కత్తులు, రాడ్లతో దాడులు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు!
బాపట్లటౌన్: టీడీపీలో ఎప్పటి నుంచో రగులుతున్న విభేదాలు పాండురంగాపురంలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తెలుగుతమ్ముళ్ళు రెండు వర్గాలుగా చీలి కత్తులు, రాడ్ల దాడులకు దిగారు. పంచాయతీ సర్పంచ్, మండల ఉపాధ్యక్షుల మధ్య గ్రామంలో ఆదివారం వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది.
వివాదం చెలరేగిందిలా..
గ్రామంలో పదేళ్ళుగా సుబ్బారెడ్డి, నక్కా వీరారెడ్డి వర్గాల మధ్య అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుబ్బారెడ్డి వర్గానికి చెందిన మున్నం అమ్మిరెడ్డి పొలాల్లో నుంచి గ్రామంలోకి వస్తుండగా అదే సమయంలో వీరారెడ్డి వర్గానికి చెందిన పుట్టా అంకమ్మ తన ఇంటిముందు సామాన్లు కడుగుతోంది. ఇంటిముందు ఉన్న తడికను ట్రాక్టర్ డ్రైవర్ గుద్దించడంతో ఇరువురు వాగాదానికి దిగారు.
గమనించిన స్థానికులు ఇరువురికి సర్దిచెప్పి పంపించారు. కాసేపటికి సుబ్బారెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో వీరారెడ్డి వర్గీయులు ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాలు కత్తులు, రాడ్డులు, రాళ్ళతో దాడులకు దిగాయి.
గాయాలపాలైంది వీరే ...
ఘటనలో వీరారెడ్డి వర్గానికి చెందిన కుక్కల శ్రీనివాసరెడ్డి, నక్కా నాగేంద్రరెడ్డి, కుక్కల బాలకృష్ణ, పుట్టా సంజీవరెడ్డి, రాజు లక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరమ్మ, కుక్కల స్వాములు, కుక్కల వీరారెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. సుబ్బారెడ్డి వర్గానికి చెందిన గుమ్మడి పోలేరమ్మ, కుక్కల పోలేరమ్మ, కుక్కల పద్మ, మున్నం అంకమ్మ, గుమ్మడి శ్రీనివాసరెడ్డి, కుక్కల శ్రీనివాసరెడ్డి, కుక్కల నాగేశ్వరమ్మ, కుక్కల పెద పోలేరమ్మ గాయాలపాలయ్యారు. వీరంతా ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. తాలుకా ఎస్‌ఐ చెన్నకేశవులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.