కక్ష కాదు.. రక్ష | CM YS Jagan Comments in the Cabinet sub-committee review | Sakshi
Sakshi News home page

కక్ష కాదు.. రక్ష

Published Mon, Jul 1 2019 3:49 AM | Last Updated on Mon, Jul 1 2019 5:02 AM

CM YS Jagan Comments in the Cabinet sub-committee review - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాధనం ఆదా చేయడానికే తప్ప ఎవరి మీదో కక్ష, ద్వేషంతో అవినీతిపై విచారణ చేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో రాజకీయాలకు తావు లేదని, కేవలం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవినీతి జరక్కుండా సక్రమంగా వాడుకోవడమేనని తెలిపారు. నిపుణుల కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. గత టీడీపీ సర్కారులో జరిగిన అన్ని రకాల అవినీతి, కుంభకోణాలతో పాటు పలు విధానపరమైన నిర్ణయాల్లో వెనుక గల దురుద్దేశాలపై విచారణకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో దిశా నిర్దేశం చేశారు. ఆయా శాఖల్లో జరిగిన తప్పులు, లోపాలను గుర్తించాలన్నారు. ప్రజా ధనం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం, వృధా కాకూడదని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడా అవినీతి జరగకూడదని, ప్రతి శాఖలో ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఉంటుందని, జరుగుతున్న పనులను పరిశీలించి.. ఏ తప్పు జరిగినా ఆ పనులను వెంటనే ఆపేయాలని సూచించారు. రీ టెండరింగ్‌ నిర్వహించి ప్రజల డబ్బును ఆదా చేసి చూపగలిగితే.. మొత్తం వ్యవస్థకు చక్కటి సంకేతాన్ని పంపినట్లవుతుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో చేపట్టే పనుల్లో పోలవరం ముందు వరుసలో ఉంటుందని చెప్పారు.

ఎవరినైనా వివరణ కోరవచ్చు..
కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు ఎవరినైనా పిలవచ్చని, వివరణ కోరవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల నుంచి సమాచారం తీసుకోవచ్చని చెప్పారు. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి ఏం జరుగుతుందో నిరంతర పరిశీలన చేసుకుని మదింపు చేసుకోవాలని సూచించారు. గత టీడీపీ సర్కారులో జరిగిన అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఆధారాలను సేకరించాలని, వ్యవస్థను క్లీన్‌ చేయడానికి ఆపరేషన్‌ ప్రారంభిస్తూ 45 రోజుల్లో పని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెండు వారాలకోసారి కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా తాను పాల్గొంటానని చెప్పారు. నేరుగా, పక్కాగా దొరికిన స్కాంలపై తొలుత దృష్టి సారించాలని, ఇప్పుడు జరుగుతున్న పనులు ఇచ్చిన ధర కన్నా తక్కువకే జరుగుతాయనుకుంటే వెంటనే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని సూచించారు. విద్యుత్‌ కొనుగోళ్లలోనే ఏటా రెండు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు.

రివర్స్‌ టెండరింగ్‌లో ఎక్కువ మంది పాల్గొనాలి
ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైనా తప్పు జరిగిందని తేలితే రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించవచ్చునని, ఆ తాజా టెండరింగ్‌లో ఇప్పుడు కొనసాగుతున్న కాంట్రాక్టర్‌ కూడా పాల్గొనవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎక్కువ మంది టెండరింగ్‌లో పాల్గొనేలా చేస్తే, తక్కువకు కోట్‌ చేస్తారని, తద్వారా ప్రజాధనం ఆదా కావాలన్నదే తమ లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. పోలవరం, వెలిగొండ, అర్బన్‌ హౌసింగ్‌లపై తక్షణం దృష్టి సారించి, వెంటనే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని సూచించారు. అర్బన్‌ హౌసింగ్‌లో యూనిట్ల సైజును తగ్గిస్తే ఎక్కువ మంది పాల్గొంటారనే విషయంపై సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసి, ఆయా శాఖలే రివర్స్‌ టెండరింగ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. అవినీతిని అరికట్టి, రివర్స్‌ టెండరింగ్‌ చేసే అధికారులను ప్రభుత్వం సన్మానిస్తుందని, అందరిలో స్ఫూర్తి నింపడానికే ఈ చర్య అని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఆదరబాదరగా టెండర్లను ఖరారు చేసి ఇచ్చిన మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లను రివకరీ చేయాలని ఆదేశించారు. పోలవరం అవినీతిని 15 రోజుల్లో తేల్చాలని చెప్పారు. సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులైన ఎంపీలు విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, పీవీ మిధున్‌రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌లు పాల్గొన్నారు. 
ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు 

అవినీతి జరిగిన అన్ని శాఖల్లోనూ విచారణ : మంత్రులు బుగ్గన, కన్నబాబు
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి అన్ని శాఖల్లో, ప్రతి అంశంపైనా కేబినెట్‌ సబ్‌ కమిటీ విచారణ చేపట్టనున్నట్లు వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ ఉపసంఘం నాలుగైదు రోజులకొకసారి సమావేశం కావాలని, 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. టీడీపీ పాలన గురించి ఎంతో మంది నిపుణులు, మాజీ అధికారుల నుంచి విపరీతంగా విమర్శలు, ఆరోపణలు వచ్చాయని, ఈ నేపథ్యంలో అవినీతిపై విచారణ చేసి, సంబంధిత శాఖలను దారిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జూన్‌ 26న 1411 నంబర్‌ జీవో ద్వారా క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఐదేళ్లలో ప్రజాధనం సద్వినియోగం అయిందా లేక అన్నింట్లో అవినీతి జరిగిందా.. జరిగి ఉంటే ఎలా సరిచేయాలనే అంశాలను సబ్‌ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో రాజధాని భూసేకరణ, భూ కేటాయింపులపై చర్చించామని తెలిపారు. ప్రాజెక్టులు, దోమలపై దండయాత్ర అంటూ ప్రతి పనిలోనూ అవినీతేనని అన్నారు. కృష్ణా– గోదావరి పుష్కరాలలో వాటర్‌ ప్యాకెట్లు, షామియానాలు, ఎలుకలు పట్టేందుకు ఒక్కొక్క ఎలుకకు రూ.6 లక్షలు ఖర్చు పెట్టారని తెలిపారు.  

పారదర్శక పాలనే ప్రభుత్వ ధ్యేయం
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాల్టికి (ఆదివారం) సరిగ్గా నెల రోజులైందని, ఇంత తక్కువ వ్యవధిలోనే వైఎస్‌ జగన్‌ పాలన ఎంతో పారదర్శకంగా ఉందని ప్రజలు చెబుతున్నారని మంత్రులు బుగ్గన, కన్నబాబు అన్నారు. సబ్‌ కమిటీ నివేదిక కూడా అంతే పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. తమ ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుందని, పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.18 వేలకు పెంచడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ప్రకాశం జిల్లాలో రైతు భూమిలో డీసీసీబీ బ్యాంకు అధికారులు జెండాలు పాతారని తమ దృష్టికి వచ్చిందని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులన్నింటికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, గౌరవప్రదంగా రుణాలు వసూలు చేయాలని చెప్పామన్నారు. వడ్డీలేని రుణాలు, రైతు భరోసా, రైతుకు బీమా ప్రీమియం పూర్తిగా చెల్లింపు కార్యక్రమాలను సీఎం ప్రకటించారన్నారు. రైతులు సంయమనంతో ఉండాలని, ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement