చెక్ డ్యాం కాంట్రాక్టుల కోసం టీడీపీ నేతల పాట్లు
ఏడు బేసిన్‌లలో రూ.116 కోట్లతో పనులు
దగ్గరుండి అంచనాలు సిద్ధం చేయించిన వైనం
పరిశీలించేందుకు క మిటీ వేసిన కలెక్టర్
అనుమతుల మంజూరుకు సన్నాహాలు
నీరు- చెట్టు పేరుతో ప్రభుత్వ ధనాన్ని అందిన కాడికి దోచేసిన అధికారపార్టీ నాయకులు ప్రస్తుతం చెక్‌డ్యాంలపై దృష్టిసారించారు. నీటి పారుదల శాఖ ప్రతిపాదించిన కాంట్రాక్టు పనులను ఎలాగైనా దక్కించుకునేందుకు సామ, దాన, బేధ, దండోపాయాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పరిశీలనకు వచ్చే అధికారులకు సకల మర్యాదలు చేస్తూ.. కమీషన్ల ఆశ చూపుతూ, అవసరమైతే బెదిరిస్తూ అంచనాల స్థాయిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తమ్మీద డ్యాం.. స్కాంకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
తిరుపతి: నీటి పారుదల శాఖలో కాంట్రాక్టు పనుల కోసం తెలుగు తమ్ముళ్లు పాకులాట మొదలుపెట్టారు. నీరు-చెట్టు పనులతో భారీగా లాభాలు రుచి మరిగిన చోటామోటా నాయకులు సైతం ఎలాగోలా పనులు దక్కించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మరమ్మతు పనుల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నుంచి నీటిపారుదల శాఖకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విషయాన్ని పసిగట్టిన అధికారపార్టీ నేతలు అంచనాలను భారీగా పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని స్థానిక ఇంజనీర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని పాలారు, చెయ్యేరు, పాపాఘ్ని, అరణియార్, స్వర్ణముఖి, కాళంగి, కుషావతి బేసిన్‌లో మరమ్మతులు చేయాల్సిన చెక్ డ్యాంలు 200లకు పైగా ఉన్నాయి. వీటిలో రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేసి మరమ్మతులు చేయాల్సిన చెక్‌డ్యామ్‌లు 64 ఉన్నాయి. వాటి అంచనా విలువ రూ.22.01 కోట్లు. రూ.10 లక్షల లోపు ఖర్చు చేయాల్సినవి 131 ఉన్నాయి. వాటి అంచనా విలువ రూ.10.52 కోట్లు. మొత్తం రూ.32.54 కోట్ల తో అంచనాలు రూపొందించారు. ఇదే బేసిన్‌లలో కొత్త చెక్ డ్యామ్‌లకోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సిన 167 ఉన్నాయి. వాటి అంచనా రూ 49.55 కోట్లు, రూ.10 లక్షలకన్నా తక్కువ ఖర్చు చేయాల్సినవి 388 ఉన్నాయి వాటి విలువ రూ. 33.78 కోట్లుగా అంచనా వేశారు. అంటే చెక్‌డ్యాముల కోసం దాదాపు రూ.116 కోట్లతో అంచనాలు రూపొందించారు.
పనుల పరిశీలనకు కమిటీ
ఇంజనీర్లు, ఎన్‌జీవోలు, డ్వామాలోని ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌లతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా కమిటీ వేసి పరిశీలించాలని సూచించారు. వారంలోపు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. పనుల అంచనాలను పెంచడం, అవసరం లేకున్నా చెక్ డ్యామ్‌ల ఏర్పాటు చేశారా? అనే దానిపై ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలి. ఈ నివేదిక ఆధారంగా పనులను ఖరారు చేయనున్నారు.
చెక్ డ్యాం పనులకు పాకులాట
Published Thu, Mar 17 2016 1:43 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement