
ఇసుకాసురుల ఆటలు సాగనివ్వం
కర్నూలు(రూరల్):
జిల్లాలో తుంగభద్ర నది నుంచి అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారని, ఇకపై వారి ఆటలు సాగనివ్వబోమని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నిడ్జూరులో ఆ గ్రామ డ్వాక్రా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇసుక అమ్మకాల రీచ్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎం.రాజశేఖర్, కలెక్టర్ విజయమోహన్, జేసీ కె.కన్నబాబు, ఎస్పీ రవికృష్ణలు పాల్గొన్నారు. రీచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్‌లలో ఇసుక రవాణా అలజడులు సృష్టిస్తోందన్నారు. అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు.
ఈ విషయం సీఎం దృష్టికి పోవడంతో, ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి డ్వాక్రా మహిళలను ఆదుకునేందుకు.. వారి కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఇసుక రీచ్‌లను డ్వాక్రా గ్రూపులకు కేటాయించారన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం పనిచేస్తుందన్నారు.
జిల్లాలో నిడ్జూరు, బావాపురం, జి.శింగవరం, ఎదురూరు, దేవమాడ, పడిదెంపాడు, మంత్రాలయం రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. వారం రోజుల్లో ఇసుకను ట్రాన్స్‌పోర్టు చేసేందుకు అవసరమైన వాహనాల కోసం టెండర్లు పిలిచి ఖరారు చేస్తామన్నారు. కేసీఆర్ అసమర్థ పాలన వల్లే 5 నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
నవ్యాంధ్ర కోసం చంద్రబాబు నాయుడు చేపడుతున్న ప్రాజెక్టులను ఓర్వలేక టీఆర్‌ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆంధ్రకు అన్యాయం చేసిన తెలంగాణకు ఇసుక తరలించొద్దన్నారు. ఆగస్టు 15న జిల్లాకు వచ్చిన సీఎం జిల్లా అభివృద్ధికి 28 పథకాలను ప్రకటించారని, వీటి అమలుకు కలెక్టర్ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, నగరానికి 5 కి.మీ దూరంలోనే 5 వేల ఎకరాలు పరిశ్రమల స్థాపనకు భూములు సిద్ధంగా ఉన్నాయన్నారు.
జిల్లాలో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించేందుకు తైవాన్ దేశం ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారన్నారు. అనంతరం కలెక్టర్, జేసీలు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు కేటాయిస్తుందన్నారు. వారం రోజుల్లో పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేసి వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చి అక్రమ రవాణాపై నిఘా పెడతామన్నారు.
ప్రస్తుతం క్యూబిక్ మీటర్ ఇసుక రూ.500 కాగా, భవిష్యత్‌లో ఇంకా చౌక ధరకే ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నజీర్ సాహెబ్, డీపీఓ శోభస్వరూప రాణి, నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ నాగేశ్వరరావు, మైనింగ్ ఏడీ నరసింహ ఆచారి, జెడ్పీ సీఈఓ జయరామిరెడ్డి, ఈఓఆర్‌డీ దేవగ్లోరి, మాజీ మంత్రి కె.ఇ.ప్రభాకర్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సర్పంచ్ లావణ్య, జెడ్పీటీసీ సభ్యురాలు ఎం.కె.మాధవి, ఆర్డీఓ రఘుబాబు, తహశీల్దార్ శేషఫణి తదితరులు పాల్గొన్నారు.