బిల్లుల కోసం ప్రదక్షిణ | circumambulation for bills | Sakshi
Sakshi News home page

బిల్లుల కోసం ప్రదక్షిణ

Published Mon, Dec 23 2013 3:44 AM | Last Updated on Fri, Oct 5 2018 6:30 PM

circumambulation for bills

జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ :  ఎన్నుకున్న ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన వారిని కష్టాలపాలు చేసింది. నాయకులు, అధికారుల మాటలు నమ్మి బావులు తవ్వి వేసవిలో ప్రజల దాహార్తి తీర్చినందుకు సంతోషపడాలో.. వాటికి సం బంధించిన బిల్లుల కోసం మూడేన్నరేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి వారికి ఎదురవుతోంది. వివరాలిలా ఉన్నాయి. 2009-10 వేసవిలో నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమంలో అడిగిందే తడవుగా ఎడాపెడా అభివృద్ధి పనులకు అర్‌డబ్ల్యూఎస్ అధికారులు మంజూరు ఇచ్చేశారు.

ఇందులో భాగంగా నీటి ఎద్దడి నివారణ కోసం ఏఎస్‌సీ(అడ్వర్స్ సీజనల్ కండిషన్స్) గ్రాంట్ కింద ప్రభుత్వం జిల్లాకు * 5.30 కోట్లు మంజూరు చేయగా, హసన్‌పర్తి మండలానికి చెందిన సర్పంచ్‌లు బావులు తవ్వేందుకు అనుమతి, నిధులు మంజూరు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కోరారు. ఈ మేరకు బావులు తవ్వేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలపగా, సర్పంచ్‌లు బావులు తవ్వి ప్రజల దాహార్తి తీర్చారు.
 ఇక మొదలు..
 పనులు పూర్తి చేశాం...బిల్లులు ఇవ్వండని అప్పటి నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల చుట్టు తిరుగుతున్నా నిధులు లేవని చెబుతున్నారని మాజీ సర్పంచ్‌లు వాపోతున్నారు. మూడేళ్లుగా ఎల్లాపూర్, సీతంపేట, పెంబర్తి, జయగిరి, కోమటిపల్లి, వంగపహాడ్, బైరోనిపల్లి, నాగారం, ముచ్చర్ల, పెగడపల్లి, సీతానగరం, సూదన్‌పల్లి గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్‌లు కలెక్టర్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా ఫలితం లేదు.
  మిగిలిన గ్రాంటు కోసం ప్రయత్నాలు..
  2011-2012లో మిగిలిన గ్రాంట్‌లో నుంచి బావులు తవ్వించిన వారికి బిల్లులు చెల్లించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2010లో సుమారు రూ.2కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. అయితే, సుమారు రూ.7కోట్ల పనులు మంజూరు చేయడంతో విచారణ చేయాలని డీపీఓను అప్పటి కలెక్టర్ ఆదేశించారు. ఈ పనుల్లో చాలా వరకు బోగస్ ఉన్నాయని డీపీఓ నివేదికలు ఇవ్వడంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి.
 విచారణ జరిపిన తర్వాత పనులు పూర్తయిన వాటికి బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించిన ప్రభుత్వం రెండు రోజుల వ్యవధి మాత్రమే అప్పట్లో ఇచ్చింది. అయితే, సదరు కాంట్రాక్టర్‌కు పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా ఉండాల్సి రావడం, వంటి కారణలతో బిల్లులు అప్‌లోడ్ చేయలేకపోగా బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ విషయమై హన్మకొండ ఈఈ శ్రీనివాసరావును సంప్రదించగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయామని, నిధులు మంజూరు కాగానే చెల్లిస్తామని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement