the Tungabhadra river
-
ఇసుకాసురుల ఆటలు సాగనివ్వం
కర్నూలు(రూరల్): జిల్లాలో తుంగభద్ర నది నుంచి అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారని, ఇకపై వారి ఆటలు సాగనివ్వబోమని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నిడ్జూరులో ఆ గ్రామ డ్వాక్రా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇసుక అమ్మకాల రీచ్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎం.రాజశేఖర్, కలెక్టర్ విజయమోహన్, జేసీ కె.కన్నబాబు, ఎస్పీ రవికృష్ణలు పాల్గొన్నారు. రీచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్లలో ఇసుక రవాణా అలజడులు సృష్టిస్తోందన్నారు. అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి పోవడంతో, ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి డ్వాక్రా మహిళలను ఆదుకునేందుకు.. వారి కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఇసుక రీచ్‌లను డ్వాక్రా గ్రూపులకు కేటాయించారన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం పనిచేస్తుందన్నారు. జిల్లాలో నిడ్జూరు, బావాపురం, జి.శింగవరం, ఎదురూరు, దేవమాడ, పడిదెంపాడు, మంత్రాలయం రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. వారం రోజుల్లో ఇసుకను ట్రాన్స్‌పోర్టు చేసేందుకు అవసరమైన వాహనాల కోసం టెండర్లు పిలిచి ఖరారు చేస్తామన్నారు. కేసీఆర్ అసమర్థ పాలన వల్లే 5 నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. నవ్యాంధ్ర కోసం చంద్రబాబు నాయుడు చేపడుతున్న ప్రాజెక్టులను ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆంధ్రకు అన్యాయం చేసిన తెలంగాణకు ఇసుక తరలించొద్దన్నారు. ఆగస్టు 15న జిల్లాకు వచ్చిన సీఎం జిల్లా అభివృద్ధికి 28 పథకాలను ప్రకటించారని, వీటి అమలుకు కలెక్టర్ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, నగరానికి 5 కి.మీ దూరంలోనే 5 వేల ఎకరాలు పరిశ్రమల స్థాపనకు భూములు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించేందుకు తైవాన్ దేశం ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారన్నారు. అనంతరం కలెక్టర్, జేసీలు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు కేటాయిస్తుందన్నారు. వారం రోజుల్లో పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేసి వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చి అక్రమ రవాణాపై నిఘా పెడతామన్నారు. ప్రస్తుతం క్యూబిక్ మీటర్ ఇసుక రూ.500 కాగా, భవిష్యత్‌లో ఇంకా చౌక ధరకే ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్, డీపీఓ శోభస్వరూప రాణి, నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ నాగేశ్వరరావు, మైనింగ్ ఏడీ నరసింహ ఆచారి, జెడ్పీ సీఈఓ జయరామిరెడ్డి, ఈఓఆర్డీ దేవగ్లోరి, మాజీ మంత్రి కె.ఇ.ప్రభాకర్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సర్పంచ్ లావణ్య, జెడ్పీటీసీ సభ్యురాలు ఎం.కె.మాధవి, ఆర్డీఓ రఘుబాబు, తహశీల్దార్ శేషఫణి తదితరులు పాల్గొన్నారు. -
‘బోర్డే’.. భరోసా'
గద్వాల: తుంగభద్ర నదిపై నిర్మించిన రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ద్వారా నీటి వాడకంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమైంది. అడుగడుగునా నిర్లక్ష్యానికి గురై న ఈ ప్రాజెక్టును కృష్ణాబోర్డు పరిధిలోకి చేర్చి.. న్యాయమైన నీటి వాటాను వాడుకునే అవకాశం కల్పించాలని కేంద్ర జలవనరుల సంఘాన్ని కోరింది. దీనిపై ప్రభుత్వ స్పందనతో ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నా యి. వాస్తవంగా ఆర్డీఎస్ నుంచి జిల్లా రైతాంగం 15.8 టీఎం సీల నీటిని వాడుకోవాల్సి ఉంది. తద్వారా 80వేల ఎకరాలకు పైగా సాగు కావాల్సి ఉంది. స్లూయీస్ రంధ్రాలు ద్వారా అక్రమమార్గాల్లో అవతలివైపు రైతులు నీటిని తరలించుకుపోవడంతో ప్రస్తుతం 30వేల ఎకరాలకు కూడా నీరందని పరిస్థితి. ఈ క్రమంలో 1992లో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో ఉన్న కర్ర షట్టర్లను అవతలివైపు నాయకులు బాంబులతో దాడులు చేసి పగులగొట్టారు. ఇదేఅదనుగా భావించిన అవతలివైపు రైతులు ఆర్డీఎస్ స్లూయీస్ రంధ్రాలను మూసివేయించేందుకు ప్రయత్నించిన ప్రతిసారి దాడులు చేస్తున్నారు. 2002లో అప్పటి ప్రభుత్వం ఈ రంధ్రాలకు షట్టర్లను బిగించే పనులు చేపడితే అడ్డుకుని..ఆర్డీఎస్ రైతులతో పాటు ప్రజాప్రతినిధులపై సైతం దాడులు చేశారు. 2004లో ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి అప్పటి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. వారి నివేదిక మేరకు ఆధునికీకరణకు రూ.92కోట్లు 2007లో కేటాయించారు. ఈ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఈ పనుల్లో భాగంగా ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో స్పిల్‌వే పనులు చేసేందుకు జూన్‌లో ప్రయత్నించగా అవతలిరైతులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వం ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోయాయి. కృష్ణాబోర్డులో చేర్చితే ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేంద్రం జల వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా, గోదావరి నది బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ బోర్డుల్లో ఆయా నదుల పరిధిలోని ప్రాజెక్టులను చేర్చాల్సి ఉంది. ఇందులో కృష్ణాబోర్డులో కృష్ణానదికి ఉపనదిగా ఉన్న తుంగభద్ర నదిపై నిర్మితమైన ఆర్డీఎస్, కేసీ కాల్వలను చేర్చడం ద్వారా నీటివాటాపై ప్రశ్నించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్డీఎస్ రైతులకు హక్కుంటుంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు దశాబ్ధాలుగా మూడు టీఎంసీలకు మించి నీళ్లందకపోయినా పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటామని చెబుతూనే పట్టించుకోలేదు. ఆర్డీఎస్ ఏర్పడిన నాటినుంచి జిల్లా అధికారులకు నీటి విడుదలపై ఎలాంటి అధికారాలూ లేవు. తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకుని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నందున మన అధికారులు ప్రతిసారీ నీటి విడుదలకు కర్నూలు ఎస్ఈకి లేఖ రాసేవారు. ఎస్ఈ ఇండెంట్‌ను బోర్డుకు పంపితే అక్కడ అనుమతిస్తేనే నీళ్లు వచ్చేవి. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు విడిపోవడంతో ఆర్డీఎస్, కేసీ కాల్వలను కృష్ణా బోర్డులోకి చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇది జరిగితే ఇక్కడి నుంచి ఆర్డీఎస్ విడుదల, వాటా కేటాయింపులను మన రాష్ట్ర ప్రతినిధులు బోర్డులో ప్రస్తావించి అనుమతి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్డీఎస్ హెడ్వర్క్స్లోనూ మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు బోర్డులో అనుమతి లభిస్తే కర్నూలు జిల్లా రైతులు అడ్డుకోలేరు. కాగా, బోర్డులో తీసుకునే నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇలా కర్నూలు జిల్లా యంత్రాంగం ఆర్డీఎస్‌పై బోర్డులో జరిగే ప్రతి నిర్ణయానికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కేసీ కెనాల్‌కు అదనపు కేటాయింపులు లేకుండా బోర్డులో ప్రస్తావించవచ్చు. -
చిచ్చురేపిన సరిహద్దు వివాదం
కర్నూలు రూరల్: ఇసుక అక్రమ తరలింపు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య వివాదం రేపింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి తుంగభద్ర నది సరిహద్దు ప్రాంతంలోని కర్నూలు, పాలమూరు జిల్లాల ప్రజల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకునేవి. అయితే ఇరు జిల్లాల అధికారులు సమస్య పరిష్కారం కోసం తాత్కాలికంగా కొలతలు వేసి కొన్ని చోట్ల గుర్తులు ఏర్పాటు చేశారు. వర్షపు నీటికి, అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఆ గుర్తులు చెదిరిపోయాయి. రాష్ట్ర విభజన సమయంలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. శనివారం తుంగభద్ర నది సరిహద్దుపై నదికి ఆవలవైపు, ఇవల వైపు ఉన్న గ్రామాల ప్రజల మధ్య మరోసారి వివాదం రేగింది. ఉదయం మునగాలపాడు గ్రామానికి చెందిన అబ్దుల్ గఫూర్, మాదన్న, చంటి, లక్ష్మన్న బహిర్బూమి కోసం నదివైపు వెళ్లారు. నదికి ఆవల వైపు ఉన్న మహబూబ్ నగర్ జిల్లా పుల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు ట్రాక్టర్లో మునగాల గ్రామ సమీపానికి వచ్చారు. దీంతో మాదన్న అనే వ్యక్తి మా గ్రామ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని అడ్డు చెప్పే ప్రయత్నం చేయగా పుల్లూరు గ్రామానికి హమాలీలు కొందరు, ట్రాక్టర్ డ్రైవర్ మునగాలపాడు వాసులపై పారలతో దాడికి పాల్పడ్డారు. త్రుటిలో వారి నుంచి తప్పించుకున్న బాధితులు గ్రామానికి చేరుకొని విషయం చెప్పడంతో మునగాలపాడు వాసులు కూడా ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరు ప్రాంతాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు కొందరు కర్నూలు తాలుకా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు.