
చిచ్చురేపిన సరిహద్దు వివాదం
కర్నూలు రూరల్:
ఇసుక అక్రమ తరలింపు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య వివాదం రేపింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి తుంగభద్ర నది సరిహద్దు ప్రాంతంలోని కర్నూలు, పాలమూరు జిల్లాల ప్రజల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకునేవి. అయితే ఇరు జిల్లాల అధికారులు సమస్య పరిష్కారం కోసం తాత్కాలికంగా కొలతలు వేసి కొన్ని చోట్ల గుర్తులు ఏర్పాటు చేశారు. వర్షపు నీటికి, అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఆ గుర్తులు చెదిరిపోయాయి. రాష్ట్ర విభజన సమయంలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. శనివారం తుంగభద్ర నది సరిహద్దుపై నదికి ఆవలవైపు, ఇవల వైపు ఉన్న గ్రామాల ప్రజల మధ్య మరోసారి వివాదం రేగింది. ఉదయం మునగాలపాడు గ్రామానికి చెందిన అబ్దుల్ గఫూర్, మాదన్న, చంటి, లక్ష్మన్న బహిర్బూమి కోసం నదివైపు వెళ్లారు. నదికి ఆవల వైపు ఉన్న మహబూబ్ నగర్ జిల్లా పుల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు ట్రాక్టర్‌లో మునగాల గ్రామ సమీపానికి వచ్చారు. దీంతో మాదన్న అనే వ్యక్తి మా గ్రామ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని అడ్డు చెప్పే ప్రయత్నం చేయగా పుల్లూరు గ్రామానికి హమాలీలు కొందరు, ట్రాక్టర్ డ్రైవర్ మునగాలపాడు వాసులపై పారలతో దాడికి పాల్పడ్డారు. త్రుటిలో వారి నుంచి తప్పించుకున్న బాధితులు గ్రామానికి చేరుకొని విషయం చెప్పడంతో మునగాలపాడు వాసులు కూడా ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరు ప్రాంతాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు కొందరు కర్నూలు తాలుకా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు.