సాక్షి, అమరావతి : ‘మన పిల్లలను ఏదైనా స్కూలుకు పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో.. ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లుకూడా అలాగే ఉన్నాయో లేదో ఆలోచన చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై గురువారం సమీక్ష నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని, దీని మీద అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని పేర్కొన్నారు. పాఠశాలలకు సంబంధించి తొమ్మిది రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, వీటిని మూడు దశల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక అధికారులు క్రమం తప్పకుండా వసతి గృహాల్లో కనీస సౌకర్యాల ఉన్నాయో లేదో పరిశీలిస్తూ, నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాళ్లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
డిమాండు ఉన్నచోట కొత్త హాస్టళ్ల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని, ప్రతి వసతి గృహంలోనూ టాయిలెట్స్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హాస్టళ్లలో వసతుల సౌకర్యం కోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చారా? లేదా? అని సీఎం ప్రశ్నించగా.. ఇచ్చామని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి స్కూలు తెరిచే సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ యూనిఫామ్స్, పుస్తకాలు అందాలని పేర్కొన్నారు. 309 వసతి గృహాల్లో వంట మనుషులు, వాచ్‌మన్ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, దీనికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించాలని సూచనలు చేశారు.
రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, పథకాల అమల్లో పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ప్రతి ఏటా రూ. 1870 సంతృప్తికర స్థాయిలో వైఎస్సార్ చేయూతను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సాలూరులో గిరిజన యూనివర్శిటీ, పాడేరులో గిరిజన వైద్య కళాశాల, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాలతోపాటు, 7 ఐటీడీఏ ప్రాంతాలు (అరుకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, దోర్నాల)లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. గిరిజనులకు అటవీ భూముల పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment