పునరాలోచనలో కాంగ్రెస్: ఎంపి అనంత
ఢిల్లీ: సీమాంధ్ర ప్రజల నిరసనలతో రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పునరాలోచనలో పడిందని ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన సాక్షితో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతిని చూసే కాంగ్రెస్ హైలెవల్ కమిటీ వేసిందని పేర్కొన్నారు. కమిటీ సంప్రదింపులు అయ్యేంతవరకు విభజన ప్రక్రియ ఆగుతుందని చెప్పారు. హైదరాబాద్, నదీజలాలు, ఉద్యోగులు, సీమాంధ్ర ప్రజల భద్రతే తమ ప్రధాన ఎజెండాగా పేర్కొన్నారు. కమిటీ ఎదుట తమ వాదనలు వినిపిస్తామని వెంకట్రామి రెడ్డి చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలపడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో బంద్లు - రాస్తారోకోలు - వాహనాలు తగులబెట్టడం - దిష్టిబొమ్మల దగ్ధం..... ఉధృత రూపంలో ఆందోళన కొనసాగుతోంది. ఎపి ఎన్జీఓలు కూడా రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అనడంతో వారు సమ్మె హెచ్చరిక చేశారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రభుత్వ కార్యదర్శికి నోటీస్ కూడా ఇచ్చారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఇళ్లను కూడా ముట్టడించారు. కొన్ని చోట్ల వారిని నిలదీశారు.
దీంతో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు మూడు రోజుల నుంచి కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ను కలిసి సమైక్యవాదం వినిపించారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. ఈ నేపధ్యంలో సీమాంధ్రుల సమస్యలు వినేందుకు నలుగురు సభ్యులతో కాంగ్రెస్ హైలెవల్ కమిటీని నియమించారు. ఈ కమిటీ సీమాంధ్రులతో సంప్రదింపులు జరిపేంతవరకు రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోతుందని వెంకటరామిరెడ్డి చెబుతున్నారు.