సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూయేతర కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా ఆరుగురి పేర్లను ఖరారు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ జాబితాలో ఎన్.సత్యనారాయణ, సి.శ్రీధర్, ఇంతియాజ్, ఎస్.కోటేశ్వరరావు, అరవింద్‌సింగ్, ఎం.ప్రశాంతి ఉన్నారు. మొత్తం ఆరు రెవెన్యూయేతర పోస్టులకుగాను రాష్ట్రం నుంచి మొత్తం 30 మందికిపైగా అధికారులు పోటీపడ్డారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డిసహా పలువురు మంత్రుల పేషీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు కన్‌ఫర్డ్ ఐఏఎస్‌కోసం పోటీ పడినవారిలో ఉన్నారు.
సీఎం కార్యాలయంలో సీఎమ్మార్‌ఎఫ్ విభాగంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సురేందర్ తరపున కిరణ్‌కుమార్‌రెడ్డి, రవాణా శాఖలో పనిచేస్తున్న కృష్ణమూర్తి తరపున బొత్స, రెవెన్యూ మంత్రి పేషీలో ఓఎస్డీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు తరపున రఘువీరారెడ్డి సిఫారసు చేసినా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పట్టించుకోలేదు. పైన పేర్కొన్న ఆరుగురి పేర్లను సిఫారసు చేస్తూ యూపీఎస్సీ పంపిన జాబితాకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ జాబితాలో గవర్నర్ కార్యాలయంలో పనిచేస్తున్న కోటేశ్వరరావుకు చోటు దక్కడం గమనార్హం.