తెలంగాణవి గిల్లికజ్జాలు: చంద్రబాబు ధ్వజం
-పార్టీలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది
-పార్టీలో అసంతృప్తిపెరిగితే రాజకీయంగా నష్టపోతాం
-హైదరాబాద్ మీద తెలంగాణ పెత్తనమేంటి ?
- పదేళ్ల తర్వాతే హైదరాబాదు తెలంగాణ రాజధానిఅవుతుంది
-టీడీపీ రాష్ట్ర విస్తృత సమావేశంలో చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో : హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతి మరచిపోయి తెలంగాణ ప్రభుత్వం ప్రతీదానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం ఉంటుంది. అయినా మన మంత్రులు, ఎంపీలు, అధికారులపై తెలంగాణ ప్రభుత్వం పెత్తనం ఎలా చేస్తుంది.. పదేళ్ల తరువాతే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అవుతుందనే విషయం గుర్తించాలి. అలా కాదని మన ఆత్మగౌరవం దెబ్బతీసే పరిస్థితి వస్తే ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తిలేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీఆర్‌ఎస్‌ను విమర్శల వర్షం కురిపించారు.
విజయవాడ శేషసాయి కళ్యాణమండపంలో శనివారం జరిగిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ 9, 10 పరిధిలో ఉన్న సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి మాట్లాడుకుంటే ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని చెబుతున్నా వారు వినడంలేదన్నారు. టీడీపీని దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్, వైసీపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అక్టోబర్ 22 దసరా నుంచి అమరావతి రాజధాని పనులు మొదలవుతాయని, తన క్యాంపు కార్యాలయం పూర్తికాకపోయినా ఇకపై వారంలో మూడు, నాలుగు రోజులు విజయవాడలోనే ఉంటానని, అవసరమైతే బస్సులోనే ఉండి కార్యకలాపాలు నడిపిస్తానన్నారు. త్వరలో అవసరమైన అన్ని శాఖల కార్యాలయాలను విజయవాడకు తరలిస్తానని చెప్పారు.
గోదావరి-కృష్ణా నదులను ఆగష్టు 15నాటికి అనుసంధానం చేసి తీరుతానని, దేశంలోనే నదుల అనుసంధానానికి ఏపీ నుంచే శ్రీకారం చుడతానని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఐదేళ్లు పడుతుందని ఈలోపు పట్టిసీమను కడుతుంటే అడ్డుకున్నారని అయినా వెనక్కి తగ్గలేదన్నారు. గోదావరిని పెన్నా, నాగావళికి అనుసంధానిస్తామన్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్లలేకపోయామన్నారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాలో పార్టీ కమిటీలు పూర్తికావాల్సి ఉందని, ఏపీలో 70 మండల కమిటీలు, 2,496 గ్రామ కమిటీలను నియమించాల్సి ఉందని, వాటిపై దృష్టి పెట్టాలని నాయకులు సూచించారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎలా గౌరవించాలనే దానిపై నాయకులు దృష్టి పెట్టాలన్నారు.
ఎన్ని పనులున్నా కార్యకర్తల సంక్షేమాన్ని వదలకూడదని చెప్పారు. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులిచ్చామని ఇకపై వీటిని ఇచ్చేముందు 30 ఏళ్ల నుంచి పార్టీలో ఉండి, త్యాగాలు చేసినవారు, వాళ్లలో సమర్థులను ఎంపిక చేయాలని సూచించారు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని ఆదరించాలన్నారు. బాబు అసంతృప్తి.. సమావేశం ప్రారభమైన గంటకుపైగా మీటింగ్ హాలులో కుర్చీలు ఖాళీగా ఉండటం, ఇంకా ప్రతినిధులు వస్తునే ఉండటంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆహ్వానితులు కచ్చితంగా టైమ్‌కు రాకపోతే ఎలా అని చంద్రబాబు ఉపన్యాసం ప్రారంభంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు స్థానిక నాయకులు బయటకు వెళ్లి పోలీసులు అడ్డగించిన స్థానిక పార్టీ శ్రేణులను లోపలికి తీసుకొచ్చి హాలు నిండేలా చేశారు. నేతల గైర్హాజరు సమావేశానికి కీలక నేతలు సైతం గైర్హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సుకు, శనివారం పార్టీ సమావేశానికి కూడా హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ జిల్లాలోని 36మంది ఆహ్వానితులకు సమావేశానికి హాజరుకాకపోయినా పర్వాలేదని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు మినహాయింపు ఇచ్చినట్టు సమాచారం.
మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావుతోపాటు ఇందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఈ సమావేశానికి హాజరుకాలేదు. 320 మంది ప్రతినిధులను ఆహానించగా 260మంది హాజరైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్, సీఎం తనయుడు నారా లోకేష్ సమావేశంలో పాల్గొన్నారు. తన ఉపన్యాసంలో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్టు వివరించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, పూసపాటి అశోక్‌గజపతిరాజు, పార్టీ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడారు.