‘బోర్డే’.. భరోసా' | Bore' .. ensuring | Sakshi
Sakshi News home page

‘బోర్డే’.. భరోసా'

Published Wed, Oct 15 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

Bore' .. ensuring

గద్వాల:
 తుంగభద్ర నదిపై నిర్మించిన రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ద్వారా నీటి వాడకంలో ఎన్నో     ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమైంది. అడుగడుగునా నిర్లక్ష్యానికి గురై న ఈ ప్రాజెక్టును కృష్ణాబోర్డు పరిధిలోకి చేర్చి.. న్యాయమైన నీటి వాటాను వాడుకునే అవకాశం కల్పించాలని కేంద్ర జలవనరుల సంఘాన్ని కోరింది. దీనిపై ప్రభుత్వ స్పందనతో ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నా యి. వాస్తవంగా ఆర్డీఎస్ నుంచి జిల్లా రైతాంగం 15.8 టీఎం సీల నీటిని వాడుకోవాల్సి ఉంది.

తద్వారా 80వేల ఎకరాలకు పైగా సాగు కావాల్సి ఉంది. స్లూయీస్ రంధ్రాలు ద్వారా అక్రమమార్గాల్లో అవతలివైపు రైతులు నీటిని తరలించుకుపోవడంతో ప్రస్తుతం 30వేల ఎకరాలకు కూడా నీరందని పరిస్థితి. ఈ క్రమంలో 1992లో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో ఉన్న కర్ర షట్టర్లను అవతలివైపు నాయకులు బాంబులతో దాడులు చేసి పగులగొట్టారు.  ఇదేఅదనుగా భావించిన అవతలివైపు రైతులు ఆర్డీఎస్ స్లూయీస్ రంధ్రాలను మూసివేయించేందుకు ప్రయత్నించిన ప్రతిసారి దాడులు చేస్తున్నారు.

2002లో అప్పటి ప్రభుత్వం ఈ రంధ్రాలకు షట్టర్లను బిగించే పనులు చేపడితే అడ్డుకుని..ఆర్డీఎస్ రైతులతో పాటు ప్రజాప్రతినిధులపై సైతం దాడులు చేశారు. 2004లో ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి అప్పటి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. వారి నివేదిక మేరకు ఆధునికీకరణకు రూ.92కోట్లు 2007లో కేటాయించారు. ఈ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఈ పనుల్లో భాగంగా ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో స్పిల్‌వే పనులు చేసేందుకు జూన్‌లో ప్రయత్నించగా అవతలిరైతులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వం ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోయాయి.

 కృష్ణాబోర్డులో చేర్చితే ప్రయోజనాలు
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేంద్రం జల వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా, గోదావరి నది బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ బోర్డుల్లో ఆయా నదుల పరిధిలోని ప్రాజెక్టులను చేర్చాల్సి ఉంది. ఇందులో కృష్ణాబోర్డులో కృష్ణానదికి ఉపనదిగా ఉన్న తుంగభద్ర నదిపై నిర్మితమైన ఆర్డీఎస్, కేసీ కాల్వలను చేర్చడం ద్వారా నీటివాటాపై ప్రశ్నించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్డీఎస్ రైతులకు హక్కుంటుంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు దశాబ్ధాలుగా మూడు టీఎంసీలకు మించి నీళ్లందకపోయినా పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటామని చెబుతూనే పట్టించుకోలేదు.

  ఆర్డీఎస్ ఏర్పడిన నాటినుంచి జిల్లా అధికారులకు నీటి విడుదలపై ఎలాంటి అధికారాలూ లేవు. తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకుని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నందున మన అధికారులు ప్రతిసారీ నీటి విడుదలకు కర్నూలు ఎస్‌ఈకి లేఖ రాసేవారు.

ఎస్‌ఈ ఇండెంట్‌ను బోర్డుకు పంపితే అక్కడ అనుమతిస్తేనే నీళ్లు వచ్చేవి. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు విడిపోవడంతో ఆర్డీఎస్, కేసీ కాల్వలను కృష్ణా బోర్డులోకి చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇది జరిగితే ఇక్కడి నుంచి ఆర్డీఎస్ విడుదల, వాటా కేటాయింపులను మన రాష్ట్ర ప్రతినిధులు బోర్డులో ప్రస్తావించి అనుమతి తీసుకునే అవకాశం ఉంటుంది.
 
ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లోనూ మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు బోర్డులో అనుమతి లభిస్తే కర్నూలు జిల్లా రైతులు అడ్డుకోలేరు. కాగా, బోర్డులో తీసుకునే నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇలా కర్నూలు జిల్లా యంత్రాంగం ఆర్డీఎస్‌పై బోర్డులో జరిగే ప్రతి నిర్ణయానికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కేసీ కెనాల్‌కు అదనపు కేటాయింపులు లేకుండా బోర్డులో ప్రస్తావించవచ్చు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement