చిత్తూరు షుగర్స్ ఎండీ రాజీనామా
చిత్తూరు: చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం ఎండీ మల్లికార్జునరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని డెరెక్టర్ ఆఫ్ షుగర్స్, హైదరాబాద్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. కార్మికుల పండుగ అడ్వాన్స్ ఇచ్చే విషయంలో చైర్మన్ ఎన్‌పీ.రామకృష్ణ, ఎండీ మధ్య సోమవారం చోటుచేసుకున్న గొడవే రాజీనామాకు దారితీసినట్లు తెలుస్తోంది. ఏడాదిగా ఫ్యాక్టరీలో కేన్ ఇన్‌చార్జిగా ఉన్న మల్లికార్జునరెడ్డి మూడు నెలల క్రితం ఎండీగా బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం పరిధిలో మూడేళ్లుగా రైతులకు సంబంధించి *12 కోట్ల బకాయిలు, కార్మికులకు సంబంధించి *8 కోట్లు మొత్తం *20 కోట్లు చెల్లించాల్సి ఉంది.
రెండు నెలల క్రితం పాలకవర్గం కర్మాగారంలోని స్టోర్స్ తాకట్టుపెట్టి ఆప్కాబ్ ద్వారా *కోటి రుణం తీసుకుంది. ఈ మొత్తం నుంచి కార్మికులకు ఒక నెల జీతం మాత్రమే ఇచ్చారు. మరో *14 లక్షలు చైర్మన్, ఎండీ ఉమ్మడి ఖాతాలో ఉన్నట్లు సమాచారం. సంక్రాంతికి పండుగకు అడ్వాన్ ఇస్తామని చైర్మన్, ఎండీ కార్మికులకు హామీ ఇచ్చారు. కా ర్మికులు సోమవారం ఉదయం పండుగ అడ్వాన్స్ విషయం ఎండీ వద్ద ప్రస్తావించారు. దాంతో ఎండీ, సీసీ కుమారస్వామి నాయుడు, సీఈ మధుసూదన్‌రెడ్డి కలసి చైర్మన్ వద్దకెళ్లారు. కార్మికుల పండుగ అడ్వాన్స్ విషయం మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్యుద్ధంగా మారినట్లు సమాచారం. కార్మికులకు పైసా ఇచ్చేదిలేదంటూ చైర్మన్ చిందులు తొక్కినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురైన ఎండీ బయటకు వచ్చి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని ఫ్యాక్టరీ వద్ద ఉన్న కార్మికులకు చెప్పారు. ఇక తాను పదవిలో కొనసాగేది లేదంటూ వెళ్లిపోయారు.
రైతులు, కార్మికులకు న్యాయం చేయలేక పోయినందుకే రాజీనామా
ఫ్యాక్టరీ కార్మికులకు, రైతులకు న్యాయం చే యలేకపోయినందుననే ఎండీ పదవికి రాజీ నామా చేసినట్లు చిత్తూరు చక్కెర కర్మాగారం ఎండీ మల్లికార్జునరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇన్నాళ్లు న్యాయం చేసేందుకు ప్రయత్నించానన్నారు. అయినా తనవల్ల కాలేదన్నారు. వారికి న్యాయం చేసే స్టేజీలో లేనందునే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. తనకు కార్మికులు, రైతులవల్ల ఎటువంటి ఇబ్బందు లు లేవన్నారు. ఫ్యాక్టరీని నడపాలని ఎంత ప్రయత్నించినా వీలుకాలేదని చెప్పారు.