సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేతలు అటు సమైక్యాంధ్రకు లేదా ఇటు విభజనకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితుల్లేకే.. జగన్‌మోహన్‌రెడ్డితో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందంటూ ప్రచారం మొదలుపెట్టారని ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ అన్నారు. జగన్‌తో చేతులు కలపాల్సిన పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానికి లేదన్నారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. తెలంగాణ అంశంలో పార్టీ అధిష్టానం వైఖరినే తప్పుపడుతూ మాట్లాడుతున్న సీమాంధ్ర పార్టీ నేతలు 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే సహచర సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను చేతకాని దద్దమ్మలంటూ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ భవిష్యత్‌లో ఏ పార్టీలోకి పోతారో తెలియదని, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కాంగ్రెస్‌వాదిగా ఉండాలని సూచించారు.