వరండాలో పడుకున్న రోగితో మాట్లాడుతున్న కలెక్టర్
కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రిమ్స్‌ను సందర్శించిన నివాస్ అక్కడి పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు. అన్ని విభాగాల్లో కలియతిరిగిన ఆయన అవకతవకలను గుర్తించి క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. అడుగు పెట్టిన వెంటనే ఆరోగ్యమిత్ర అందుబాటులో లేని విషయాన్ని గమనించి.. ఓపీ విభాగం వద్ద ఉండాలని స్పష్టం చేశారు. బ్లడ్‌బ్యాంకులో కేవలం మూడు యూనిట్ల రక్తం నిల్వ ఉందన్న విషయం తెలుసుకున్న ఆయన రక్తసేకరణపై దృష్టి పెట్టమని ఆదేశించారు. అక్కడ విధులకు గైర్హాజరైన ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. గైనిక్ వార్డులో ఉన్న గర్భిణులకు హెచ్‌బీ తక్కువ ఉందన్న విషయం దగ్గర నుంచి ఎన్నో అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆస్పత్రి ఉన్నతాధికారులను హెచ్చరించారు. రోగులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ సర్వజనీన ఆస్పత్రిని (రిమ్స్) జిల్లా కలెక్టర్ జె.నివాస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రిమ్స్‌ను పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న పరిస్థితులపై తీవ్రంగా స్పందించా రు. ఓపిలో ఉన్న ఆరోగ్య మిత్రతో ప్రారంభించి, అత్యవసర విభాగంలోని వార్డులు, బ్లడ్ బ్యాం కు, ఐసీయూ, ప్రసూతి వార్డు, గైనిక్ వార్డుల్లో తనిఖీ చేపట్టారు. ప్రతి చోటా ఏదో ఒక లోపం కనిపించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రక్త నిధిలో ఉన్న ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెం డ్ చేయాలని అధికారులకు సూచించారు. గైనిక్ వార్డులో తరచూ డే ఆఫ్‌లు తీసుకుంటున్న ఇద్ద రు డాక్టర్లపై చర్యలు తీసుకోవాని రిమ్స్ ప్రిన్సిపా ల్‌కి ఆదేశించారు. రోగులతో మాట్లాడి వైద్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మెడికల్ మేల్, ఫిమేల్ వార్డుల్లోని రోగులతో మాట్లాడారు. మందుల సరఫరా, భోజనం తదితర సదుపాయాలపై ఆరా తీశారు.
సిబ్బందిపై ఆగ్రహం..
ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే ముందుగా ఆరోగ్య మిత్ర ఎక్కడ ఉన్నారని కలెక్టర్ అడిగారు. అక్కడ ఆరోగ్య మిత్ర లేకపోడంతో ఆ విభాగం కో ఆర్టినేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగికి వెంటనే కావాల్సిన సహాయాన్ని అందించాల్సిన ఆరోగ్య మిత్ర ఎక్కడో ఉంటే కుదరదన్నారు. అనంతరం ఓపీ విభాగాన్ని పరిశీలించారు. అక్కడ కంప్యూటర్, ప్రింటర్ లేనందున తీవ్రంగా స్పందించారు. వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఐపీ రికార్డులను పరిశీలించారు. అక్కడ నుంచి అంటినల్ ఓపీ విభాగానికి వచ్చారు. అక్కడ 8 మంది వైద్యులు ఉండాల్సిన చోట ముగ్గురే ఉన్నారని, మిగిలిన వారు ఎందుకు అందుబాటులో లేరని ప్రశ్నించారు. వరుసగా డే ఆఫ్‌లు హాజరు పట్టికలో ఉన్నాయని, దీనిపై సమాధానం కావాలని సంబంధిత అధికారులను అడిగారు. స్పష్టమైన సమాధానం లేకపోవడంతో అటువంటి వారిపై చర్యలు తీసుకోవా లని ప్రిన్సిపాల్‌కు ఆదేశించారు. అక్కడే ఉన్న గర్భిణుల రికార్డును పరిశీలించారు. పలువురికి హెచ్‌బీ తక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు.
మెరుగైన సేవలు అందించాలి
ఆస్పత్రి తనిఖీ అనంతరం మీడియాతో మాట్లాడారు. రోగులకు సకాలంలో సేవలు అందాల ని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. కళాశాలకు ఈ ఏడాది ఎంబీబీఎస్‌లో మరో 50 సీట్లు అదనంగా రానున్నాయన్నారు. గైనిక్ వార్డులో లిఫ్ట్ అవసరం ఉందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున జ్వరాలు ప్రబలుతున్నాయని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. మం దుల సరఫరాలో సమస్యలు ఉంటే కొనుగోలు చేస్తామన్నారు. అన్ని ఆస్పత్రుల్లోనూ వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. వారం రోజుల్లో మళ్లీ విజిట్ ఉంటుందని, అప్పటికీ తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
బ్లడ్ బ్యాంకులో ఇద్దరి సస్పెన్షన్
రక్తనిధిని పరిశీలించి నిల్వలు ఎంత ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. తక్కువగా రక్త నిల్వలు ఉన్నా.. ఎందుకు రక్త సేకరణ చేయలేదని సిబ్బందిని ప్రశ్నించారు. వేసవి సమస్యని చెప్పే ప్రయత్నం చేయగా.. ఇంతమంది విద్యార్థులున్నారని ప్రణాళిక ప్రకారం రక్త సేకరణ చేస్తే సమస్య ఉండదన్నారు. కేవలం మూడు యూనిట్ల రక్తం ఎలా సరిపోతుందన్నారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైన మేరకు రక్తాన్ని సేకరించాలన్నారు. సిబ్బంది హాజరును పరిశీలించారు. హాజరు పట్టికలో సంతకాలు చేసి తనిఖీ సమయంలో లేని ఇద్దరు సిబ్బంది భాను, శ్రావణిలను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. హాజరుపట్టికలో బ్లడ్ బ్యాంకు ఇన్‌చార్జి డాక్టర్ శ్రీకాంత్ సంతకం లేకపోవడాన్ని ఆక్షేపించారు. విధులకు హాజరైతే ఎందుకు సంతకం చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment