సాక్షి, కడప: మట్కా... రూపాయికి తొంభై రూపాయలు వస్తుందని ఆశ చూపుతూ జనాన్ని మట్కా ఉచ్చులోకి లాగుతున్నారు బీటర్లు. కొన్నేళ్లుగా మట్కా రాస్తున్న వారు తాజాగా సర్దుకోగా... కొత్త వారిని తెరమీదికి తెచ్చి అండగా మేమున్నామంటూ కొంతమంది తెలుగు తమ్ముళ్లు లోలోపల సహకారం అందిస్తుండంతో మట్కా మళ్లీ జోరందుకుంది. కొంతమంది బీటర్లు స్థానికంగానే చీటీలను నిలుపుతూ.... ఎవరికైనా మట్కా నెంబరు తగిలినా ఇస్తాంలే.. చేస్తాంలే... అని రాజకీయ పలుకబడితో బెదిరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
పైగా అనంతపురం జిల్లాలోని కదిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల మట్కా నిర్వాహకుల సహకారంతో స్థానికంగా ఉన్న బీటర్లు మట్కా విస్తరిస్తున్నారు. ఇదేమని అడిగే పోలీసు అధికారులు లేకపోవడంతో వారికి ఎదురులేకుండా పోరుుంది. ఒకవేళ పట్టుబడినా చిన్నా చితకా కేసులతో బయటపడుతున్నారు. చాలాకాలంగా సాగుతున్న మట్కా విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహారిస్తే ఒక్కస్లిప్పు కూడా బీటర్లు రాయలేరనేది అక్షరసత్యం. అయితే అండగా కొంతమంది ఉన్నారన్న దైర్యమో.... లేక ఇంకేమో తెలియదుగానీ మట్కా మహమ్మారి మాత్రం కోరలు చాస్తూనే ఉంది.
పులివెందులలో పెట్రేగుతున్న మట్కా
జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన వాటిలో పులివెందుల ఒకటి. ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం పులివెందులకు వచ్చి నివాసాలు ఏర్పరుచుకుని మట్కాలో పాలుపంచుకుంటున్నారన్న ప్రచారం జోరందుకుంది. సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నా పోలీసులు కిమ్మనకుండా ఉండడంపై కూడా చర్చకు దారి తీస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్యకాలంలో పులివెందులలో మట్కా జోరందుకుంది.
ప్రధానంగా మారుతి థియేటర్, బేతల్‌చర్చి సమీప ప్రాంతాల్లో కొంతమంది గ్యాంగులుగా ఏర్పడి మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొంతమంది తెలుగు తమ్ముళ్లు మేమున్నామని.. మీకేం కాదని భరోసా ఇవ్వడం వల్లే ఇంతా బాహాటంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నారుు. గతంలో మట్కా స్లిప్పులను కదిరిలో పేరుమోసిన కొన్ని కంపెనీల ప్రతినిధులకు పంపించేవారు. ఈ మధ్య కాలంలో స్లిప్పులను సైతం ఇక్కడే నిలుపుకుని మట్కా కంపెనీల తరహాలో లావాదేవీలు నడుపుతున్నట్లు తెలుస్తోంది.
మారుతిథియేటర్ ప్రాంతంలో కొంతమంది స్థానికేతర విద్యార్థులు కూడా గదులు అద్దెకు తీసుకుని మట్కా స్లిప్పులు రాస్తున్నట్లు సమాచారం. పులివెందులలో రెండు నెలల క్రితం తమ్ముళ్ల మధ్య మట్కా మామూళ్ల వ్యవహారం చిచ్చు రేపగా పోలీసుస్టేషన్ ఆవరణంలో ఓ అధికారి రాజీ కుదిర్చారని చర్చ ఉంది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగులలో కూడా మట్కా విస్తరిస్తోంది. జమ్మలమడుగు సమీపంలోనే మట్కాకు అడ్డా అరుున తాడిపత్రి ఉండడంతో వ్యాపారం జోరందుకుంది.
కొత్త సీఐలుగా సవాలుగా మారిన మట్కా
పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప తదితర ప్రధాన పట్టణాల్లో మట్కాను అడ్డుకోవడం కొత్త సీఐలకు సవాలుగా మారింది. పాత పోలీసు అధికారులు చూసీచూడనట్లు వెళ్లారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపధ్యంతోపాటు ప్రస్తుతం వేళ్లూనుకుంటున్న మట్కాను నిరోధించడం బాధ్యతలు తీసుకున్న సీఐలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
ప్రస్తుత ఎస్పీ ఉక్కుపాదం మోపుతున్నా!
జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నా పోలీసుశాఖలోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా యధేచ్చగా సాగుతోంది. జూదం నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పడిన ప్రైవేటు క్లబ్బులు కూడా ప్రస్తుత ఎస్పీ కఠినంగా వ్యవహారించడంతో మూతపడ్డాయి. అయితే కొంతమంది తమ్ముళ్ల అండ చూసుకుని పులివెందుల ప్రాంతంలో ఎస్పీ సెలవుపై వెళ్లినపుడు మట్కా దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి.
‘పచ్చ’గా మట్కా
Published Fri, Dec 12 2014 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement