విడుదల చేయాలంటూ ఆత్మహత్యాయత్నం
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని బాలనేరస్తుల వసతిగృహంలో కొందరు బాలలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమను తొందరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గాజు పెంకులతో చేతులు కోసుకున్నారు. సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు... తిరుపతిలోని మంగళంలో ఆర్టీవో కార్యాలయం వెనుక ప్రభుత్వ బాలనేరస్తుల వసతి గృహం ఉంది. ఇక్కడ చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన బాలనేరస్తులు ఉన్నారు. సోమవారం రాత్రి వసతి గృహానికి న్యాయస్థానం బెంచ్‌క్లర్క్ వచ్చారు. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తున్న బాలనేరస్తులు తమను త్వరగా విడుదల చేయాలని ఆయనను కోరారు.
బాలనేరస్తులపై కేసులు ఎక్కువగా ఉన్నందున త్వరగా విచారించి పంపలేమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోవడం లేదని, మరింత విశాలమైన స్థలం కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు గొడవకు దిగారు. అది కాస్తా హింసాత్మక రూపం దాల్చింది. అక్కడ ఉన్న ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలను విరగ్గొట్టి భోజనాలను కిందికి నెట్టేశారు. తమను తొందరగా విడుదల చేయాలని కొందరు బాలురు గాజుపెంకులతో చేతులు కోసుకున్నారు. పరిశీలన అధికారులు బాలనేరస్తులతో చర్చలు జరపడంతో గొడవ సద్దుమణిగింది. వెంటనే సిబ్బంది 108 సహాయంతో గాయపడిన బాలురను చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.