ఆత్మబంధువులైన అన్నదాతలకు: సీఎం జగన్‌ లేఖ | CM YS Jaganmohan Reddy Write Letter To Farmers | Sakshi
Sakshi News home page

ఆత్మబంధువులైన అన్నదాతలకు: సీఎం జగన్‌ లేఖ

Published Thu, May 14 2020 4:23 AM | Last Updated on Thu, May 14 2020 4:23 AM

CM YS Jaganmohan Reddy Write Letter To Farmers - Sakshi

రాష్ట్రంలోని 49 లక్షలకు పైగా అన్నదాతల కుటుంబాలకు రైతు భరోసా సొమ్ము వరుసగా రెండో ఏడాది వారి ఖాతాల్లో జమ కానుంది. ప్రతి కుటుంబానికి శుక్రవారం రైతు భరోసా అందజేస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నదాతలకు నమస్కరిస్తూ లేఖ రాశారు. రైతు సంతోషమే రాష్ట్రం సంతోషమని ఆ లేఖలో తెలిపారు. ఏటా ఖరీఫ్‌కు ముందే మే నెలలోనే రైతు భరోసా సొమ్ము అందిస్తామనే మాటను నిలబెట్టుకుంటూ నగదు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదారులకు, సాగుదారులకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రెండో ఏడాది ఈనెల 15 నుంచి అందచేస్తున్న శుభ తరుణంలో సీఎం వైఎస్‌ జగన్‌ అన్నదాతలకు నమస్కరిస్తూ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలోనూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.  లేఖ చివరిలో రైతులకు సొమ్ము ముట్టినట్టుగా రశీదు ఉంది. లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..

రైతు సంతోషమే రాష్ట్రం సంతోషం
► దేశ ప్రజలందరి ఆహారానికి అభయమిచ్చే రైతన్నకు ప్రభుత్వం తరపున భరోసా కల్పించాలనే ఆలోచనతోనే వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతు సంతోషమే రాష్ట్ర సంతోషమని నమ్మి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే  ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏటా ఖరీఫ్‌కు ముందే మే నెలలోనే రైతు భరోసా సొమ్ము అందిస్తామనే మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో 49 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా సొమ్ము వరసగా రెండో ఏడాది వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.  



చెప్పిన దానికంటే అదనంగా రూ.17,500 రైతు భరోసా 
► రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 వంతున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతు కుటుంబానికి అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పిన దానికంటే మిన్నగా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోంది. ఏటా రూ.13,500 చొప్పున నాలుగేళ్లు కాకుండా ఐదేళ్లలో అక్షరాలా రూ.67,500 అర్హులైన ప్రతి రైతు కుటుంబానికీ రైతు భరోసా అందిస్తోంది. రూ.50 వేలకు బదులు రూ.67,500 ఇస్తోంది. తద్వారా ఐదేళ్లలో రూ.17,500 అధికంగా ఇస్తోంది. 

రైతన్నలకు రికార్డు సాయం
► రైతు భరోసా సొమ్మును మొదటి విడతగా మే నెలలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా రూ.2 వేలు చొప్పున ఇస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కౌలు రైతులకు, దేవదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా అంతే మొత్తం సహాయాన్ని రైతు భరోసాగా అందించడం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 46.69 లక్షల రైతు కుటుంబాలకు 2019–20లో రూ.6,534 కోట్లు సహాయంగా అందించాం. రైతుకు అండగా నిలబడడంలో దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. 

సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌ 1902..
► 2020–21కి సంబంధించి ఇప్పటికే ఏప్రిల్‌లో రూ.2,000 రైతుల ఖాతాల్లో జమ చేసినందున మిగతా రూ.5,500 మే 15న జమ అవుతాయి. కరోనా విపత్తుతో ఆదాయం అడుగంటినా రైతన్నకు ఇచ్చిన మాట తప్పకుండా ఈ దఫా రూ.3,675 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కౌలు రైతులకు, దేవదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసాను అందిస్తున్నాం. రూ.7,500 ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. బ్యాంకులు పాత బకాయి కింద జమ చేసుకున్నా, తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా రైతన్నలు హెల్ప్‌లైన్‌ 1902కు ఫోన్‌ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
► మే 30న గ్రామ సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. నాణ్యత ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్‌బీకేలలో లభిస్తాయి. భూసార పరీక్షలు, వ్యవసాయ ధరలు, మార్కెట్ల వివరాలు, వాతావరణ సూచనలు ఈ కేంద్రాల ద్వారా రైతులకు అందుతాయి. వాటి పక్కనే జనతా బజార్లు ఏర్పాటు చేసి వ్యవసాయోత్పత్తుల అమ్మకానికి విధివిధానాలు కూడా రూపొందిస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement