
నిత్య పెళ్లికొడుకుపై ఫిర్యాదు
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ఒకరిని.. ఇద్దరిని కాదు ఏకంగా నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుని వారిని నట్టేటముంచాడు. మాయమాటలతో బురిడీకొట్టి నలుగురిని బుట్టలో వేసుకున్న నిత్యపెళ్లి కొడుకు బాగోతం.. కాస్త నాలుగో భార్యతో పెట్టుకున్న వివాదంతో బట్టబయలైంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసింహనగర్‌కు చెందిన జన్న అరుణ్‌కుమార్ న్యూగరుడా ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నాడు.
ఈయన తన భార్య చనిపోయిందని చెప్పి శివాజీపాలేనికి చెందిన శ్యామలను 2015లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ పాప కూడా జన్మించింది. వాహనం కొనుగోలు కోసం డబ్బులు కావాలని చెప్పి శ్యామల వద్ద రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత తరచూ గొడవ పడుతూ ఆమెను దూరం చేయడం మొదలు పెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన శ్యామల.. అరుణకుమార్ గురించి ఆరా తీసింది. తనకంటే ముందు మరో ముగ్గురు మహిళలను పెళ్లిళ్లు చేసుకున్నట్టు తెలుసుకుని షాక్‌కు గురైంది.
మొదటి భార్యకు ఒక సంతానం కూడా ఉంది. రెండో భార్య చనిపోయింది. మూడో భార్యకు పాప ఉంది. తనను నాలుగో పెళ్లి చేసుకుని నట్టేట ముంచాడని శ్యామల భోరున విలపించింది. పోలీసులను ఆశ్రయించి, మహిళల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్న అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరుతోంది. ఈ కేసు మహిళా పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని, అక్కడ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు మహిళా పోలీసులకు శ్యామల ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.