చింతువానిపేట సమీపంలో నిర్మాణం పూర్తిగాక శిథిలావస్థకు చేరిన వాక్‌వే బ్రిడ్జి
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో వంశధార ఎడమ ప్రధాన కాలువ కింద దాదాపు లక్షన్నర ఎకరాల ఆయకట్టు ఉంది. బీఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు పరిధిలో ఇంజనీరింగ్ సర్కిళ్లు ఐదు ఉన్నాయి. అవి కన్‌స్ట్రక్షన్ డివిజన్ (హిరమండలం), కన్‌స్ట్రక్షన్ డివిజన్–2 (ఆమదాలవలస), ఇన్వెస్టిగేషన్ డివిజన్ (ఆమదాలవలస), మెయింటినెన్స్ డివిజన్ (నరసన్నపేట), మెయిన్ కెనాల్ డివిజన్ (టెక్కలి). వంశధార నీటి పారుదల వ్యవస్థలో భాగంగా ఉన్న పిల్ల కాలువలపై షట్టర్లు, వాక్ వే బ్రిడ్జిలను నిర్మించే ఉద్దేశంతో ఆయా శాఖల ఇంజనీర్లు ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
2006–07 ఆర్థిక సంవత్సరంలో 261 షట్టర్లు, 1058 వాక్‌వే బ్రిడ్జిలు, 2007–08లో 24 షట్టర్లు, 14 వాక్‌వే బ్రిడ్జిలు, 2008–09లో 22 షట్టర్లు, 245 వాక్‌వే బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 307 షట్టర్లను రూ.10.65 కోట్లతోను, 1,317 వాక్‌వే బ్రిడ్జిలను సుమారు రూ.51.41 కోట్లతోను నిర్మించేందుకు మూడు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన ఆదిత్యతేజ మెకానికల్ వర్క్స్, మణికంఠ ఫ్యాబ్రికేటర్స్, శ్రీకాకుళం నగరానికి చెందిన సాత్యవి ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఈ టెండర్లను దక్కించుకున్నాయి. మొత్తం 1,624 స్ట్రక్చర్లను రూ.62.02 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.
టీడీపీ నాయకుల గగ్గోలు...
వంశధార ఆయకట్టులోని పంటపొలాలన్నింటికీ సక్రమంగా సాగునీరు అందించేందుకు కాలువలపై షట్టర్లు, అలాగే రైతులు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వాక్‌వే బ్రిడ్జిలు నిర్మించడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. నిర్మాణానికి అవసరమైన ఇనుప రేకులు (ఎంఎస్ షీట్లు), స్క్రూ రాడ్లు, హ్యాండ్ రెయిల్స్ తదితర సామాగ్రి దాదాపు 80 శాతం నిర్మాణ ప్రదేశాలకు కాంట్రాక్టు సంస్థలు చేర్చాయి. 2009 సాధారణ ఎన్నికలు ముగిసే సమయానికి 9 షట్టర్లు, 41 వాక్‌వే బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యింది. మరో 21 షట్టర్లు, 227 వాక్‌వే బ్రిడ్జిల నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయి. అయితే ఆ ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఘోరంగా ఓడిపోయారు. ఈ పరాభవం నుంచి బయటపడటానికి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నెపం వేసేందుకు షట్టర్ల కుంభకోణం అంటూ గగ్గోలు మొదలెట్టారని బాధితులు వాపోతున్నారు. నిర్మాణ సామాగ్రి అధిక ధరకు కొనుగోలు చేశారని, సామాగ్రి లెక్కల్లో తప్పులు చూపించారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. దీనిపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఐదేళ్ల పాలనలో నత్తనడక...
2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ఆరోపణల్లో వాస్తవానికి నిగ్గు తేల్చే అవకాశం ఉన్నా ఆ దిశగా పట్టించుకోకపోవడం గమనార్హం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దర్యాప్తు వేగవంతంగా జరిగింది. వంశధార ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లలో 33 మంది 2009 ఆగస్టు నెల 3వ తేదీన సస్పెండ్ అయ్యారు. 2013 సంవత్సరంలో మరో 17 మందిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. కానీ టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత దర్యాప్తు నత్తనడకను తలపించింది. నరసన్నపేట, టెక్కలి పోలీస్టేషన్లలో నమోదైన కేసుల్లో దర్యాపు సక్రమంగా సాగలేదు. కేసును సీఐడీకి ప్రభుత్వం అప్పగించినా నేటికీ కొలిక్కిరాలేదు.
తుప్పుపడుతున్న షట్టర్లు, సామగ్రి...
తొలుత నిర్మాణం పూర్తయిన షట్టర్లు, వాక్‌వే బ్రిడ్జిలకు నిర్వహణ లేక తుప్పుపట్టిపోతున్నాయి. అర్ధంతరంగా నిర్మాణ పనులు నిలిచిపోయిన చోట్ల సామాగ్రి చోరీకి గురయ్యాయి. మిగిలిన సామాగ్రి ప్రస్తుతం తుప్పు పట్టేస్తున్నాయి. సుమారు రూ.20 కోట్ల విలువైన ఇనుప సామాగ్రి, విడిభాగాలను 2011 సంవత్సంలో సీఐడీ సీజ్ చేసింది. వీటిని నరసన్నపేట వంశధార కార్యాలయ ఆవరణలోని గోదాములతో పాటు జలుమూరు, బుడితి, శ్రీముఖలింగం, సీటీ పేట, హరిశ్చంద్రపురం, కోటబొమ్మాళి, టెక్కలి, పలాస మండలంలోని మొదుగపుట్ట తదితర చోట్ల ఉన్న గొదాముల్లో ఉంచారు. ప్రస్తుతం ఇవి పూర్తిగా తుప్పు పట్టాయి. వాటిని ఉపయోగించుకోవడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని గత కలెక్టరు పి.లక్ష్మీనరసింహం టీడీపీ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన సామాగ్రి ఎందుకూ పనికిరాకుండా పోతోంది. మరోవైపు షట్టర్లు లేక సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment