
ప్రత్యేక హోదాకు అన్ని పూర్తి
జాతీయ అభివృద్ధి మండలి ఆమోదమే మిగిలింది విద్య, వైద్య, సాంకేతిక వైజ్ఞానిక సంస్థలన్నీ ఆంధ్రాకు ఇస్తాం: వెంకయ్యనాయుడు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాకు జాతీయ అభివృద్ధి మండలి మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. విశాఖపట్నంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఆందోళన చెందాల్సిన పనేలేదన్నారు. ప్రత్యేక హోదా నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని చెప్పారు. రాష్ట్ర విభజనను ఆంధ్ర ప్రజలు కోరుకోలేదని, అయినా విభజన జరిగిపోయిందని గుర్తుచేశారు. విడిపోయిన తెలంగాణలో విద్య, వైద్య, సాంకేతిక వైజ్ఞానిక సంస్థలన్నీ ఉన్నాయని, ఆంధ్రాలో అలాంటివేమీ లేనందునే ప్రత్యేక హోదాకు పట్టుబట్టామని చెప్పారు. హైదరాబాద్‌లోనే పేరొందిన అన్ని సంస్థలు ఉన్నాయని, ఆ లోటును భర్తీ చేసేందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. గత యూపీఏ ప్రభుత్వం అప్పుడే సాంకేతిక సమస్యలన్నీ తొలగించి ఉంటే ఇప్పుడీ సమస్య, గందరగోళం, అనుమానాలు ఉండేవికాదన్నారు. విభజన వల్ల కలిగిన ఆర్థికలోటును ఏడాది పాటు కేంద్ర బడ్జెట్ నుంచే విడుదల చేస్తామని ఇందులో కూడా అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సందేహాలు, పునరాలోచన అక్కర్లేదన్నారు. హైదరాబాద్‌కు సమాంతరంగా అన్ని విద్య, వైజ్ఞానిక సంస్థలన్నీ ఆంధ్రాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏయే ప్రాజెక్టులు అంశాల వారీగా రావాలో సంబంధిత కేంద్ర మంత్రులందరికీ లేఖలు రాశానని, అవన్నీ త్వరలోనే కార్యరూపంలోకి వస్తాయని తెలిపారు.
ప్రతిపక్షాలకు ఒక్కటే చెబుతున్నా..
‘ప్రతిపక్షాలకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. హుందాగా వ్యవహరించ ండి. ప్రజా తీర్పును కొన్నాళ్లయినా గౌరవించండి. మీ పరిస్థితి చూస్తుంటే ప్రజా సందేశాన్ని మీరు అర్థం చేసుకున్నట్టు లేరు. అందుకే కొన్నిచోట్ల ఆందోళనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తే కరెంట్ వస్తుందా..’ అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 రోజులైనా కాలేదు.. ఇన్నేళ్లూ మీరే అధికారంలో ఉన్నారు. అప్పుడు ఇవ్వలేని కరెంట్ తాము 10 రోజుల్లో ఎలా ఇవ్వగలమో విజ్ఞతతో ఆలోచించాలి..’ అని సూచించారు. గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తామని, సీమాంధ్రలో ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుకు అధికారుల నిర్ణయమే అంతిమమని చెప్పారు. జోన్ ఎక్కడ వచ్చినా ఆంధ్రప్రదేశ్‌కే చెందుతుందన్నారు. మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉండేలా సీఆర్‌జెడ్ నిబంధనలను సవరిస్తామని ప్రకటించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కె.హరిబాబు, ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్‌రావు, కార్యవర్గసభ్యుడు చెరువు రామకోటయ్య, నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు పాల్గొన్నారు.
వాకర్స్‌తో వెంకయ్య ముచ్చట్లు
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో ఆదివారం ఉదయం వాకింగ్ చేశారు. చదువుకునే రోజుల్లో ఇదే బీచ్‌లో ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేవాడినని తోటి వాకర్స్‌తో కొద్దిసేపు తన పాతరోజులను గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. విశాఖపట్నం లోక్‌సభ నుంచి హరిబాబును గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తప్పక నెరవేరుస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖలో ఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎంపీ హరిబాబు, బీజేపీ నగర అధ్యక్షుడు నారాయణరావు, పార్టీ నాయకులు ఆయనతో వాకింగ్‌లో పాల్గొన్నారు.