ఏలూరు (మెట్రో) :క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా చౌకధరల దుకాణాల్లో పంపిణీ చేస్తున్న చంద్రన్న కానుక సరుకుల్లో నాణ్యత లోపించింది. జన్మభూమి గ్రామసభల్లో ఎంతో ఆర్భాటంగా మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు పంచుతున్న ఈ నాసిరకం సరుకులు చూసి వినియోగదారులు తెల్లబోతున్నారు. పండగసందర్భంగా సంచితో సహా ఉచితంగా సరుకులు అందిస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడానికే తప్ప అవి వినియోగించడానికి పనికిరావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కానుకగా కిలో గోధుమపిండి, అర లీటర్ పామాయిల్, వంద గ్రాముల నెయ్యి, అర కిలో బెల్లం, అర కిలో కందిపప్పు, అర కిలో పచ్చి శనగపప్పు పంపిణీ చేస్తుండగా వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.260 ఉంటుందని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే తూకంగా తక్కువగా ఇచ్చే నాసిరకం సరుకులు అంత ఖరీదు చేస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ప్రచారానికే తప్ప నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి సరుకులు పంపిణీ అవుతున్నాయని వినియోగదారులు అంటున్నారు.
జిల్లావ్యాప్తంగా పాత కార్డుదారులు 11లక్షల 25వేల మందికి, కొత్తకార్డుదారులు 98వేల 963 మందికి చంద్రన్న కానుక సంచులు పసుపు రంగుతో, ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునవ్వు ఫొటోతో జిల్లాకు చేరాయి. అయితే వాటిలో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం 23వ తేదీ నాటికి రేషన్ డీలర్లకు చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే 25వ తేదీకి కూడా ఈ కానుకలు జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు చేరలేదు. దీంతో క్రైస్తవులకు పూర్తిస్థాయిలో చంద్రన్న కానుక చేరలేదు. కొత్తకార్డులను జన్మభూమి సభల్లో పంపిణీ చేసేందుకు నిర్ణయించడంతో క్రిస్మస్‌కు క్రైస్తవులైన కొత్తకార్డుదారులకూ చంద్రన్న కానుక అందలేదు.
పంపిణీకి జన్మభూమి అడ్డంకి
ఒకటవ తేదీ నుంచి చంద్రన్న కానుకలను జిల్లాలో పంపిణీ చేయాలని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కానుకలు తీసుకునేందుకు వెళుతున్న కార్డుదారులకు జన్మభూమి సభలు అడ్డంకిగా మారుతున్నాయి. కానుక తెచ్చుకుందామని రేషన్ దుకాణాలకు వెళ్లే ప్రజలకు నిరాశ ఎదురుకావడంతో ఈసురోమంటూ వెనక్కి వస్తున్నారు. ప్రతి పంచాయతీ పరిధిలోనూ ప్రభుత్వం అందించింది అనే గొప్ప కోసం జన్మభూమి సభల్లో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో కార్డుదారులు ముందుగా రేషన్ దుకాణాలకు వెళితే డీలర్లు తిప్పి పంపేస్తున్నారు.
ఆశతో తెరిస్తే అన్నీ పుచ్చులే
జిల్లాలో పంపిణీ చేస్తున్న చంద్రన్న కానుక సరుకులు పుచ్చులతో దర్శనమిస్తున్నాయి. లింగపాలెం మండలంలోని రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసిన పచ్చిశనగపప్పు పుచ్చిపోయి ఉంది. ఎంతో ఆశతో కానుక సంచి తెరచిన వినియోగదారులు పచ్చిశనగపప్పును చూసి నిరాశ చెం దారు. ఉండి మండలంలోని రేషన్ దుకాణాల్లో పాకంగా మారిన బెల్లాన్ని పంపిణీ చేశారు. నరసాపురం మండలంలోని అన్ని రేషన్ దుకాణాల డీలర్లు బెల్లం పాకంగా మారిపోయిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
తూకంలోనూ తేడాలే
చంద్రన్న కానుకగా అర కేజీ చొప్పున ఇచ్చే కందిపప్పు, బెల్లం, పచ్చిశనగపప్పు, గోధుమపిండిలో పచ్చిశనగపప్పు పుచ్చులతో దర్శనమిస్తే, కందిపప్పు నాసిరకంగా కనిపిస్తోంది. అంతేకాకుండా కందిపప్పు తూకంలో అరకేజీ కంటే తక్కువగా ఉందని వినియోగదారులు అంటున్నారు.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న డీలర్లు
సరుకులను జన్మభూమి సభల్లోనే ఇస్తామని చెప్పడంతో డీలర్ల వద్దకు కానుకల కోసం వచ్చే ప్రజలు నిరాశతో వారిపై మండిపడుతున్నారు. ఇచ్చిన సరుకులు తూకాల్లో తేడాలు ఉండటంతో ఆ విషయంలోనూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో డీలర్లకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు.
కానుక మంచిగా ఇస్తే ఎంతో ఆనందపడేవాళ్లం
ప్రభుత్వం పండగ సందర్భంగా ఇచ్చే కానుకతో పిండివంటలు చేసుకోవచ్చు. అయితే ఇచ్చిన సరుకులు నాసిరకంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇచ్చిన సరుకుల్లో పచ్చిశనగపప్పు పుచ్చులు పట్టి వాడేందుకు పనికిరాకుండా పోయింది. సరుకులు మంచివి ఇస్తే ఎంతో ఆనందపడేవాళ్లం. ఆనందంతో కానుక తెరిస్తే నిరాశ ఎదురైంది.
- యాళ్ల లీలా ప్రసాద్, రంగాపురం, లింగపాలెం మండలం
బెల్లం బాగోలేదని రేషన్ డీలర్లు చెబుతున్నారు
నరసాపురం, ఉండి మండలాల నుంచి రేషన్ డీలర్లు బెల్లం పాకంగా మారిందని ఫిర్యాదు చేశారు. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానూ, అదే విధంగా ఒక సంచిపై మరొకటి పెట్టడం మూలంగానూ బెల్లం పాకంగా మారే అవకాశం ఉంది.
- డి.శివశంకరరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి
పుచ్చిన పప్పులు.. పాకం కారే బెల్లం
Published Thu, Jan 7 2016 12:26 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
Advertisement