ్యుల పరిస్థితి ‘పరమాన్నం పెడతామని ఊరించీ, ఊరించీ తింటున్న చద్ధన్నం కూడా లేకుండా చేసినట్టు’ అయ్యిది. టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు తిరిగి పాలనాపగ్గాలు చేపట్టాక అర్హత ఉన్నప్పటికీ వేలాది మంది పింఛన్‌లను నిలిపివేశారనే ఆవేదన జిల్లా అంతటా వ్యక్తమవుతోంది.
పెంచిన పింఛన్ సొమ్ము సర్దుబాటు కోసమా అన్నట్టు సర్కార్ అర్హత ఉన్న 24,984 మంది పింఛన్‌లను నిలిపివేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ సొమ్ములను పెంచారు. అంతవరకు బాగానే ఉన్నా అప్పటి వరకూ పింఛన్‌లు అందుకుంటున్న అనేకులకు కుంటిసాకులతో పింఛన్లు రద్దు చేసి వారి నోట మట్టికొట్టారు. గత అక్టోబర్ నుంచి పెంచిన పింఛన్లు అమల్లోకి రాగా అప్పటి నుంచీ రద్దు చేసిన పింఛన్‌లను వృద్ధులు, వికలాంగులు కాళ్లరిగేలా నేతలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ రకంగా జిల్లావ్యాప్తంగా పింఛన్‌ల కోసం నిరీక్షిస్తున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంది. క్షేత్రస్థాయిలో ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాలు మొదలు కలెక్టరేట్ వరకు పదేపదే విన్నవించుకుంటున్నా ఫలితం కనిపించక వారు ఉసూరుమంటున్నారు. తమ దుర్గతికి వగస్తూ, సర్కారును శాపనార్థాలు పెడుతున్నారు.
కేవలం నెలనెలా వచ్చే వెయ్యి, రూ.1500 పింఛన్‌లతోనే పొట్టనింపుకొనే వారు మొత్తం లబ్ధిదారుల్లో 40 నుంచి 50 శాతం మంది ఉన్నారని జిల్లా యంత్రాంగం వద్ద ఉన్న రికార్డులను బట్టే తెలుస్తోంది. వారిలో సగం మందికి నెలవారీ మందులకు కూడా ఈ పింఛన్‌లే ఆధారం. అటువంటి పింఛన్‌దారులను మానవతాదృక్పథంతో దయ చూడాల్సిన సర్కార్ అందుకు భిన్నంగా కేవలం ఆర్థికపరమైన అంశంగా పరిగణిస్తూ పునరుద్ధరణను దాటవేస్తోంది.
2014 నాటికి ఇవీ లబ్ధిదారుల వివరాలు
జిల్లావ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 60 మండలాల్లో 2014 నాటికి 4,65,795 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వాటిలో వృద్ధాప్య పింఛన్‌దారులు 2,07,751 మంది, వితంతువులు 1,46,715, వికలాంగులు 63,911, అభయహస్తంలో 36,551, చేనేత పింఛన్‌దారులు 8,479 మంది, కల్లు గీత పింఛనుదారులు 2,388 మంది ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లావ్యాప్తంగా (కొత్తగా చేరిన ముంపు మండలాలు కలుపుకొని) 64 మండలాల్లో 4,66,750 మంది సామాజిక భద్రతా పింఛనుదారులు ఉన్నారు. వారిలో వృద్ధాప్య పింఛనుదారులు 1,96,115 మంది, వితంతువులు 1,60,814, వికలాంగులు 62,718, అభయహస్తం లబ్ధిదారులు 35,940, చేనేత కార్మికులు 8,321, కల్లు గీత పింఛనుదారులు 2,842 మంది ఉన్నారు. 2004కు ముందు, ఆ తరువాత పింఛన్‌లు పొందుతున్న వారి లెక్కలను పరిశీలిస్తే పెరిగిన పింఛన్‌ల సంఖ్య కేవలం 955 మాత్రమే కావడం గమనార్హం.
భారం తగ్గించుకోవాలన్న ఎత్తుగడతోనే..
ఎన్నికల హామీ మేరకు పింఛను సొమ్ము పెంచే క్రమంలో పడే భారాన్ని తగ్గించుకోవాలనే ఎత్తుగడతోనే సర్కారు పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన కమిటీలతో చేయించిన సర్వేలతో ఏరివేతకు శ్రీకారం చుట్టిందనే విమర్శలున్నాయి. ఆ సర్వే పుణ్యాన జిల్లాలో 41,984 మంది పింఛనుదారులను జాలి, దయ చూడకుండా అడ్డగోలుగా జాబితా నుంచి తొలగించేశారు. అర్హులను తొలగించడంపై నిరసనలు వెల్లువెత్తడంతో మూడునెలల తరువాత పునఃపరిశీలించి 17 వేల మందిని అర్హులుగా తేల్చి వారి పింఛన్లను పునరుద్ధరించారు.
మిగిలిన 24,984 మందిలోనూ 90 శాతం మంది అర్హులున్నట్టు క్షేత్రస్థాయిలో నిగ్గు తేలింది. అయినా స్థానిక రాజకీయాల నేపథ్యంలో గ్రామ, మండల కమిటీలు అర్హులైన వారిని కూడా పక్కన పెట్టేశాయి. ఇది చాలదా అన్నట్టు చంద్రబాబు గద్దెనెక్కాక నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో 64 వేల మంది పైబడే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ క్షేత్రస్థాయిలో పరిశీలించి, మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ రెండింటినీ లెక్కలేస్తే జిల్లావ్యాప్తంగా పింఛన్‌ల కోసం నిరీక్షిస్తున్న వారి సంఖ్య 88,984 మంది పైనే. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో స్పందించి వారి మొర ఆలకించాల్సి ఉంది.
వికలాంగురాలిని.. ఎలా బతకాలి?
ఓ ప్రమాదంలో రెండు కాళ్లు చితికిపోయూరుు. వికలాంగురాలిని అన్న జాలి కూడా లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం నా పింఛను తొలగించింది. అధికారులకు గోడు చెప్పినా కనికరించలేదు. నేను ఎలా బతికేది?
- పలెవెల లక్ష్మి, డి.పోలవరం, తుని మండలం
నడవ లేకపోతున్నా.. కనికరం లేదు
పింఛన్ కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నాను. పని చేయలేక పోవడం కాదు కదా కనీసం నా కాళ్లపై నేను నడవలేక పోతున్నాను. అరుునా అధికారులు కనికరించి పింఛన్ మంజూరు చేయడం లేదు.
- కోరాడ సత్యనారాయణ, రాయవరం
ఆశాభంగం.. అసలుకే మోసం
Published Fri, May 29 2015 2:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement